పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0036-1 ముఖారి సంపుటం: 06-142

పల్లవి:

కన్నుల తుదలం గెంపు గానరాఁగాను నీకు
నన్నువ యలుకలు వేఱాయ నొసవితిమి

చ. 1:

చేరి నీ గుబ్బలమీఁది చెమట ముత్యము లోలి
తోరపు ముత్యాల సందుల నుండంగా
కూరిమి నీ పతి రతిఁ గూడిన నిబ్బరమున
హారములు చెదరి యే మాయ నొసవితిమి

చ. 2:

పెట్టిన కస్తూరి బొట్టు బెరసి నీ కురులతో
నట్టునిట్టుం జిందు వందు రై యుండంగా
మెట్టుకొని చందురుని మింటిమీది రాహు వచ్చి
పట్టపగలె యెలమిం బట్టె నొసవితిమి

చ. 3:

ముదిత నీకరమూలములను వేంకటపతి
ఉదుటుంజేఁతలు నిండి ఉండంగాను
పొదలు మొగ్గలతోడి పూలతీగెలతావి
వెదచల్లుచును విఱ్ఱవీఁగె నొసవితిమి