పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0041-1 సామంతం సంపుటం: 06-172

పల్లవి:

దిమ్మరి గాకేల మాను ధీరుఁడైన కోనేటి
తిమ్మఁడు దా లోకమెల్లఁ దిరుగాడువాఁడు

చ. 1:

తోరమైన ముత్యాల తొళసిపూసల పెద్ద
పేరు దనవురముపై బెట్టినవాఁడు
గారవంపుఁ బచ్చఁబట్టు గట్టినవాడు వొ
య్యారపు గొల్లెతలఁ గూడాడినట్టివాఁడు

చ. 2:

పీలిచుట్టుదలవాఁడు పెదపెదకన్నుల
వాలుఁజూపుల సిరికి వలచువాఁడు
జాలిబెట్టి లోకమెల్ల జట్టిగొన్నవాఁడు తా
నేలనుండి మింటఁబాఱ గాలు చాఁచువాఁడు

చ. 3:

కొండ మోఁచినట్టి వాఁడు కొండ వేల నెత్తువాఁడు
కొండంత రాకాసులఁ గొట్టినవాఁడు
కొండవంటిదొరయైన కొండల కోనేటివాఁడు
కొండమోఁపరుల నెల్లఁ గూడపెట్టినాఁడు