పుట:కాశీమజిలీకథలు -01.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వేడుకతో నక్కొలను దరికరిగి యందాందోళికము దిగి సఖులతో నత్తటాకంబున జలకేళిం దేలుచున్న సమయంబున నయ్యంబుజానన సోయగం బీక్షించి యామె వయస్య లొండొరు లిట్లు సంభాషించుకొనిరి.

కలభాషిణి — మంజువాణీ! చూడుచూడు. జలంబుల వెల్లకితలంబడి యీదుచున్న పురుషద్వేషిణి కుచంబులకును, నెఱ్ఱదామర మొగ్గలకును నంతరం బెఱుగ రాకున్నదిగదా?

మంజువాణి — ఔను. చూచుకంబుల నలుపు చిఱతుమ్మెదలు వ్రాలినట్టున్నది.

భ్రమరవేణి – బోఁటీ! నీయుపమ సమంజసమే. నీటిపై వెల్లకితలంబడి దేలియున్న యాప్రోయాలు మిన్న మోమెట్లున్నదో చెప్పుము.

కలభాషిణి - ఓసీ! అమాత్రము తెలిసికొనలేననుకొంటివా? తటాకంబునఁ బ్రతిఫలించిన చంద్రబింబమువలె నున్నది.

భ్రమర – మేలుమేలు. నా యూహతో నీయూహ యేకీభవించినది. కనుల నలమికొనిన కాటుక కళంకమువలె నున్నది సుమీ!

మంజు -- ఈసారి గుబ్బ లెట్లున్నవో చెప్పుము.

కలభా - మొగం బనుచంద్రుని నాశ్రయింప నరుగు చకోరమిథునంబువలె నుండలేదా?

మంజు - భళిరే కలభాషిణీ! మిక్కిలి చక్కని పోలిక దెచ్చితివి.

కలభా - మొగముగూడ నా కొకరీతి నగుపడుచున్నది. చూడుము.

మంజు- ఎట్లు.

కలభా - నాచుపైఁ దేలుచున్న కెందమ్మివలె శిరోజంబులపై నొప్పుచుండ లేదా ?

మంజు – నీవు మిగుల చతురవే, లెస్సగాఁ బోల్చితివి మఱి సరసి గలుషించిన కారణం బెఱింగింతువా?

కలభా- ఎఱిఁగితిని. పద్మపాదయు, మకరజంఘికయు నావార్తనాభియుఁ దరంగవళియుఁ గోకస్తనియు, మృణాళభుజయు, నిందీవరనేత్రయు శైవాలకేశయునగు నీకు శేశయపాణి యా యాయవయవంబులఁ దన్ను నిరసించుచున్నదని కదా

మంజు - చెలులారా! సర్వావయవసుందరయగు నీ సుందరి యరణ్యకౌముదియుంబోలె తన జవ్వనమంతయు వృధసేయుచుఁ బురుషులయెడ ద్వేషించు కారణమెద్దియో యరసితిరా?