పుట:కాశీమజిలీకథలు -01.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమశర్మ కథ

219

నడువనీయక యడ్డము వచ్చి స్వామీ! దీని మీరు చూచితిరా! మిక్కిలి పొడవుగానున్న యా యుక్కుకంబముపై నిలఁబడిన బ్రాహ్మణుఁ డెవ్వఁడు! కదలక యీ పట్టణపు వింతలఁ జూచుచున్నాడా యేమి? ఈతని వృత్తాంత మెఱింగింపుఁడనిన నమ్మణిసిద్ధుఁడును పైకిఁ దలయెత్తి నిరూపించి చూచి యోరీ! దీనిపై నున్నవాఁడు నిజమయిన బ్రాహ్మణుఁడు గాడుసుమీ! అదియొక పోతవిగ్రహము. దాని కథ భోజనంబైనవెనుక జెప్పెదనులే యని పలికి నడువఁబోయిన వాఁడు మణిసిద్ధుని పాదంబులంబడి అయ్యా! గమనాయాసము వాయువఱకు మీ చరణంబు లొత్తెదను. ఇచ్చటఁ గూర్చుండి నాకు దీని వృత్తాంతము జెప్పుఁడు. విన మిగుల వేడుకగా నున్నది. అని నిర్బంధించిన నయ్యతిపతి వాని యాసక్తికి మెచ్చుకొని యచ్చటనే యొకచోట గూర్చుండి తనయొద్ద నున్న మణిప్రభావమున దాని వృత్తాంతమంతయుఁ దెలిసికొని వానికిట్లని చెప్పదొడంగెను.

కొండపల్లి యను నగ్రహారంబున సోమశర్మయను బ్రాహ్మణుఁడు గలడు. అతడు మిగుల దరిద్రుఁడు. ఎన్ని వ్యాపారములు చేసినను నొకకాసై నను లభించినది కాదు. అతం డొక్కనాఁడు భార్యతో నిట్లనియె బోటీ ! మన యిరుగుపొరుగుననున్న భాగ్యవంతులఁ జూడ జూడ నాకెంతయు విచారముగానున్నది. వారు భార్యలతోఁ గూడి హంసతూలికాతల్పంబుల గాజుదీపపుకాంతులు ధవళకుడ్యకాంతులతో మేలమాడఁ గ్రీడింపుచుందురు.

నీవు చూడ నెప్పుడును మాసినగుడ్డలే కట్టుకొనుచుఁ దలదువ్వుకొనక యసహ్యముగా నుందువు. మన యిల్లుజూడ పేడతో దుక్కుతో నిండియుండును. ప్రొద్దు గ్రుంకినంత కొంచెము సేపైన దీపముంచవు. చీకటిలోఁ గన్నులుగానక నల్లులు గుట్టుచుండ నులకమంచముం బరుందుము. మనకును వారికిని మిగుల దారతమ్యము గలదు. వారు భగవంతునికి బంధువులును మనము విరోధులమా? మనకు మాత్ర మట్టి యైశ్వర్యము లుండరాదా? ఇట్టి దరిద్రపుబ్రతుకు బ్రతుకుటకంటె జచ్చుటయే మేలు. ఇంతకును కారణురాలవు నీవు. ఏమనిన బురుషునికి భార్యమూలముగా నైశ్వర్యము పట్టును. దరిద్రముగూడ దానిమూలముననే వచ్చును. దీనికి దృష్టాంతరముగా నొక కథ చెప్పెద వినుము.

పూర్వము విక్రమార్కుండును భట్టియు దేశసంచారము చేయుచుండ నొక యడవిలో నిసుకమీఁద సాముద్రికశాస్త్రలక్షితములైన రేఖలతో నొప్పుచున్న పాదచిహ్నములు గనంబడినవి. వానింజూచి విక్రమార్కుఁడు భట్టితో నీపాదచిహ్నములం చూచితివా! వీనిఁచూడ నీమార్గంబున మనకన్న నధికుడగు మహారాజు నడచినట్లు తోచుచున్నది. వేగనడువుము. మనకు దాపుననే యుండవచ్చును. అతండెవ్వడో చూతమని పలికిన భట్టి యిట్లనియె.