పుట:కాశీమజిలీకథలు -01.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

182

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

భటులు పల్లకీ గొనిపోయి కళానిలయ నిలయంబున కరిగి ముహూర్తసమయంబునకు నయ్యండజయానను గళ్యాణగేహప్రాంతమునకు దీసికొనివచ్చిరి.

అందు నమ్మకమైన దాదులు కొంచెముగా నుండిరి. వా రాకళానిలయకు మంగళకృత్యములు నిర్వర్తించి దేవీ! నీ పతి యింతకుమున్ను గదిలోని కరిగి నీరాకకు వేచియున్నాడు నీవును త్వరగా నరిగి యతని యభీష్టము నెరవేర్చమని పలికిఁ యుచితసల్లాపముతో నాపల్లవపాణిని లోనికిఁ ద్రోసిరి.

అగ్గజయాన సిగ్గునంబలె కొంతదనుక శృంగారచేష్టల నభినయించుచు నెట్టకేలకు బలాత్కారముగా లోపలికుఁ బోయి తలుపుమూలను నిలువంబడెను. ఆ రాజును తిమ్మర్సును అంతకుఁ బూర్వమే యాగదిలోనున్న నేల సారంగములోఁ బ్రవేశించి యాచిన్నది చేయు కృత్యములం జూచుచుండిరి. దివ్యాలంకారమండితంబగు నాగదిలో గాజు దీపములచే బట్టపగలుగా నుండెను.

ఆ కాంతయుఁ కొంతదనుకఁ దలుపు దెస నిలువంబడి యెంతకుఁ దన్ను గాంతుఁడు బిలువనికి సంకోచమందుచు నతనికి నిద్దురపట్టినదిగా నూహించి సంతోషించుచు నామంచము దాపునకరిగి యందున్న విగ్రహము మొగముపైఁ జూట్కులు నెరయజేసి కన్నులుమూసి యుండుట తిలకించి గాఢముగా నిద్రించుచున్న వాఁడనియే యూహించి యిప్పటికి దనకోరిక భగవంతుడుఁ దీర్చిననాఁడు గదా! యని సంతసించుచు నలుదెసలు బరికించి తన రవికలో మడతలుబెట్టి యిమిడ్చిన కత్తియొకటి దీసి చేతితో సాపుచేసి పిమ్మట నాకత్తి ఝళిపించుచు హుమ్మని యా విగ్రహముపై జందెముపెట్టుగా నొక వ్రేటువేసినది.

అప్పుడు విగ్రహము కడుపుఁలో బోసియుంచిన వసంతము చిమ్మనగ్రోవిని జిమ్మునట్లు వచ్చి యచ్చెలువ కనులంబడిన నక్క త్తిం బారవైచి చేతులతోఁ గన్నులు నులుముకొనుచుండెను. ఇంతలో తిమ్మర్సును రాయలను గోతిలోనుండి పైకివచ్చిరి. ముందు తిమ్మర్సు నేలఁబడియున్న కత్తి నందుకొనెను. రాయలు కళానిలయ చేతులు బట్టుకొని మిత్రుఁడా! ఆ కటారి నిటు తెమ్ము. యీ ద్రోహురాలిం బరిమార్చెదనని యుగ్రముగా బలికి యతని చేతనున్న కత్తినందుకొని యోసి ఘాతుకురాలా! చూడు మిదిగో నన్నుఁ బరిమార్పవలయునవి తెచ్చిన కత్తి నీ ప్రాణంబులే గ్రోలుచున్నది. నీ యిష్ట దైవంబును బ్రార్థించుకొమ్మని పలికిన కత్తిపై కెత్తిన తోడనే యాచేడియ యొడలు గడగడవడఁక దేవా! నే నిప్పుడు నీ యాధీననైతిని! యెందుఁ బోగలను ? నాచేయు విన్నపం బాలించి పిమ్మట వధింపుము. ఇపుడు నీయెడ నేను జేసిన క్రౌర్యముంబట్టి యుడుగక వధించిన బాపంబులేదు. కాని స్త్రీపురుషతారతమ్యంబునంజేసి