పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0041-4 భూపాళం సంపుటం: 06-175

పల్లవి:

పొలయలుక నిద్దరలు భోగించ దొరకొంటి
అలర వడి మేల్కొనవె అఖిలేశ్వర

చ. 1:

తరుణిమైనపుడె పరితాప సూర్యుఁడు వొడిచె
వరుస జెలి కన్నుఁగలువలు మొగిచెను
మరుని సాయకపు తామరలు వికసించె
కరుణతో మేల్కొనవె కమలేశ్వర

చ. 2:

కాంత నిట్లూర్పులను గాలియును నగ్నియును
వంత చెమటలవాన వరుణుండును
వింతలుగ నిన్ను సేవింతుమని యున్నారు
పంతమున మేల్కోనవె పరమేశ్వర

చ. 3:

మెలుఁత పెనుఁదురుమనెడి మేఘమండలములో
నలుగడలఁ జెలఁగె సుమనసపంక్తులు
కులికి పూవులవాన గురియంగ నున్న దిదే
చలముడిగి మేల్కొనవె సర్వేశ్వర

చ. 4:

కదిసి పులకలసృష్టి కడలేక పొడమించు
మదనుఁడను మానస కమల భవుఁడును
ముదిత కోపపుహరుఁడు మొనసి యున్నారిదే
నిదుర మేల్కొనవె జలనిధిశయనుఁడ

చ. 5:

ఒడికముగఁ జెలిలోన నుదయరాగము వొడమె
వెడలె నదె పలుకుఁ గోవిలరవములు
పడఁతిఁ గూడితివి రవి పరవశం బిఁకనైన
కడఁగి మేల్కనవె వేంకటరమణుఁడ