పుట:ఈశానసంహిత.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తత్కారణమునఁ దానే జగత్కర్తనని గర్వించి స్వవిరచితమగు సృష్టి నాలోకింప హంసము నధిరోహించి యెల్లలోకములు విలోకించుచు వచ్చి క్షీరసాగరమునఁ బవ్వళించియున్న హరిం గాంచి యెవ్వఁడ వీవు జగత్కర్త నగు న న్నాలోకించి యేల లేచి మర్యాద చేయవని ప్రశ్నించెను. నారాయణుఁడు తానే జగత్కర్తనని బ్రహ్మను దిరస్కరించెను. అంత వారిరువురకు యుద్ధ మొనరించి పరస్పరవిజిగీష చేఁ బాశుపతాస్త్రంబు లొండొరులపైఁ బ్రయోగించుకొనిరి. తదస్త్రజ్వాలాదహ్యమానమగు లోకములఁ గావను, హర్యజులచర్యంబు మాన్పను, నస్త్రముల నడుమ ననుష్ణాశీతమగు నగ్నికంబంబు ప్రాదుర్భవించెను. అదియే శివలింగము. అది ప్రాదుర్భవించిన మాఘకృష్ణచతుర్దశీనిశికే శివరాత్రియని పేరు; అని తెలుపబడినది.

సంహితయందు "మహాపాతకోపపాతకము లొనిరించిన యే సంకరులైనను లఘూపాయమున శివలోక మొందు నుపాయ మేదైనఁ గలదా? యని మునులు ప్రశ్నింప సూతుఁడు పూర్వము పార్వతి యీయర్థమునే ప్రశ్నింప నామెకు శివుడు శివరాత్రివ్రతవిధాన ముపదేశించెను. ఆమె దానిని షడాననునకుఁ జెప్పెను. నేను గృష్ణద్వైపాయనుఁవలన నాకథ వింటిని. దాని నారర్ణింపుఁడు. నాల్గువేలయుగములు బ్రహ్మ కొకపగలు; అంతకాలమే రాత్రియు నగును. విష్ణువు వరాహరూపమున భూమి నుద్ధరించి విశ్రాంతికై పాలకడలిం బరుండెను. బ్రహ్మ సృష్టిని యథాక్రమమునఁ గావించి లోకము లాలోకించుచు వచ్చి నారాయణుని గాంచి యధిక్షేపించుచు నాతనితో సమరం బొనరించెను. అందు వారిరువురు నన్యోన్యవధకాంక్షులై పాశుపతాస్త్రములం ప్రయోగించిరి. అస్త్రసంపాతము మాన్పను, హర్యజులఁ గావను, శాంభవంబగు స్తంభ మానడుమ నావిర్భవించెను. దానిఁ గాంచి కోప ముడిగి హర్యజులు కూడఁబలుకుకొని స్తంభాద్యగ్రములం బొడగాంచుటకు వరాహరూపమునను హంసవాహనంబునను నేఁగి కనలేక తిరిగివచ్చిరి. అంత