పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0036-3 కాంబోది సంపుటం: 06-144

పల్లవి:

మొత్తకురే యమ్మలాల ముద్దులాఁడు వీఁడె
ముత్తెమువలె నున్నాఁడు ముద్దులాఁడు

చ. 1:

చక్యని యశోద దన్ను సలిగతో మొత్తరాఁగా
మొక్కఁబోయీఁ గాళ్లకు ముద్దులాఁడు
వెక్కసాన రేపల్లె వెన్నలెల్లా మాపుదాఁకా
ముక్కున వయ్యంగందిన్న ముద్దులాఁడు

చ. 2:

రువ్వెడితాళ్లఁదల్లిరోలఁ దన్నుఁ గట్టెనంటా
మువ్వల గంటలతోడి ముద్దులాఁడు
నవ్వెడిఁ జెక్కులనిండా నమ్మిక బాలునివలె
మువ్వురలో నెక్కుడైన ముద్దులాఁడు

చ. 3:

వేల సంఖ్యల సతుల వెంటఁ బెట్టుకొని రాఁగా
మూలఁ జన్ను గుడిచీ నీముద్దులాఁడు
మేలిమి వెంకటగిరి మిఁద నున్నాఁడిదె వచ్చె
మూల భూతి దానైన ముద్దులాఁడు