పుట:కాశీమజిలీకథలు-12.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

పురమునకఱిగి యొకనాటి వేకువను శరత్కాలసంపదలచే నొప్పు నుద్యానవనమున కేగితిని. అచ్చట పలవకుండను సేవకుడు నీరు దోడుజలయంత్రముల నమరించుచు నతివృష్టివిఘటితములగు బోదుల సరిజేయుచుండెను. నీరు నిండుటచే కొట్టుకొని పోయినపాదులు జక్కపఱచుచుండెను. మంటపములందు పైకెదిగి భారముచే వంగి గ్రిందుకు జాఱిన లతావితానముల యధాస్థితిం బొందుపరచుచుండెను. అరటిచెట్ల యందు వ్రేలాడు సొరుగెల్ల ఖండించివైచుచుండెను. ఝంఝామారుతముచే గొట్టుకొని వచ్చి వనస్పతులయందు జి‌క్కుకొనియున్న ముండ్లగుత్తులెల్ల దీసిపారవైచుచుండెను. అప్పుడు నే నతిజాగరూకతతో ప్రతిలతామండపమును, ప్రతిపాదపమును, ప్రతివిట పమును, బరిశీలించుచు నందందలి జలాశయములను నందలిపద్మముల సౌందర్యమును బరికించుచు నాయుద్యానవనరామణీయకమునకు సంతసించుచు మిగిలియున్న పనుల నెల్ల సత్వరము నెరవేర్పుమని పల్లవకుని నియోగించి మఱలిపోవుచుంటిని.

అట్లు నేనొంటినై నిశ్చింతగ మందగమనమున నరుగుచు నెండచే శ్రమ పడి చల్లని ప్రదేశమున కేగనెంచి పురపరిసరోప్రాంత ప్రదేశమున నొక సుందరమగు బౌద్ధమందిరముం గాంచి దాని వెలుపలనున్న వితర్దికపై గూర్చుంటిని. అందు గొంత విశ్రాంతిని బొంది స్వతంత్రావలోకనముల నిటునటు బరికింప నోదేవా ! ఏమి చెప్పుదును ? నే నుదయమున నుద్యానమున కేగునప్పుడు స్పటికసృష్టివరిపాండు రంబై కనంబడిన యా చైత్యము నా కప్పు డింద్రనీలశిలావి నిర్మితంబై నట్లు హరిత వర్ణమున గనంబడెను. దానికి నేను వెరగుపడుచు నెడద ననేకవిధముల దలం‌చుచుండ నందుండి నా కిట్లు వినంబడెను.


గీ. ఎంతచిత్రంబుగా నుండె నెంచిచూడ
    లలితగుణమైన గ్లేశమూలంబు నయ్యె
    నెందు విశ్రాంతిలేదు దేహికి నిజంబు
    యేమి చెప్పుదు నింక సంస్కృతి విధము.

అందులకు నే నక్కజంపడుచు నా పల్కులు వినంబడినవైపు జూచుచుండ గనే యా చైత్యగర్భమునుండి యొక చిలుక పైకేతెంచితచ్చిఖరము నధిష్టించెను. తోడనే యా మందిరము యధాపూర్వముగ స్వచ్చకాంతుల బరగెను. ఆ శుకమునకు జాతివిరుద్ధముగ దలపై శిఖయొండు గలదు. అదిచూచి నే నాశ్చర్యపడుచు నిట్లని తలంచితిని. ఏకఖండేందు కాంత శిలానిర్మాణమున నొప్పి వీరంధ్రసంధిగర్భంబగు నీ చైత్యమునం దెట్లీశుకము ప్రవేశించి పైకి రాగలిగినదో కదా ! ఇయ్యదిలోన నుండుటచేతనే యీ చైత్యమట్లు హరితవర్ణమున నొప్పారెను. ఇంతకుమున్ను విన్న గంభీరార్థసూచితములగు పలుకు లీశుకసత్తమము వంచించినవియై యుండనోపు. దీని యౌదలగల శిఖయే దీని యుత్కృష్టతను సూచించుచున్నది. ఇట్టి వింత శకుంతమును