పుట:కాశీమజిలీకథలు -01.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

246

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

మెద్దియేని యిత్తువా! యని యడిగిరి. అప్పుడామె గుండెమీఁదఁ జేయివైచుకొని అమ్మో ! బాలులారా! మీరెఱుగరుకాఁబోలు. ఈ యూర నడివీథిలో బరుండరాదు. పరుండిరేని రాత్రి భేరుండమను పక్షి వచ్చి చంపును. లోపలనే చోటు చూపించెద రండనుటయు వారు నవ్వుచు నోహో! పెద్దమ్మా మమ్మా భేరుండ మేమియుఁ జేయలేదు. మాయొద్దకు దాని యూయువు మూడియే వచ్చును . మేము వీథిలోనే పరుండెద మని యామె వలదని యెంతచెప్పినను వినక వీథితిన్నెపైఁ బండుకొనిరి.

ఆమె చెప్పినమాటలచే వారికి నిద్దుర పట్టినదికాదు. అర్ధరాత్రమైనతోడనే పక్షవిక్షేపవాతంబుల బ్రాంతవృక్షంబుల పెళ పెళనుని కొమ్మలువిరిగి క్షీణదశనొంద నాభేరుండ మతివేగంబున వచ్చి యిచ్చవచ్చిన ట్లయ్యూరంతయుఁ గ్రుమ్మరి దొరికిన జీవకోటిబంచత్వంబు నొందించుచుఁ గ్రమంబున వీథితిన్నెపయిం బరుండియున్న యాకుమారుల నిర్వురం జూచి యత్యాగ్రహముతో జంప మీద కురికినది.

అప్పుడు బుద్దిసాగరుండు తటాలున లేచి కటారి బెరికి దాని రెక్కలు రెండును నరికి పిమ్మటఁ దల తెగవైచెను. ఆర్పులు చెలంగ నది నేలంబడి గిలగిలఁ గొట్టుకొనుచుఁ గొంతసేపటికి బ్రాణము వదలినది. పిమ్మట వారు తెల్లవారుజామున కేక వైచి లేపి పెద్దమ్మా! మేము పోవుచున్నామని చెప్పి యయూరువిడిచి పైకి పోయిరి..

అంత నాయూరిలో నొకచాకలి గొడ్డలి భుజముమీఁదవైచికొని యడవికిఁ బోవుచు వీధిలో జచ్చిపడియున్న యాపక్షింజూచి దానిగుఱించి రాజుచేసియున్న ప్రతిజ్ఞ వినియున్న వాఁడగుట మిగుల సంతసించుచు నలుదెసలు పరికించి యెవ్వరును రాకుండుటం జూచి యప్పు డాగొడ్డలిచే దాని యవయవయము లన్నియు ముక్కలు క్రింద నరికి ప్రోగుగా బెట్టెను. అంతలోఁ దెల్లవారుటయు జనులందరువచ్చి చూచి యది చచ్చినందులకు మిగుల సంతసించుచుఁ జాకలివానిని మిగుల శ్లాఘించిరి. చాకలివాఁడు పక్షిని జంపెనను వార్త గ్రామమంతయు వ్యాపించుటయేగాక రాజుగారికిఁ గూడఁ దెలిసినది.

అప్పుడు సింహకేతుఁడను పేరుగల యారాజు ఆపక్షియొద్దకు వచ్చి చచ్చిపడియున్న దాని యవయవములన్నియుం జూచి వెరగందుచు జాకలివానితో నీది యేయూరు. ఎవ్వడవు? ఇన్ని దినములనుండి చంపలేనిపక్షిని నీదివసంబున నెట్లు చంపితివని యడిగెను. అప్పుడు వాఁడు ధైర్యము తెచ్చుకొని దేవరా! నాది యీ గ్రామమే కాపురము. నేను జాకలివాఁడను. ఈ దినమునఁ దెల్లవారకమున్నె లేచి పొలమునకుఁ బోవుచుండ నాకాపక్షి యెదురుపడి చంపుటకు మీఁదికివచ్చినది. అప్పుడీ గొడ్డలితోఁ బ్రాణమునకు దెగించి యొక దెబ్బ గొట్టితిని. ఆ దెబ్బ దాని తలమీఁద దగిలి నేలంబడినది. పిమ్మట రెండవదెబ్బ మరలఁ దలమీఁదనే గొట్టితిని. దానితోఁ