పుట:కాశీమజిలీకథలు-12.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీపురప్రవేశము కథ

299

ఇమ్మణికర్ణికా తీర్థంబునం గావించిన స్నానదాన జపహోరు తర్పణాదు లక్షయమోక్షఫలంబు లొసంగు. సాంఖ్యయోగాదినియమంబు లీ తీర్థస్నానంబునుం బోలనేరవు. ఇప్పురంబు దర్శించినంతనె తులాపురుష ప్రదాన ఫలంబు గలుగును. భగీరధానీతంబై మందాకినీనది యిమ్మణికర్ణిక మీదుగా నుత్తరవాహినియై యిప్పురోప కంఠంబునం ప్రవహించుచున్నది తన్మాహాత్మ్యఁ బగ్గింప సురాసురులకైన శక్యంబు గాదు. వినుము.


సీ. జహ్నుకన్యాస్నాన సంకల్పమును బోల
             దఖిల శాస్త్రాద మాధ్యయనపుణ్య
    మమరస్రవంతీ సమా లోకనము మనో
             వాక్కాయ కృతపాప భంజనంబు
    గంగామహా నిమ్నగా తిర వాసంబు
             గలుగ దీశ్వర కృపా కలనఁగాని
    భాగీరధి కరుణాప్లావ మాత్రము లభించు
             బ్రహ్మ విజ్ఞాన సంభవఫలంబు

గీ. నిరతిశయ దుష్కృత క్రియానిరత నరప
    తులకు నీకలియుగంబునఁ గలుషఁ దమన
    మునకు సాధన మనిమిషధుని జలంబు
    దక్క వేఱొక్క దిక్కు వెదకినలేదు.

క. మది నిచ్చలేక ముట్టిన
   వదలక దహియించునట్టి వహ్నిక్రియనీ‌
   నది యిచ్చలేక మునిఁగిన
   విదళించున్ ఘోరకలుష వితతుల నెల్లన్‌.

క. సరిరావు వారణాశీ
   పురిమరణము నొందవచ్చు పుణ్యముతో దు
   ష్కరదాన తపోధ్యయనా
   ధ్వర విజ్ఞానార్చనాది ధర్మములెల్లన్‌.

అని మఱియు ననేక ప్రకారంబులఁ గాశీగంగా ప్రభావంబు వర్ణించుచు వారాతీర్థంబున కృతావగాహులై యంగంబులుప్పొంగ విశ్వనాధుని దర్శించి యానంద బాష్పంబుల నద్దేవున కభిషేకంబు విద్యుక్తముగా గావించి సంపూర్ణ మనోరధంబుతో నన్నపూర్ణాదేవి నారాధించి వటకబైరవాదుల భజించి మఱియు నందుగల శివమూర్తు లను దర్శించి సాయంసంధ్యాకాలంబున కొక మఠంబుజేరి యందునివసించిరి. ఇట్లను దినంబు గంగాస్నానము, నిత్యయాత్రయు, విశ్వేశ్వరార్చనాదికృత్యంబులను నేరవేర్చు