పుట:కాశీమజిలీకథలు-05.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

కాశీమజిలీకథలు - ఐదవభాగము

బొగడిన నమ్మహాత్ముం డిట్లనియె. వత్సా! శంకర ! నీవు మిగుల గుణవంతుడనియు శాంతిమతి వనియు సాధుతత్త్వవేది వనియు మత్కారికావారిజ జగద్బంధువులగు భాష్యాది ప్రబంధములఁ బెక్కు గావించినాడవనియు నీగురుండగు గోవిందతీర్థుం డెఱింగింప విని సంతసించి నిన్నుఁ జూచు తాత్పర్యముతో నరుదెంచితి. నీరచించిన గ్రంథంబుల వినిపింపుమని యడిగినంత శంకరాచార్యులు.

గీ. గరీమమాండూక్యగతములౌ గౌడపాద
   కారికాభాష్యమును వేదసారభాష్య
   మను విశేషించి యమ్మహామునివరునకు
   జదివి వినిపించె శంకరాచార్యుడపుడు.

క. మాండూక్యభాష్యంబులు
   రెండును బఠియింపగా బరిస్ఫుటగతి న
   ప్పండితవర్యుడు విని ముది
   తుండై కరమాప్రశిష్యుతో నిట్లనియెన్.

గీ. అనఘ ! భవదీయభాష్యము లస్మదీయ
   కారికాభావభేదము ల్గామిజేసి
   సరగదచ్చ్రరణోత్థ హర్షంబునీకు
   వరమొసగనన్ను బ్రోత్సాహ పరచుజూవె.

వ. కావున నీ యభీష్టం బెయ్యది తెలుపుమని యడుగుటయు శంకరుం డార్యా ! శుకమహర్షి తుల్యుండగు నీవు సంతసించి ప్రత్యక్షమై వరంబడుగుమని కోరితివి. ఇంతకన్న వరంబేమియున్నది? నీవే భగవంతుడవు గదా! అయినను వలదన నేల ? మదీయ మానసం బెప్పుడు పరతత్త్వ చింతనమం దాసక్తి గలిగియుండునట్లను గ్రహింపుము. ఇదియే నాయభీష్టమని పలికిన సంతసించుచు గౌడపాదమహర్షి యవ్వరం బొసంగి యింతర్హితుం డయ్యెను.

పిమ్మట శంకరయతీంద్రుండా వృత్తాంతం బంతేవాసుల కెఱింగింపుచు నారాత్రి వెళ్ళించెను. అమ్మఱునాఁడు ప్రాతఃకాలంబున శిష్యులతోఁగూడ నయ్యతిపుంగవుండు గంగానదియందు నిత్యక్రియా కలాపములు దీర్చుకొని తత్తీరంబులఁ గూర్చుండి నిదిధ్యాసనలాససుండైయున్న సమయంబున

సీ. పుడమియంతటికి జంబూద్వీపముత్తమ
            మందు భారతవర్ష మధికమందుఁ
    గాశ్మీరదేశము గడుప్రశస్తము శార
            దాపీఠమచ్చోటఁ దనరుకతనఁ