పుట:కాశీమజిలీకథలు -01.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

ములో వ్రాసినదంతయుఁ గపటమనియు జెప్పెను. అప్పుడు నాకుఁ గోపము రాకుండునా? దానికి బదులు నేను దాని మొగము జూడనని ప్రతిజ్ఞ చేసి యట్లే నడుచుకొంటిని పిమ్మట రెండవ భార్యను బెండ్లియాడుటంజేసి మొదటిదానిని నడవిలోనికిఁ బంపవలసివచ్చినది. అది యిప్పు డెక్కడున్నదో తెలియదు. ఇదియే నావృత్తాంతము. ఇఁక నీవృత్తాంతము చెప్పుమనుటయు నాసుశీల గురువుచేసిన కపటమునకు ముక్కుమీఁద వ్రేలువై చుకొని తలకంపించుచు నోహో! ఇదియా తెలిసినది. అన్నన్నా! బ్రాహ్మణు డెంత దుర్మార్గుడని పలుదెరంగుల జింతించుచుండెను.

అంత నతండు తరుణీ! యూరకుంటవేమి నీకథ చెప్పుమనుటయు సుశీల మరల నిట్లనియె. దేవా! నాకు మీరు చెప్పినమాటలలో గొంచము సందియముండుటచే విచారించుచుంటిని. మీభార్యను గురువు రోగిష్టురాలని చెప్పినంతనే నిజానిజములు పరిశీలింపక విడువవచ్చునా? ఆతని కెద్దియేని యాముద్దియయందుఁ గోపముండి యట్లు చెప్పెనేమో ! మీరు జేసినపని యేమియు నాకు సరిపడినది కాదనుటయు నతండు అబలా! అప్పుడు నాకంత యూహ తోచినదికాదు. ఇప్పుడేమిచేయుదును! ఔను! కొన్ని కపటకృత్యములవలన నట్లు జరుగును. నిజముగా నట్టిదోషములేక యాసుశీల పటములో వ్రాసినట్లే యున్నచో నీతోసమానముగా నుండును. పాప మూరకయే విడిచితినేమో యని పలికిన మరల సుశీల యిట్లనియె.

దేవా! మగవారిచర్య లెప్పుడు నిట్లేయుండును వారెంత పరిశీలింపక చేసినను స్వతంత్రులు గావున సాగుచుండును. నాకథ యట్లుండనిమ్ము. నీ పెద్దభార్య సుశీల నాకుఁజెలికత్తియే. దాని పూర్వోత్తరమంతయు నేనెఱుంగుదును. దానివంటి చక్కనిదియు గుణవంతురాలు నీభూలోకములోలేదు. దాని గురువట్లు చెప్పుటకుఁ గారణము వినుఁడు. సుశీల వివాహదినంబున నలంకరించుకొని గురుదక్షిణనిచ్చుటకై గురువుగారింటికి బోయెను. అప్పు డాబ్రాహ్మణుఁడు అదియిచ్చు గురుదక్షిణ నందు కొనక దానిరూపమునకు వలచి తనతోఁ గ్రీడింపుమని యడిగెను. ఆసాధ్వీ యందులకుం సమ్మతింపక యాపళ్ళెర మచటఁ బారవైచి యహంకారముఖముతో నింటికి బోయినది.

ఆయీర్ష్య లోపల నుంచుకొని యాదుర్మార్గుఁడు మీతోనట్లు చెప్పెనుగాని యథార్థముగాదు. పోనీ యొకటి విచారింపుండు ఆతండూరకవచ్చి యడుగకముందే దాని చెడుగుణంబు మీతోఁ చెప్పుట కవసరమేమున్నది! బుద్ధిమంతులకు దీనిఁబట్టి చూచిన నందలి యథార్థము తేటపడదా! పాపమా సుశీల గురువుచేసిన యవమానము నాతోఁ జెప్పి చింతించినది. దానిగుణ మెవ్వరికైన వచ్చునా ! యని పలికిన నతండు తెల్లబోయి యుల్లంబు దల్లడిల్ల అయ్యో! తొయ్యలీ! ఆగురువు నన్ను మోసము చేసెనే! తెలిసికొనలేకపోతిని. కటకటా! యూరక నాసుగాత్రి నాత్రము నొందించితిని. యని యనేకప్రకారములఁ జింతించుచుండెను.