పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

చతుర్వేదసారము


తల్లి తప్పక యౌషధమ్ముల సేవించి
               శిశువులరోగముల్ చెఱచునట్లు
గోవును బిండఁగఁ గొదమను గొన సంత
               సిలి జనులకుఁ బాలు చేపినట్లు
చెఱువులజలములఁ బెరుగుసస్యంబులఁ
               గర్షకులకుఁ గొల్చు గలుగునట్లు
జలములు పత్తిరి శంభుండు గైకొని
              భక్తులదురితము ల్వాపునట్లు


దాన తనుమనోధనము లుద్ధతి గ్రహించి
యెలమి మోక్షంబు భక్తుల కలరఁజేసి
లీల నోలాడు జంగమలింగములను
బ్రమసి కలిసినఁ దగు భక్తి బసవలింగ!

150


తాలవృంతములలో గాలి యున్నదె కొంత
               విసరంగ విసరంగ నెసఁగుఁగాక
చెలఁదిలోపలఁ దంతువులు గొన్ని యున్నవే
               యల్లంగ నల్లంగ నలరుఁగాక
శిలలలోఁ బ్రతిశబ్దములు గల్గియున్నవే
               పలుకంగఁ బలుకంగఁ బలుకుఁగాక
చెలమలోపల నొక్కజలనిధి యున్నదే
               ముంపంగ ముంపంగ నింపుఁగాక


యట్లు నిర్వంచకుఁడు గానిహరుని భక్తి
పరునిముందట నున్నదే పసిఁడిప్రోఁక
కడఁగి సేయంగఁ జేయంగఁ గలుగుఁగాక
భక్తిమాహాత్మ్యమున మఱి బసవలింగ!

151