పుట:కాశీమజిలీకథలు -01.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వరప్రసాదుల కథ

45

యున్న యిన్నగరములోఁ బ్రవేశించి యదార్థమరయుదము గాక పదుఁడు పదుఁడు అని యుదుటు గరపుటయు సంతసించుచు వసంతుండు తత్తడిని మడమలతో నడచిన నది చిత్తానుగుణ్యముగాఁ బరుగిడఁ దొడంగినది. దాని ననుసరించి తక్కినవారును వారువంబుల నడిపించిరి. ఇంతలోఁ బట్టణము సమీపించినది .

వారు మిక్కిలిసాహసముతో జనశూన్యమైన యానగరిలో నొకవీథిని గుఱ్ఱముల నడిపించుచుండిరి. గృహకవాటము లన్నియు మూయఁబడియున్నవి. అంగళ్ళన్నియుఁ గట్టివేయఁబడినవి . అక్కడక్కడ వేదికలపై జనులు నిద్రించుచుండిరి. అవ్వింత జూచి వెరగుపడుచు వసంతుఁడు సఖులారా! యీవీడు రేఁద్రిమ్మరీడులది కాదుగద. లేక దీని నెవ్వరైన నిట్టుండ వసింతురా? యిట్టి పట్టపవలున నిశీధంబునం బోలె జనులు నిద్రించుట శంకాస్పదమైయున్నది. వేగమ దీని దాటిబోవుటయే శ్రేయమని పలికిన దండు డిట్లనియె.

రాజపుత్రా! అందందు నిద్రించు వారిం జూచితివా? వారు మనవలెనేయుండిరి. రాక్షసనగరము భూతలపురము నైనచో నిట్టి మనుష్యులేల యుండెదరు? దీని కెద్దియో కారణముండకపోదు. దాటిపోవనేల? దీనిని విమర్శించి మఱియుం బోవలయు నిట్టి వింతలను జూచుటకేకదా మన మిల్లు వెడలితిమని యతండు పలుకుచుండఁగనే యొక మూల ఢం ఢం అను డిండిమధ్వని వినంబడినది.

ఆ చప్పుడు విని వరప్రసాదులు ఓహో! యెద్దియో చాటింపు కాఁబోలు. ఆకర్ణింతుముగాక యని యా ధ్వనిజాడ ఘోటకముల నడిపింపం దొడంగిరి. ఖడ్గహస్తులై యిరువురురక్షకభటు లొకడిండిమహస్తునితోఁగూడ వీథుల సంచరించుచు పౌరులారా! భద్రముగా నిద్రింపుడు. భద్రముగా నిద్రింపుఁడు మీ సొత్తుల మేము గాపాడుచుంటిమని కేకలు వైచుచుండిరి. వరప్రసాదులు వారి దాపునకుఁ బోవుటయు వారికిని వీరికిని నిట్టి సంవాదము జరిగినది.

రాజభటులు – మీరెవ్వరు?

వరప్రసాదులు — మేము కాశ్మీరదేశస్థులము.

రాజ — ఇట్టి యర్ధరాత్రంబున నిర్భయముగా సంచరించుచుంటిరేల?

వర — ఓహో! యిది యర్ధరాత్రమా! పట్టపగలుగాదా! మీ మాట లింతవిపరీతములుగా నుండుటకుఁ గారణమేమియో తెలియకున్నది.

రాజ – ఇది పగలన్నవారిని శిక్షించుట మా రాజుగారి శాసనము మీరెరుంగరు కాబోఁలు. మొదటి తప్పు మన్నించితిమి. మీ రింకొక్కసారి యట్లు మాట్లాడినచో శిక్షాపాత్రు లగుదురు సుమీ?

వర - ఇది యేమి న్యాయము నిజము బల్కినను దండించు రాజులు గలరా?