పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0034-6 సామంతం సంపుటం: 06-135

పల్లవి:

పులకజొంపములె పో పుంఖాను పుంఖముల
తెలుపులును మఱపులును దెచ్చెఁ గోమలికి

చ. 1:

చేటెఱుంగనికూన చెలి చిత్తమే కదా
కోటికిని బడ గెత్తెఁ గోరికలను
తేటైన తమకములు దీని పొందుననెపో
పోటుఁబాటును జేసెఁ బొలిఁతి కన్నీరు

చ. 2:

కలి మెఱుంగని విందు కాంత వయసే కదా
కలశంబు లెత్తెఁ దమకపు మేడకు
తెలిఁగన్నుఁగవచూపు దీనిచేఁతలనెపో
తలవాకిటికిఁ దెచ్చఁ దరుణి ప్రాణములు

చ. 3:

తనివెఱుంగనియాన తరుణి వేడుక గదా
నినుపులై రతులు పెన్నిధు లాయెను
వినుతింప నిదియపో వేంకటేశ్వరుఁ దెచ్చి
ఘన పరవశము తరంగములు గావించె