పుట:కాశీమజిలీకథలు -01.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

బ్రాతఃకాలకృత్యంబుల నిర్వర్తించుకొని తత్కాలోచితాహారంబును నాకలి యడంచుకొనిరి. వసంతుం డిట్లనియె. మితృలారా! మన మీరాత్రి ననేకయోజనముల దూరము వచ్చితిమి. ఇమ్మహారణ్యమున కంతము గానఁబడకున్నది. మనవీటికి పడమరదెస జలధిదనుక జనసంచారశూన్యమగు మహారణ్యమున్నదని మనము భూగోళశాస్త్రమునఁ జదివియుంటిమి. మనవారు మనలం బట్టుకొని తీసుకొనిపోవుదురని తలంచికదా యీదెస కరుగుదెంచితిమి. ఇంక నందులకు వెరవవలసిన పనిలేదు. ఇంటనుండి దక్షిణముగా నేఁగిన గొన్ని నగరములు గనంబడును. అవియు నిక్కడికిఁ బెక్కుదూరములో నుండవచ్చును. మన గుఱ్ఱములు జాల బడలినవి. కొంత విశ్రమించి యరుగుదముగాక. మఱియొకరేయి నిట్లు శ్రమపడితిమేని జనపదంబులం జేరుదము. ఈపాటియలసట సైరింపఁగోరుచున్నవాఁడనని యోదార్చిన వారెల్లరు సంతసించుచు నతని దయకు స్తుతిజేయఁదొడంగిరి.

వారి వాహంబులు వారివాహంబులువోలె సంసక్తాంబరంబులు సముపగతజీవనంబులునై గంభీరహేషాఘోషంబుల గమనోత్సాహంబు సూచింప నక్కుమారులు వెండియు నభిష్టించి దక్షిణాభిముఖులై పోయిపోయి రాత్రిపడినంత నొకచోట విశ్రమించి మరునాఁడు వేకువజామున గ్రమ్మరం గదలిపోదలంచిన ముదముతో నటవీవిశేషంబులం జూచుచు మిట్టమధ్యాహ్నముదనుక నేకరీతిఁ బయనంబు గావించిరి.

అల్లంతదూరములోఁ గాంచనశిఖరభాసురమైన గోపురమొండు గాంచి సాంబుఁడు అదిగో పురము పురము అని కేకలు వైచెను. రాముఁడు అవును పట్టణమే కావచ్చును. ఇచ్చట భూములు సస్యసంపూర్ణములై యొప్పుచున్నవి. అడవి పలచబడినది. జన మిందుఁ దిరుగుచున్నట్లు చిహ్నములు గనంబడుచున్నవి అని పలుకుటయుఁ బ్రవరుం డిట్లనియె.

పట్టణప్రాంతభూమి జనాకీర్ణమై యుండవలయు నిందొక్కరుండును గనఁబడఁడు. కారణమేమియో యనుటయు వసంతుండు గుఱ్ఱముల నాపుఁడని నియమించి నలుమూలలు పరికించి యిదిగో మనము నగరమునకు దాపుగా వచ్చితిమి ఇం దక్కడక్కడ గృహములు గనంబడుచున్నవి. మనుషుం డొక్కఁడును గనఁబడఁడు ఇది తర్కింపఁదగినదే యని పలికెను.

అప్పుడు ప్రవరుఁడు సౌధప్రకారవిశేషంబులం జూడ నీవీడు రాజధానివలెఁ బొడగట్టుచున్నది. ఇట్టి నగరము వెలుపల జనసంచారశూన్యం బగుట నాలోచించి మఱియుం బోవలయుననిన నవ్వుచు దండుం డిట్లనియె.

మిత్రులారా! అది యేదియైన మనకేమి భయము? మన యాయువులు గుప్తముగా దాచినమాట మరచితిరా? మిట్టమధ్యాహ్నమున నర్ధరాత్రమునఁబోలె నిశ్శబ్ధంబై