పుట:అభినయదర్పణము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగపూజ

చ.

చెలఁగుచు రంగపూజ మఱి సేయక దేవళమందు నైనఁ దాఁ
బలుమఱుఁ [1]బట్నమం దయినఁ బాటిగ నాట్యము లోలి సల్పుచో
నెలమిని నాస్థలంబులకు నెప్పుడు నగ్నినిరోధ మంచునన్
వెలఁయగ శాస్త్రముల్ పలుకు వేమఱుఁ గస్తురిరంగనాయకా!

32

రంగపూజాయంత్రలక్షణము

సీ.

నాల్గుకోణంబులు నయ మొప్పఁగా వ్రాసి
              మొనసి యా నాలుగుమూలలందు
బాగుగా నాలుగు పద్మంబులను వ్రాసి
              వశముగా నాలుగు దిశలయందుఁ
బ్రక్కకు రెండేసిపద్మంబులును గాను
              జెలఁగ నెన్మిదిపద్మములను వ్రాసి
యందు మధ్యంబున ననువుగా వృత్తాలు
              మఱి మూడు గుంపుగాఁ బరఁగ వ్రాసి


గీ.

సొరిది వృత్తాలచుట్టును సొంపు మీఱ
వరుసఁ జతురంబుగా గీఁత వ్రాయఁగాను
జాలు నది రంగయంత్ర మై, మేలు దనరు
రాక్షసవిరామ! కస్తురిరంగధామ!

33

రంగపూజాయంత్రాధిదేవతలు

సీ.

పరగఁ దూర్పునను దిక్పాలకు లాగ్నేయ
              మందంగ దేవత ల్పొందుగాను
యమదిశయందును నలరఁ ద్రిమూర్తులు
              నైరృతియందు వినాయకుండు
వరుణభాగంబున మఱి షణ్ముఖుండును
              వాయుదిక్కున క్షేత్రపాలకుండు
నుత్తరదిక్కున నొగి నాందిదేవతల్
              సప్తమాతృకలు నీశానమునను

  1. పట్నము పట్టనశబ్దమున కేర్పడిన వికృతి