పుట:ఈశానసంహిత.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు మాత్రమే రచించెననుటకుఁ గొన్నిహేతువులు చూపఁబడినవి. సంహితవలనఁగూడ నావిషయమే దృఢముగుచున్నది. పీఠికలో యమదూతలు పరాజితులైన పిదప యముఁడు స్వయముగా వచ్చి శివునిచే నిర్జింపఁబడిన అపరమార్కండేయచరిత్ర ముండి యుండునేమో యను సంశయము చూపఁబడినది. ఇప్పు డట్టిసంశయ మక్కఱ లేదు. స్వభటపరాజయమున ఖిన్నుఁడై యముఁడు శివలోకమున కేఁగి తనయధికారలాంఛనమగు దండముద్రను శివున కిచ్చివేసి సహాయనిరాకరణ మవలంబించినట్లును శివుఁడు శివరాత్రిప్రభావము బోధించి యాతనిని సమ్మతపఱచినట్లును సంహితయందుఁ గలదుగదా? కేవల కాదంబరీరసాస్వాదనలోలుపుఁడును లోకజ్ఞపరివృఢుండునగు శ్రీనాథకవిసార్వభౌముఁడు పేలవములగు నాచేలఘట్టములఁ దడవలేదనియే మనము నిశ్చయించుకొనవచ్చును. అందు ముప్పదియెనిమిది శ్లోకములలో శివలోకవర్ణనమును, పిదప నైదుశ్లోకములలో శివవర్ణనమును పిమ్మట నిరువదినాలుగు శ్లోకములు శివుని నుతించుటయు, తరువాత పదునాల్గు శ్లోకములలో సుకుమారుని దుష్కార్యములు నివేదించి దండముద్ర నర్పించి నాన్కోఆపరేషను చూపుటయుఁ గలదు. అనంతరము శివుఁడు శివరాత్రిప్రభావము వర్ణించుట నాలుగు శ్లోకముల నున్నది. యమప్రశ్నమున కుత్తరముగా వ్రతవిధానము నుపదేశించి సుకుమారుని కాఫలము లభించినప్రకారము వివరించి నాభక్తులు నీకు సదా పూజ్యులని నిర్దేశించి భక్తలక్షణమును నాజ్ఞాపించుట, యముఁడు పరితోషమంది తనపురమున కేఁగుటయు మిగిలిన శ్లోకములందు వర్ణింపఁబడినది. ఈ గ్రంథమంతయు మిక్కిలి ఛాందసవైఖరిని బ్రకటించుచున్నది. పరమమాహేశ్వరుఁడగు కవిసార్వభౌముఁడు శివనుతులఁ గాని భక్తస్తోత్రములఁగాని మిగుల నాదరించువాఁడేయైనను కేవల నమకచమకపారాయణముఁ గావించు వేదాభ్యాసజడుఁడు మాత్రము గాఁడు. ఆయాపట్టులందు శివవర్ణనములు భక్తబృందస్తోత్రములు దేవాలయాది మహిమలును మిక్కిలి రసోత్తరములుగాఁ గూర్చియే యున్నాఁడు. వాస్తవము