పుట:కాశీమజిలీకథలు -01.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

254

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

విప్రగృహంబున బసచేసి యందుఁ గొన్నిదినంబులుండిరి. ఒకనాఁడు సాయంకాలమున వారు పురవిశేషంబు లరయుతలంపుతో సొంపుగా నలంకరించుకొని యా పట్టణపు వీథుల నరుగుచు నచ్చటచ్చటం గల వింతలఁ బరిశీలించుచు గ్రమ్మర బసలోనికి రాఁదలంచి కోటప్రాంతముగా నరుగుచుండిరి.

అప్పుడు కామపాలుని మేనిమీఁద శుభవాచిక సూచికముగా నొకతలవెండ్రుక పడినది. దానిఁజూచి యతండు జేఁతులతో గొలిచినంత బారకన్న నెక్కువగా నున్నది నైల్యాదిగుణంబులు వర్ణించుచునోహో ! యింత వింత తలవెండ్రుక యే సుందరిదో గదా యిని యూహించుచుఁ దలపైకెత్తి చూచెను. అప్పుడా గోడపైనున్న యుప్పరిగెమీద సఖులతోఁ గొలువుదీర్చి జలకమాడి తలయార్చుకొనుచున్న యా పట్టణము రాజకూఁతురు చిత్రసేన యనునది యెద్దియో పనిమీఁద క్రిందుగాఁ దొంగి చూచినది. అప్పుడా యిరువుర దృష్టులును పురోహితులవలె నా యిరువుర మనంబులకు బ్రహ్మగ్రంధి వైచినవి. వారి సోయగంబు లొండొరులకు వింత సంతసము గలుగఁజేసినవి. అంతటితో దమదృష్టుల మరల్చుకొనిరి.

అప్పుడు కామపాలుండు బుద్ధిసాగరునితో మిత్రుడా! ఇట నిలువుము. నేనొక వింత జూపించెదను. ఆహా! యిప్పుడే యుప్పరిగ నుండి యొక వాల్గంటి తొంగిచూచినది. దాని మొగము మొదట నేను జంద్రబింబమే యనుకొంటిని సుమా! అంతలో నాచిన్నది నన్నుఁజూచి చిఱునగవుతో శిరఃకంపము జేరినట్లు కనంబడినది.

అన్నా! దాని మందహాసము నా డెందమునకు మరులుకొలుపుచున్నది. ఔరా! అంత చక్కని మొగము మనమింతకు ముందెక్కడను జూచియుండలేదు. అయ్యంగన వంగి చూచునప్పుడు చంద్రబింబమును మబ్బుగ్రమ్మినట్లు నెమలిపించము వలెనున్న కేశపాశము మోముతమ్మి గ్రమ్మినది. ఆ వింతచూపు నా మదిం దగిలి యున్నది. ఇప్పుడు నాకుఁ బైకినడువఁ బాదంబులాడకున్నవి. దాని మోము క్రమ్మర జూచినదాక నిచ్చటనే యుండెదనని పలుకుచు విరాళిందూలుచున్న కామపాలునితో బుద్ధిసాగరుం డిట్లనియె.

అన్నా ! నేనా చిన్నదానిం జూడలేదు. యీ వెంట్రుకం బట్టి యూహింప మిగుల రూపవంతురాలగుట కేమియు సందియము లేదు. మఱియుఁ దొంగిచూచి నప్పుడు నిన్నుఁజూచి చిఱునవ్వు వెలయించిన దని చెప్పితివి. ఆ లక్షణము బరిశీలింప నా చిన్నది నిన్ను వలచినట్లు తోచుచున్నది. నీవూరక తొందరపడకము. నీవు