పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

అఖండయతి, రేపద్వయయతిప్రాసమైత్రి సోమనాథునకు సమ్మతమనుటకు దృష్టాంతములు క్వాచిత్కముగ నీగ్రంథమునను జూపవచ్చును.

ఆంధ్రమున వీరశైవవాఙ్మయమునకు సంబంధించిన యీమహాకృతిని శైవగ్రంథములు పెక్కు సంపాదించి ప్రకటించిన మా మిత్రులు కీర్తిశేషులు శ్రీ గంగపట్టణపు సుబ్రహ్మణ్యకవిగారు తొలుదొలుత 1914 సంవత్సరమున బందరులోని భైరవముద్రాక్షరశాలలో ముద్రించి ప్రకటించినారు. ఆముద్రణము బాగుగాఁ బరిష్కృతము గానందున నందుఁ బెక్కుదోషములు దొరలినవి. దీనికిఁ దాళపత్రప్రతులు ప్రాచ్యలిఖితపుస్తకాలయమునఁ గూడఁ దక్కువగానున్నవి. ఇందు శ్రుతిస్మృత్యాదిప్రమాణముల నుదాహరించుటలో సోమనాథుఁడు వానిని బూర్తిగా నొసంగక కుదించి యలఁతియలఁతితునుకలుగాఁ బేర్కొనుటచే వానిసుష్ఠుస్వరూపమును లేఖకులు సరిగా గ్రహింపఁజాలకుండుటచే వ్రాతప్రతులలో లేఖకదోషము లెక్కువగా దొరలినవి. మఱియు "శివానుభవసూత్రవివరము” అనుశీర్షికతో 202-297 వఱకు నున్నపద్యములు చాలవఱకు శివానుభవజ్ఞానము లేనివారికి దురవగాహము లవుటచే నందులోఁ గూడఁ బలుతావులఁ గవిపాఠములు మఱుఁగువడి లేఖకులవ్రాఁతలలో నపపాఠములు దొరలినట్లు కాననగును. ఇట్టి చిక్కులతోడను దోషములతోడను గూడిన వ్రాఁతప్రతులఁబట్టి యీగ్రంథమును లెస్సగాఁ బరిష్కరించి ముద్రించుట దుస్తర మని చెప్పనక్కఱలేదు. అయినను సాధ్యమయినంతవఱకుఁ బండితపరిష్కరణము గావింపించి గ్రంథపునర్ముద్రణము నిర్వహింపఁ గీర్తిశేషులు మామిత్రులు భాషోద్ధారక వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రిగారు సంకల్పించిరి. సోమనాథుని యనుభవసారమును గూడఁ బరిష్కరింపించి వారింతకుమున్ను నాతోడ్పాటుతోఁ బ్రకటించిరి. కాని యీగ్రంథముద్రణమును గావింపక ముందే వా రస్తమించుట జరిగినది.