పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84

చతుర్వేదసారము


కరి తుర గాందోళ వరరథారూఢులై
             పోవువారును మోచిపోవువారు
నిష్టార్థ మర్థుల కిచ్చుచుండెడువారు
             దిరిపెంబు మనువుగాఁ దివురువారుఁ
గడుమంచికుడుపులు గుడుచుచుండెడువారుఁ
             గూడు లేకయ మదిఁ గుందువారు
నంగనాకేళి ననంగుఁ బెన్గెడివారు
             వనితావియోగులై వనరువారు


అయ్య నిన్నుఁ గొల్చునయ్యలు, కొలువని
కొయ్యలే గదయ్య జియ్యదేవ!
వినుతనిర్మలాంగ! విరహితవ్యాసంగ!
పటుదయాంతరంగ! బసవలింగ!

166


మహితశివాచారమార్గానువర్తులై
              నడుచువారును దప్పి నడుచువారు
జంగమారాధనల్ సల్పుచుండెడువారు
              నోలి దుర్భవవార్ధిఁ గూలువారు
సిద్ధప్రసాదసంసిద్ధిఁ బొందెడువారు
              నర్పితానర్హులై యణఁగువారు
భక్తిసంపదఁ దేలి ప్రఖ్యాతు లగువారుఁ
              బాయనినిందలఁ బడెడువారు


అయ్య నిన్నుఁ గొల్చునయ్యలు; కొలువని
కొయ్యలే గదయ్య జియ్యదేవ!
వినుతనిర్మలాంగ! విరహితవ్యాసంగ!
పటుదయాంతరంగ! బసవలింగ!

167