పుట:అభినయదర్పణము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కంటెను మునుముందు దన గురుపాదులఁ బ్రస్తుతించుటంబట్టి యీతని గురుభక్తి యనన్యాదృశమనిపించెడిని. మాతృభూతయ్యయను నాతఁడు కుంతలాంబ పైఁ గొన్నిగీర్తనల రచించెను. అవి నేఁడు మన కుపలబ్ధము లగుచున్నవి. పరిశోధింప నాతఁడు నీతఁడు నొకఁడే యనుటకుఁ గొన్ని నిదర్శనము లగపడును. కుంతలాంబ తిరుశిరపల్లియందలి పరమదైవము. శ్రీరంగమున కిది చాలసమీపప్రదేశము. శ్రీరంగధామునకే యీతఁడును దన గ్రంథము నంకితము చేసియున్నాడు. కావున నీకవి శ్రీరంగసమిపనివాసి గానోపును. ఇతఁడు బమ్మెరపోతన శ్రీనాథుల స్తుతించి, యాంధ్రకవిపితామహాదుల స్తుతింపమి యీతని కాలమున కంతగా వారు ప్రాచీనులు గామియే కారణమనిపించెడిని. ఇది గాక, పదములు, కీర్తనలు మొదలగునవి రఘునాథరాయల కాలమునుండియే విస్తారముగాఁ బెంపొందియుండుటంజేసి, కీర్తనలు రచియించిన యితఁడు పదునేడు పదునెన్మిది శతాబ్దులలోనివాఁ డనిపించెడిని. కవి మాతృభూతయ్య యనునతఁడు పారిజాతాపహరణమును యక్షగానముఁగా వ్రాసినట్లును గలదు. ప్రతాపసింహుని దా నాశ్రయించియున్న ట్లాతఁడు చెప్పికొనియున్నాఁడు. ఈతని కాతనికిఁ జాల విధములఁ బోలికలున్నవి. ఇతఁడు కాశ్యపగోత్రుండు, ఆతఁడు శాండిల్యగోత్రుఁడు. ఈవ్యత్యాసము మాత్రము గానవచ్చెడిని, అది వ్రాయసకాండ్రదోషమని యంగీకరించిననాఁడు ప్రతాపసింహునిబట్టి యీతనికాలము పదునేడవ శతాబ్దియనిస, ప్రమాణముగానిరూపింపవచ్చును. ఈ కవికాలాదుల నింతకంటే నిర్ధారింప నవకాశము లంతగాఁ గాన్పింపవు.

ఈ యభినయశాస్త్రము వేదములనుండి యవతరిల్లినది. దానిని బ్రహ్మ గంధర్వులకు నప్పరస్త్రీలకుఁ బ్రప్రథమమున బోధించినాఁడు. వారిమూలమున దేవలోకమందంతటను నది వ్యాప్తి చెందినది. అటుతరువాతఁ గైలాసమున నొకప్పుడు పార్వతికి శివుఁడు దీనిని బోధింపగా నామె భూలోకమందలి ఋషులకు దీనిని దెల్పెను. వారు సౌరాష్ట్రదేశమునందలి స్త్రీలకు దీనిని గఱపిరి. ఇట్లు క్రమక్రమముగా భూలోకమున దేశదేశములకు నిది వ్యాపించినది.

ఈయభినయశాస్త్రము నాట్యశాస్త్రమున కెల్లఁ దలమానిక. కేవలము హస్తవిన్యాసాదులమూలమును నెట్టి భావములనైనను హృదయగతములఁగాఁ జేయుట దీనియందలి యొకవిశిష్టత. ఇది యొకయసాధారణ శిల్పకలావిన్యాసము. ఇట్టిది భారతీయుల యసామాన్యప్రభావిశేషములఁ జాటిచెప్పు నొకశాస్త్రరాజ మనుటకు సంశయింపఁ బని లేదు. ఈశాస్త్రగ్రంథమును దెనుఁగున నొకప్రబంధముగా నవతరింపఁజేసిన యీకవితల్లజునకుఁ గలకాల మాంధ్రలోకము కృతజ్ఞతము గాకతీఱదు. గ్రంథము చిన్నదియేయైనను దీనివలని ప్రయోజనము చాలగొప్పదియే! ఇట్టి గ్రంథరాజమును దాటియాకులలో చూర్ణముఁ గానీయక యుద్ధరించి ప్రచురించిన ప్రాచ్యభాండాగారమువారు మన కెంతయుఁ బ్రశంసాపాత్రులు.