పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

చతుర్వేదసారము


హరి దేవకికిఁ బుట్టె ననుపురాణము విండ్రు
           హరి పుట్టె నీశున కనుట వినరు
హరి మ్రొక్కెఁ గొంతికి ననుపురాణము విండ్రు
           హరి మ్రొక్కె నీశున కనుట వినరు
హరి బుద్ధపదవర్తి యనుపురాణము విండ్రు
           హరి శైవపదవర్తి యనుట వినరు
హరి చచ్చె బోయచే ననుపురాణము విండ్రు
           హరి చచ్చె శరభుచే ననుట వినరు


హరియుఁ గ న్నిచ్చె నరునకు ననుట విండ్రు
హరియుఁ గ న్నిచ్చె నీశున కనుట వినరు
జ్ఞానహీనులు మూర్ఖు లజ్ఞానరతులు
పాపమతు లెట్టిదుష్టులో బసవలింగ!

86


హరి వీరశైవుఁ డన్నందుకు మఱియు గ
            ర్భాదానఖండమే ప్రథమసాక్షి
హరి వీరశైవుఁ డన్నందుకు దననేత్ర
            కమల మొసంగినక్రమము సాక్షి
హరి వీరశైవుఁ డన్నందుకు శంకరు
            చేతఁ బొందిన శివగీత సాక్షి
హరి వీరశైవుఁ డన్నందుకు శ్రీసాంబుఁ
            డనెడిపుత్త్రునిఁ బడసినదె సాక్షి


యిన్నిసాక్షులుఁ గాకయ పన్నుగాను
ధ్యేయుఁ డని శంభుఁ బూజించుతెలివి సాక్షి
కాని సద్ధర్మములను నిక్కం బటంచుఁ
బలుక నొల్లరు కూళ లో బసవలింగ!

87