పుట:కాశీమజిలీకథలు -01.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రసేనకథ

255

వోలె నాచిన్నదియు విరహమందుచునే యుండును. నీకు దృష్టాంతము చూపించెదఁ జూడుము. మనము గొంతసే పిచ్చటనే యుందము. అక్కలికి నిక్కముగాఁ నిన్ను వరించినచో గ్రమ్మరఁ దొంగిచూడక మానదు. ఇదియే తార్కాణమని పలికెను. కొంతతడవు వా రక్కడనే నిలువఁబడి యెద్దియో నిమిత్తము గల్పించుకొని నడుమ తలలు పైకెత్తి చూచుచు గాలయాపన జేసిరి.

చిత్ర సేనయు రాజకుమారుని మోహము జాచినంత స్వాంతమును వింతసంతసము వొడమఁ గొంత సంతాపంబు నొంది యందున్న సుందరులందఱు తనకుఁ బ్రాణసఖులగుట వారితో నిట్లనియె. చెలులారా! మన కోట ప్రక్కగా నిరువురు కుమారు లఱుగుచున్నారు. చూచితిరా! వారిలో నొకసుందరుడు నాడెందమునకు విందు గావించెను. వాని మొగము తొగలరాయని గేరుచున్నది. నేను దైవప్రేరణముచే గ్రిందుగ దొంగిచూచినప్పుడే వాఁడును మీదకు జూచెను. మా యిరువుర చూపులు మనంబులకు ముడిపెట్టితివి. వారికి నా యందనురాగము గలిగినట్ల తన్ముఖవిలాసమే చెప్పినది. అడుగుదాటక యిప్పటికీ నచ్చటనే యుండును. చూతురుగాక యనిన నా సఖులందఱు సంతసించుచు నా సుందరితోగూడ నేలకు దొంగిచూచిరి. ఆ సమయములో బుద్ధిసాగరుండును గామపాలుండును తలలు పైకెత్తి చూచిరి. అప్పుడు కామపాలునికి చిత్రసేనకు నంతరంగములంగల సంశయములు వదలిపోయినవి.

అయ్యండజయాన యట్లే యుండి కామపాలు నంగుళితోఁ జూపించుచు చెలికత్తెలతో నిట్లనియె.

చెలులారా! వారిలో మొదట నన్ను జూచిన చెల్వు డాతడేసుఁడీ! ఆ యిద్దరును రూపంబున సమానులై యున్నను నామనంబు వానియందే లగ్నమైనది. ఆహా! ఆమోహనాంగుడు నన్ను స్వీకరించినచో బచ్చవిల్తుని కాలిబంటుగాఁ జేసికొననే? వానిసోయగంబంతయు పరిశీలింపుఁడు. సుందరులారా! ఇట్టివేళ సిగ్గుపడి యూరకున్న పిమ్మటఁ గమ్మవిల్తుని రాయిడి కెవ్వతె తాళఁగలదు? వానియభిప్రాయము దెలిసినది గద! తెలియకున్నను భయమేమి? ఇప్పుడే యొకయుత్తరము వ్రాసి మీఁద బారవైచెద. ఒక కాగిత మిటు తెండని పలికిన తక్షణమే సఖులచే నందింపఁబడినది. దానియందు గొన్నిమాటలు తొందరగా వ్రాసి పూవులదండలోఁగట్టి యాబంతి సంతోషముతోఁ దన్నే పలుమారు చూచుచున్న కామపాలుని యుదరమునకుఁ తగులునట్లు విసరివైచినది.