పుట:కాశీమజిలీకథలు-12.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తారావళి కథ

195


334 వ మజిలీ

తారావళికథ

ఇట్లు మాట్లాడుచుండగనే యర్ధరాత్రము దాటిపోయెను. పిమ్మట నా విశ్వ భూతి యనుమతమున బుండరీకుండా తరుణతపస్విని వృత్తాంత మెరుంగ గుతూహల పడుచు నామె నిట్లని ప్రశ్నించెను. ఓ యసామాన్యశీలవతీ ? సాధుపధప్రచారిణీ ! విమలాశయా! నీ వృత్తాంత మెరిగింపుము. విష్ణువక్షస్థలమునకు కౌస్తుభమణిభూషణము వలె నీ వేకులమున కలంకారమైతివి ? యభీధాన‌ మెద్ది? అభినవలతవలె నొప్పు నీ విట్లేల జటావల్కలముల ధరించితివి? ఏ లోకమునుండి నీ విందవతరించితివి ? నీ నివాస మెచ్చట ? నీవంటి వారలు చేరరాని యాలంకాపురమున కేమి నిమిత్త మేగి తివి? అందు దురాపసందుడగు నా రక్కసుని కన్నుల కేల గోచరించితివి? నన్నిందు జూచినతోడనే శశికిరణములు సోక నెలరాలు స్రవించునట్లు నీ నయనేందు రత్నముల గన్నీరు విడచితి వేమిటికి? ఈ వృత్తాంతమెల్ల సవిస్తరముగ నెరుంగుటకు నా మనో వృత్తి కుతూహలపడుచున్నది. ఇంకను జాలారాత్రిగలదు. కావున సావధానముగ నీకధ దెలుపుమని పలుకు రాజేంద్రున కా తపస్విని యిట్లనియె.

ఓరాజ పరమేశ్వరా ! కళ్యాణప్రదుండవగు నీ వృత్తాంతమడుగకముందే నేను జెప్పవలసినది. అడిగినప్పుడై న జెప్పకుందునా ? అవధరింపుము. విస్తారభూతిచే నపారసుఖోపభోగ విభ్రమమువలన, సహజహర్షోపశాలురగు విలాసినీలోకంబుకతంబున నెల్లభువనముల బ్రసిద్ధికెక్కి న లోకము మీకు దెలిసియేయుండును. సంసారసాగరము లోని రత్ననిలయమువలె పన్నగఫణామండితమణి ప్రకరము లెల్లెడల బ్రకాశించు చుండ, బ్రహ్మాండరోషణమునందలి నిక్షేపము విధమున, ద్రిలోకకల్పవృక్షమునకు గూకటివేరులాగున, నొప్పుచు తపనుని సంచారము లేకున్నను సంచరద్భుజగ రాజ పుత్రోత్తమాంగమణి మయూఖవలయంబులచే ననేక రవిమండలములు గలుగుచుండ ననన్య సామాన్యసౌందర్యముతో నొప్పుగులుకు జలువజవరాండ్ర కునికిపట్టగుచు లోకములో మూడవదియగు పాతాళము సంసారఫలమున కారామమై జెలగియుండెను.

అందు బ్రసిద్ధములగు నెనిమిది నాగకులములలోను జన్మించిన వారెల్ల మిగుల బలశాలురు. కామరూపులై త్రిభువనముల యందును స్వేచ్చాసంచార మొనర్ప సమర్ధులు. దివ్యాభిరామస్వరూపులగు కామరూపులమాట యటుండనిమ్ము. సరళకీటక ప్రాయులై యున్న వారినిగూడ త్రిలోకగురుండగు పరమేశ్వరుండు నెమ్మేన నలం