పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

75


ఎఱుకచే సద్భక్తిపరులను గూడక
             గౌరవస్థితి చెడఁ గోరువారు
తనయాడినట్టు లాడనిజంగమము నెట్టి
             ప్రభువునైనను మీఱి పలుకువారు
లింగార్చనము సేయుసంగతి నైనను
            యద్వైతవాదంబు లాడువారు
శివలింగపూజలు శేఖరంబుగఁ జేసి
            యంగభోగములకై యలరువారు


జంగమయ్యకు లే దని చని భుజించి
మీఱి భక్తిని జెడి బొంకువారు తమ్ము
మిగులఁ గైవారములు సేయ మెచ్చువారు
భక్తిగోష్ఠికిఁ బాత్రులే బసవలింగ!

148


తగ నగ్ని నాధారముగఁ జేసి యంబుధి
             తనివార నుదకంబు ద్రావునట్లు
భూరుహం బవని నాధారముగను జేసి
             యింపార నీరు గ్రహించునట్లు
వారక వత్తి నాధారంబుగాఁ జేసి
             తవిలి దీపము నెయ్యి ద్రావినట్లు
యాతనాదేహంబు నాధారముగఁ జేసి
            యాత్మ దా సౌఖ్యంబు లందునట్లు


నెసఁగ జంగమమూర్తి పంచేద్రియములు
నట్ల యాధారముగ సముద్యత్సుభక్తి
హరుఁడు భోగించు భోగంబు లవధరించు
భక్తజనహితార్థంబుగా బసవలింగ!

149