పుట:కాశీమజిలీకథలు -01.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

బుద్ధి కౌశల్యమునకు మిక్కిలి సంతసించుచు నొక్కనాఁడు చిత్రసేనుఁడు హితపురోహిత బంధుసామంత మంత్రిపౌర సూరివారంబు సేవింపఁ పేరోలగంబుండి యందులకు బహుశ్రుతునితోఁ గూడఁ గుమారుని రప్పించి మిగుల గారవించి యెల్లరు విన నిట్లనియె.

చిరంజీవి ! నీవును బహుశ్రుతుండును సకలవిద్యలయందు మిగులఁ బ్రవీణు లైరని విని నాడెందంబెంతయు నానంద మందుచున్న యది. “పుత్రాదిచ్ఛేత్పరాజయమ్" అను రీతిని దనకంటెఁ గమారు డధికుఁ డగుట తండ్రికే యశము గదా!

మరియు నేను మంత్రియుఁగూడ బెద్దలమైతిమి. మాకీరాజ్య భారంబు వహింప దుస్తరమగుచున్నది. ఇదియునుం గాక నవనవోన్మేషంబుగల మిమ్ము ప్రభువులుగా మేదిని గోరుచున్నది. బహుశ్రుతునితో క్షితిభారంబు వహింపుము. నేనును బూర్వాచార ప్రకారము నిన్నుఁ బట్టభద్రునిం జేసి, తపోవనంబున కరిగెద. నీవును రాజ్య భారంబంతయుఁ బూని దండనీతి ప్రకారము ప్రజలం బాలింపుము. దండనీతి రీతి నెఱుంగని రాజునకు రాజ్యంబు దక్కనేరదు. సస్తవ్యసనముల దారింబోక యాయముంబట్టి వ్యయము చేయుచు సమర్ధులునుఁ విద్వాంసులును దయాసత్యనిరతులగువారి ప్రధానులుగాఁ జేసికొని యల్పుఁ దరికిఁ జేరనీయని రాజు శుభమ్ములందును. మరియు ఱేనుకెట్టి యనుగ్రహమున్నను జాలినంత ధన మియ్యవలయునుగాని యెవ్వరికిని జనువుమాత్ర మియ్యరాదు. సంధి విగ్రహయానద్వైధీభావ సమాశ్రయ సామదాన భేదదండములు మొదలగునవి యాయా వేళకుఁ దగినట్టు నడుపవలయును తఱుచు చారులచే, రాష్ట్రవర్తమానములు నిత్యమును దెలిసికొనుచుండవలయును. దేవతాభక్తియు బ్రాహ్మణభక్తి యుఁ గలిగి యుండవలయును బ్రాహ్మణులం గనినతోడనే యభిమానమానక చేతులెత్తి మ్రొక్కవలయును. బ్రాహ్మణాశీర్వాదంబుల సకలకామంబులు వడయవచ్చును. విప్రులకు నమస్కరించనివాఁడు యమలోకంబున బీడింపబడునని యనేక నీతివాక్యము లుపదేశించి పుత్రునకుఁ బట్టాభిషేకంబు నిశ్చయించి తన యభిప్రాయం బెఱింగించిన విక్రమసింహుఁడును బహుశ్రుతుండును, సామాజికులు నట్టి మాట లాలించి మిగుల నానందించిరి. ఆ రాజు నంతటితో సభ చాలించి వారినెల్ల స్వస్థానముల కనిపెను.

మఱునాఁడు పూర్వమువలె నాకుమారు లిరువురు సాయంకాలమున విహారార్థమై యుద్యానవనమున కరిగి యందుఁ గ్రీడించుచున్న సమయంబున మంత్రినందనునకు రాజనందనుం డిట్లనియె.

వయస్యా! నిన్న మాతండ్రి సభలో నాడిన మాటలు వింటివి గదా! నాఁటనుండియు నామనంబున నొక వింతయగు చింత బొడమినది. నాకు మొదటినుండియు