పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆఱవ ప్రకరణము

ఆమఱునాడు జాము ప్రొద్దెక్కిన తరువాత రుక్మిణి యిక్కతెయు వడమటింటి పంచపాళిలో గూరుచుండి యెఱుకత చెప్పిన గడువు నిన్నటితో వెళ్ళిపోయెనే యింకను మగడు రాడాయెనేయని తలపోయుచు వస్తువు పోయిందునకయి విచారించు చుండెను. ఆ సమయమున నిరువది సంవత్సరముల వయసుగల యొకచిన్నవాడు లోపలికివచ్చి చేతిలోని బట్టల మూటను క్రింద బడవైచి రుక్మిణి మొగము వంక జూచి పెద్దపెట్టున నేడ్చెను. అదిచూచి రుక్మిణి సంగతియేమో తెలిసికొనకయే తానును నేడ్వజొచ్చెను. ఆరోదనధ్వని విని యింట నున్నవారందఱును లోపలనుండి పరుగెత్తుకొనివచ్చి యేమియని నడిగిరి. అప్పుడా చిన్నవాడు గ్రుడ్లనీరు గ్రుక్కుకొనుచు గద్గదస్వరముతో రుక్మిణి మగడు నృశింహస్వామి కాశినుండి వచ్చును త్రోవలో జగన్నాధము వద్ద పుష్యశుద్ధ నవమి నాడు గ్రహణి జాడ్యముచేత కాలధర్మము నొందెననియు, దహనాదికృత్యములను తానే నిర్వహించితి ననియు జెప్పెను. ఆమాటలు విన్నతోడనే యింటనున్న వారందఱును నొక్కసారిగా గల్లుమని యేడ్చిరి. ఆయాక్రంద ధ్వని విని చావడిలో నున్న రాజశేఖరుడుగారును పొరుగిండ్లవారును వచ్చి కారణంబున దెలిసికొని పలుతెఱింగుల విలపించిరి. అప్పుడక్కడనున్న పెద్దలందఱును వారిని వోదార్చి వారిచే స్నానములుచేయించి వేదాంత వచనముల నుపదేశిం పసాగిరి. యిట్లు కొన్నిదినములు జరిగిన తరువాత బంధువులు మొదలగు వారు రుక్మిణికి శిరోజములు తీయించు విషయమయి రాజఏశేఖరుడు గారితో బ్రసంగించిరి గాని, ఆయన తనకొమార్తె మీది ప్రేమచేత చిన్నతనములోనే యాపని చేయింప నొప్పుకొన నందున, నందఱును కూడ దానివలన నొకబాధకము లేదని చెప్పి యాయన చెప్పినవిధమే మంచిదని యొప్పుకొనిరి.