పుట:కాశీమజిలీకథలు-12.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము



    సామ్యతను గాంచె శీతాంగు శైత్యతా వి
    శేషమున కందు మదికి నచ్చెరువు గొలువ

ఆ నిర్మలతరింగిణీ సందర్శనంబొనర్చి ఆహా ! నందాటపురము నుండి యెంతదూర మేతెంచితిని ! ఇచ్చట కప్పురము పదియోజనముల దూరములో నున్న దందురని తలంచుచు నానది యుభయతటములఁగల వృక్షశాఖల విమర్శించుచు దిరుగు చుండ భువనైకచక్షుండగు నాదిత్యభగవానుఁ డపరదిక్కున కేగెను. అప్పుడు నేను వృధా శ్రమపడి యింతదూరము వచ్చినందులకు విషాదము జెందుచు మదీయ విమృళ్య కారిత్వమునకు పశ్చాత్తాపము నొందుచు నిట్లు వితర్కించుకొంటిని. ఔరా! పక్షి కొరకు నేనెంత మూఢుఁడనైతిని. సాధ్యా సాధ్యములు విచారింపక దిరుగువారు నా వలెనే యిట్లు విఫలమనోరధు లగుచుందురు. పక్షులకుఖేచరగమనముండుటనేనెరుంగనా? నేను ఖేచరుండను కానుకదా! దానినెట్లనుసరించి పోగలను? పాశబంధాది సదుపాయముల పక్షులఁబట్టుట దగుగానివానితో నెగిరిపట్టుట మానవునకెట్లు సాధ్యమగును? ఇచ్చటజేరువ నెద్దియును బల్లెయైననున్నట్లు కనుపింపదు. నిముషములోనే యీ దినాంతమగుచున్నది. రాత్రి చీకటిలో నేకాకినై మార్గవిబాగం బెరుంగఁజాలక యంతములేని యీవిపినప్రయాణ మొనర్చి నేనెట్లు తిరిగిపోఁగలను ? అని యిట్లు డోలాయమాన మానసుండనై మంద గమనమున నాసరిత్తీరమున నెదురఁ గనంబడిన మార్గమున నడచుచుండగా ముందొక పొలములో వరికళ్ళము సమీపమున నొక కుటీరముగాంచి యతిహర్షమున దానిం జేరితిని. అందెవ్వరును లేరు. అందొకచో గడ్డి పడకయును, పచనపాత్రలును, ప్రొయ్యియు నుండుటఁ దిలకించి యందెవ్వరో నివసించి యుండునట్లు నిశ్చయించి వారి రాకకై నిరీక్షించి తద్వార బహిఃప్రదేశమున నుపవిస్టుడనై యుంటిని. ఇంతలో స్థూల దేహముగలిగి దర్భవలితమగు త్రాటితో బిగింపఁబడిన పరిధానము వహించి చినిగిన ప్రాతకంబళి మూపున ధరించి చేతియందొక యూతకోలఁ బట్టుకొని తలపైఁ నతిభారమగు గడ్డిమోపు బెట్టుకొని యొక మోటుమానిసి నన్ను సమీపించెను. మరియు వాని వామకరమున మోదుగునారచే చరణములు గట్టుబడియున్న యా శుకశ్రేష్టము నాకు నేత్ర పర్వంబొనర్చెను. దానిం గాంచి మృతోజ్జీవితుఁగన్నరీతి నే నత్యంతానంద మందితిని. ఇంతలో నా పామరుండు తలపైనున్న గడ్డిమోపును గుటీరద్వారప్రదేశ మునఁ బడవైచి దానిని లోనికిఁజేర్చి యా స‌మీపముననే యా చిలుకను బంధించి బైట కేతెంచి మూపుపైనున్న కంబళీఖండమును నేలమీఁద బరచికొని నా సమీపమునఁ గూర్చుండి పళ్ళుబిగించి రెండు చేతులతోఁ దల గోకికొనుచు సోదరా! యే గ్రామము నుండి నేడిచ్చటి కేతెంచితినని నన్నడిగియు నంతలోఁదల గోకికొనుటవలనఁ గలిగిన సుఖమున సీత్కార మొనరించుచుఁ జేరువ పొలములోఁబడిన పక్షుల నదలించునెపమున హక్కారముజేయుచు నడిగిన మాటలే మఱల నడుగుచుఁ దనగ్రామేయక స్వభావమున నా మనమునకు మిగుల విసువుపుట్టించెను.