పుట:కాశీమజిలీకథలు-05.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

197

    దచ్చారదానిశాంతమునకు నాల్గు వా
            కిళులొప్పు నాల్గుదిక్కుల విభుధులు
    గాచుచుందురు వాని ఘనపరీక్షలఁదేరి
           సర్వజ్ఞుఁ డవ్వరాసనమునెక్క.

గీ. వలయు నితరుల కదిచేర నలభిగాదు
    దాక్షిణాత్యులలో సమర్థత వహించు
    పండితుఁడు లేమిజేసి తద్వారగత క
    వాటములు మూయఁబడియుండు వరుసనెపుడు.

అని యెవ్వరో చెప్పుకొన నవ్వార్త నాలించి పద్మపాదుండు గురునితో, స్వామీ! కాశ్మీరదేశమున శారదాపీఠమొకటి యున్నదఁట అద్దేవతామందిరమునకు నాలుగు వాకిళులు గలవఁట? అందు దక్షిణద్వార కవాట మెప్పుడును మూయబడి యుండునఁట. సర్వజ్ఞుఁడుకానివాఁడా పీఠము ధరింజేరలేఁడఁట. అందుఁ బెక్కండ్రు కుమతవాదులు కాచివచ్చిన పండితునిఁ బరీక్షించుచుందురఁట. అప్పీఠాధిరోహణమునకు దేవరయే సమర్థులు. వేగమ యచ్చటికిం బోవలయు నిన్నిదినములీవార్త మనకేమిటికిఁ దెలియకున్నదోగదా.

అవ్వరాసన మెక్కితిరేని భవదీయ దిగ్విజయయాత్రకు బూర్ణఫలంబగునని చెప్పిన విని శంకారాచార్యులు సంతసించుచు నప్పుడే కదలి శిష్యులతోఁగూడ నక్కాశ్మీరదేశమున కరిగి యందు -

శా. వేదాంతోరువనాశ్రయంబు విలస ద్విజ్ఞానరూపంబు డు
    ర్వాదివ్రాతగజేంద్రకుంభదళన ప్రఖ్యాతవిస్ఫార వి
    ద్యాదంష్ట్రాభయదంబు శంకరమహా హర్యక్షమేతెంచెఁ బొం
    డో దూరంబుగ క్షుద్రజంతువుల చెండుని ద్వైతకాంతారమున్.

అని శిష్యులు వేత్రపాణులై విజయనాదంబులు సేయుచు ముందునడుచు చుండఁ గ్రమంబున శారదామందిర దక్షిణద్వారంబుఁ జేరంజని కవాటం బుద్ఘాటించి లోనఁ బ్రవేశింపఁ బ్రయత్నము చేయుచున్న సమయంబున నందున్న వాదిగణ మడ్డమువచ్చి -

శా. ఏమీ ! సంభ్రమ మిట్లు సేసెదవు నీ వెవ్వాఁడవో కార్య మిం
    దేమైనంగలదేని చెప్పుమొగి నీ వీరీతి వ్యగ్రక్రియా
    సామర్థ్యంబు వహింపఁ జక్కబడునే సత్కార్యమీవాకిలిన్
    ధీమంతుం డఖిలజ్ఞుఁ డేగవలయు నీబోంట్లకున్ శక్యమే ?

వాడిగణము - మిగుల జంఘాటముతో వచుచున్నావు. నీ వెవ్వఁడవు.