పుట:అభినయదర్పణము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బలరామావతారహస్తలక్షణము

క.

కుడిచేతను సపతాకము
నెడమకరంబునను ముష్టి యెనయఁగఁ బట్టం
బుడమిని బలరాముం డయి
గడిదేఱును జగతిలోనఁ గస్తురిరంగా!

69

కృష్ణావతారహస్త[1](లక్షణము?)

గీ.

ఘనత మీఱఁగ మఱి వేణుగానమునను
జూపఁ గృష్ణావతార మై సొబగు మీఱు
సరసగుణహార! శ్రీరంగపురవిహార!
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

70

కల్క్యవతారహస్తలక్షణము

గీ.

వెలయ సపతాకమును నొత్తగిలను బట్టి
యిరుకరంబులఁ ద్రిపతాక మెనయఁ బట్టఁ
జెలఁగి కల్క్యవతారమై చెలువు మీఱు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

71

సూర్యహస్తలక్షణము

గీ.

పరఁగ నదె సూచిహస్తంబు బాగు మీఱ
నిరుకరంబుల భుజముల కెగువఁ బట్ట
ధరను మార్తండహస్తంబు మెఱయుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

72

చంద్రహస్తలక్షణము

గీ.

కూర్మి వామంబునను బద్మకోశ మలర
మొనసి కుడిచేత మఱి సింహముఖము బట్ట
ధర సుధాకరహస్తమై దనరుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

73
  1. “మృగశీర్షేతు హస్తాభ్యామన్యోన్యాభిముఖీకృతే| అంసోప కంఠేకృష్ణస్య హస్తఇత్యభిధీయతే” (అభి)