పుట:అభినయదర్పణము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అభినయదర్పణము

ద్వితీయాశ్వాసము

అసంయుతలక్షణము

క.

శ్రీ రమణీమణివల్లభ
వారిజదళనేత్ర! సుజనవాంఛితఫలదా!
నారదమునివందితపద!
తారుణ్యమయాంతరంగ! కస్తురిరంగా!

1


వ.

అవధరింపుము.


క.

పరఁగ నసంయుతహస్తము
వెరవుగఁ దెల్పెదను నష్టవింశతి యిపుడున్
మఱి లక్షణలక్ష్యంబులు
గరుణింపుము!వరశుభాంగ! కస్తురిరంగా!

2


వ.

ఇఁకఁ, బతాకంబును, ద్రిపతాకంబును, నర్థపతాకంబును, గర్తరీముఖంబును, మయూరార్థచంద్రంబులును, నరాళంబును, శుకతుండంబును, ముష్టియు, శిఖరంబును, గపిత్థకటకాముఖంబులును, సూచీచంద్రకళాహస్తంబులును, గోశహస్తంబును, సర్పశీర్షమృగశీర్షంబులును, సింహముఖంబును, లాంగూల సోలపద్మంబులును, జతురహస్తంబును, భ్రమరహస్తంబును, హంసాస్య హంసపక్షంబులును, సందంశంబును, ముకుళంబును, దామ్రచూడ త్రిశూలంబులును నను నీయష్టవింశతియు నసంయుతాఖ్యహస్తంబు లనం బరఁగుచుండు, నంత,

3

పతాకహస్తలక్షణము

గీ.

గరిమ నంగుష్టంబును వంచి కడమ వ్రేళ్ళు
లన్నియును గూర్చి చాఁచిన, వన్నెమీఱఁ
జెలఁగినఁ, బతాకమని చాల వెలయుచుండు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

4