పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0034-4 కాంబోది సంపుటం: 06-133

పల్లవి:

చెలియ మోహము చూడరమ్మా
చెలియ మోహము నేఁడు చెలుల కగ్గలమాయ

చ. 1:

చిత్త మాతని మీఁద చేయి చెలియ మీఁద
కొత్తెన గమనంబు కొన వేళ్ల మీఁద
తత్తరపుఁ దాపంబు తనువల్లి మీఁద
బిత్తరపుఁ గోపంబు ప్రియ సతుల మీఁద

చ. 2:

అలపులును సొలపులును అంగజుని మీఁద
తలపంత యెడ లేక దైవంబు మీఁద
పలుకులును బంతములు ప్రాణంబు మీఁద
తెలుపులును తెగువలును దీమసము మీద

చ. 3:

ఇంపు సొంపులు వేంకటేశ్వరుని మీఁద
గుంపైన చందురులు కుచయుగము మీఁద
కెంపుఁ గనుగవచూపు గిలిగింత మీఁద
దంపతుల పరిణతులు తమకంబు మీఁద