పుట:కాశీమజిలీకథలు -01.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

రెండాట లోడిపోయితినే ? ఇదిగో మూడవయాట తెలివితో నాడి సులభముగాఁ గట్టి వేయుదునని యాడి యా యాట నశ్రమముగాఁ దానిం గట్టివైచెను. అయినను రెండాటలు వరుసఁ బ్రద్యుమ్నుండే యోడెను. గావున సంపూర్ణముగా నోడినట్లే తలంచి యయ్యువతి యతని రాజభటుల యధీనము చేసినది.

ప్రద్యుమ్నుఁడు తన్ను రాజభటులు దీసికొనిపోవ, నయ్యో! నేను బూర్తిగా నోడిపోలేదు. శాసనమున వ్రాసినట్లుగాక వేరొకలాగునఁ జేయవచ్చునా? న న్నె ట్లురి దీయుదురు? యీసారి మరల నాడినచో నన్నియాటలు నేనే కట్టివేయగలను. ఈ మాట రాజుతోఁ జెప్పుడని యా కింకరులను వేడుకొనుటచే వార లావర్తమానము రాజుగారికిఁ దెలియజేసిరి. ధర్మాత్ముఁడైఁన జయభద్రుఁ డావర్త విచారింప దగినదేయని యూహించి యా సందియము దీరువఱకు బ్రద్యుమ్ను నుఱిదీయ వలదని యాజ్ఞజేసెను. ఆ వార్త యూరంతయు వ్యాపించుటచే బౌరులందరు గుంపులుగాఁగూడి చెప్పికొన సాగిరి.

లవంగి యన్న వర్తమానము విని మిగుల విచారించుచు నయ్యో నేనన్నట్లే యైనది! దాని యందమేమో యతని మోసపుచ్చినది. కాని నిజముగాఁ జతురంగములో నతని నోడించువారు లేరు. అగ్ని చెంతబెట్టిన వెన్నువలె నెంత ధైర్యశాలియైనను మగవాని మననుఁ గాంతలచెంతఁ గరుగక మానదు. కానిమ్ము ఉరితీయుట మూఁడు దినములవరకు నాపిరిగదా! నేను రేపు పోయి దాని నోడించి యతని చెర విడిపించెద నని తలంచి మఱునాఁ డుదయంబున నొరులకుఁ దెలియకుండఁ బురుషవేషము వైచికొని యా కోటయొద్దకు బోయి యా యుద్యోగస్థులతో నయ్యా! నేను రాజపుత్రికతో జతురంగమాడ వచ్చితిని. లోనికి దెలియఁజేయుఁడని పలికినది.

ఆ మాటవినిన వారు అయ్యో మూర్ఖుడా! నిన్నను వచ్చినవాఁడు నీకేమి కావలయును. పోలిక మీ యిరువురది యొక్కటిగానే యున్న దే! అతనికైన ప్రాయశ్చిత్తము నీవు వినలేదు. కాఁబోలు! అయ్యయ్యో! ఒకరికైన మరణము జూచియు రెండవవా రామెతోఁ జతురంగమాడ వత్తురేమి ? మాకుఁ జూడ గష్టముగా నున్నది. ఆమెతో మనుష్యమాత్రుఁడు చతురంగమాడి యోడింపలేడు. వట్టిభ్రాంతి యేల పొందెదవు? వచ్చిన దారింబట్టి పొమ్మని పలికినవారి మాటలు పాటిసేయక నేను ప్రభావతితోఁ జదరంగమాడక మరలనని గట్టిగా బలికినది.

అప్పుడా యుద్యోగస్థులు కాలము మూడినప్పుడు మేము చెప్పుమాటలు రుచించునా? యని పనికి యా వర్తమానము ప్రభావతికి దెలియజేసి యామె సెలవు గొని యక్కపటపురుషు నంతఃపురమునకుఁ బంపిరి. అందు బ్రద్యుమ్నునింవలె నుపచారములు చేయించి గద్దియం గూర్చుండబెట్టిన కొంతసేపటికి ప్రభావతి చెలికత్తెలతోఁ గూడవచ్చి యక్కలికితోఁ జదరంగమాడఁ దొడంగినది. అప్పుడు ప్రభావతి పెక్కుచిట్టకములు చూపి తటమటింపఁ దలంచినదిగాని యదియును ముదితయే యగుటచే దాని విలాసము లేమియు నామె మనంబునకు వికారము గలుగఁజేసినవి కావు.