పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

రాజశేఖర చరిత్రము

మనదేశములో పతిరహీతులగు యువతుల దురవస్ధను తలచుకొన్న మాత్రమున పగవారి కయినను మనస్సు కలుక్కుమనకమానదు. పతిశోకమును మఱువునట్లుచేసి యాదరింపవలసిన తల్లిదండ్రులే జీవితే శ్వరులుపోయి దుఃఖసముద్రములో మునిగియున్న తమ కడుపున బుట్టిన కొమార్తెలను కరుణమాలి సమస్తాలంకారములకును దూరురాండ్రను జేసి, తలగొఱిగించి కురూపిణులను జేసి మునుగువేసి మూలగూర్చుండ బెట్టుదురు ; రెండు పూటలను కడుపునిండ తిండియయిన బెట్టక మాడ్చి యందఱి భోజనములు నయినతరువాత మూడుజాములు కిన్ని మెతుకులు వేయుదురు ; మనసయినను మంచిబట్ట కట్టుతో నియ్యక అంచులేని ముతక బట్టనే కట్టుకోనిత్తురు. వేయేల ? మగడు పోయిన వారిజీవనములనే దుఃఖభాజనములనుగా జేసి వారిని జీవచ్చవములనుగా నుంతురు. ఎవ్వరును పెట్టినవిగాక పుట్టుకతోనే భగవంతుడలంకారముగా దయచేసినట్టియు చిన్నప్పటినుండియు చమురురాసి దువ్వి ప్రాణముతో సమానముగా పెంచుకొనుచున్నట్టియు చక్కని శిరోజములను నిర్దతుడైన మంగలివాని కత్తి కొప్పగించుట కంటె మానవతులకు ప్రాణత్యాగమే తోచును ; యింటగల కష్టమయి నట్టియు నీచమయనట్టియు పనులన్నియు వారిమీదనే పడును పుట్టినింట జేరగానే , వదినెలు మఱదండ్రును దాసినిగా జూతురు గారవమను మాట యుండదు; శుభకార్యము లందు నలుగురిలో దలయెత్తుకొని తిరుగుట నోచుకోగ పోగా మొగ మగపడినమాత్రమున మీద మిక్కిలి యెల్లవారును దుశ్శకునమని దూషింతురు. ఈ హేతువుచేతనే "విధవ " యనుమాటయే వినుటకు శూలమువలె గర్ణ కఠోరముగా నుండును ; యెవ్వనినైన 'విధవ ' యనుపేరును బిలిచిన మాత్రమున ఘోరమయిన తిట్టుగా నెంచుకొని వాడు మండిపడును.