నా జీవిత యాత్ర-4/ప్రథమ ఆంధ్ర శాసన సభ - ప్రకాశంగారి నాయకత్వము

వికీసోర్స్ నుండి

19

ప్రథమ ఆంధ్ర శాసన సభ -

ప్రకాశంగారి నాయకత్వము

కర్నూలులో ఉన్న కోర్టు భవనాన్ని శాసన సభా మందిరంక్రింద మార్చడం జరిగింది. ప్రభుత్వ మేర్పాటయిన ఒక నెల తర్వాత ప్రథమ శాసన సభాసమావేశము జరిగింది.

అంతకు ముందు, నా పార్టీకి చెందిన - నల్లపాటి వెంకట్రామయ్యగారినీ, పసల సూర్యచంద్రరావుగారినీ క్రమంగా స్పీకరు, డిప్యూటి స్పీకరుగా ఎన్నుకోడానికి ప్రభుత్వ పక్షాన ఉండే శాసన సభ్యుల సమావేశంలో నిర్ణయింపబడింది.

శాసన సభ స్పీకరు ఎన్నిక కాకపూర్వము, సభ్యులు యావన్మందీ భారత సంవిధానము ఎడల శ్రద్దానిష్ఠలు కలిగి ప్రవర్తిస్తామని ప్రమాణ స్వీకరణ చేయవలెను. సభ్యులలో అందరికన్నా వృద్ధుడైన సభ్యుని తాత్కాలిక అధ్యక్షునిగా గవర్నరు నియమిస్తారు.

ఈ సందర్భంలో, గుంటూరునుంచి ఎన్నికైన నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావుగారిని గవర్నరు తాత్కాలిక అధ్యక్షునిగా నియమించారు. ఆయన బారిష్టరు. ప్రకాశంగారే ఆయన హైకోర్టులో న్యాయవాద వృత్తి ఆరంభించడానికి, బారిస్టరు పట్టీలో ఆయన పేరు చేర్చడానికి హైకోర్టులో ప్రతిపాదించారు. తరువాత, గాంధీగారి ఉద్యమం ప్రారంభమైన సందర్భంలో తాను సంపన్న గృహస్థుడైనా ఆస్తిపాస్తులు పోతాయన్న జంకులేకుండా దేశస్వాతంత్ర్యసమరంలో ధైర్యంగా దుమికిన స్వాతంత్ర్య యోధుడాయన. కొంతకాలం గుంటూరు మునిసిపల్ ఛైర్మన్‌గా ఉండేవారాయన.

ఆయన - చిన్నది, చక్కనిది అయిన శాసన సభ ప్రారంభోపన్యాసంచేసి, సభ్యులందరినీ ఒకరి తరువాత ఒకరికి సభ్యత్వ ప్రమాణ స్వీకారం (ఓట్ ఆఫ్ ఆఫీస్) తీసుకోమన్నారు. అది అయినతర్వాత, పైనచెప్పిన నల్లపాటి వెంకట్రామయ్యగారు స్పీకరుగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షంవారు ఊరుకోక ఒక అభ్యర్థిని పోటీబెట్టారు. వారి అభ్యర్థికి 48 వోట్లు, వెంకట్రామయ్యగారికి 86 వోట్లు వచ్చాయి. వెంకట్రామయ్యగారు గెలిచారు.

ప్రకాశంగారు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ పక్షపాతం లేకుండా స్పీకరు ఉద్యోగాన్ని నిర్వహించగలరని ఆశిస్తూ ఆశీర్వదించారు.

ఆ సమయంలో ప్రకాశంగారు మరొకమాటకూడా అన్నారు:

"అనేకమైన కష్టనష్టాల కోర్చి ప్రత్యే కాంధ్రరాష్ట్రము నిర్మించుకోగలిగాము. ఈ నిర్మాణ కార్యక్రమంలో నేనుకూడా కొంత భాగస్వామినై ఉన్నందుకు, నాకు అత్యంతమైన సంతృప్తి కలుగుతున్నది. మనలో మనకు భేదాభిప్రాయాలు ఎన్నో ఉన్నా, వాటిని సర్దుబాటు చేసుకొని, కలిసి ఈ రాష్ట్రం ఏర్పాటు చేసుకొన్నాము."

ఈ విధంగా మాట్లాడి, ఇదే ప్రకారంగా కలిసి మెలిసి పని చేసుకుంటూ వస్తే, ఆంధ్రరాష్ట్రం ముందడుగు వేయగలదని ఆశించారు.

దీర్ఘోపన్యాసమేమీ చేయలేదు.

గవర్నరు శాసన సభ్యులను సంబోదిస్తూ చేసిన ఉపన్యాసానికి, శాసన సభ్యుల కృతజ్ఞతను తెలియపరిచే తీర్మానం ప్రభుత్వపక్షాన ఉన్న శాసన సభ్యులలో ఒకరు 1953 నవంబరు 26 న ప్రతిపాదించారు.

తీర్మాన ప్రతిపాదన కాగానే, ప్రకాశంగారు శాసన సభ్యులకు ఒక విషయం చెప్పడానికి లేచి, ఇలా చెప్పారు.

"మన రాష్ట్రగవర్నరు సి. ఎం. త్రివేదిగారు తమకు రావలసిన జీతంలోంచి 1,200 రూపాయలు స్వచ్చందంగా వదులుకున్నారు. మాటలు పది చెప్పినా, డబ్బు విషయంలో చాలా మందికి చేయి సంకుచితమైపోతుంది. కాని, వీరు ఔదార్యంతో ఇంత వేతనము వదలుకోవడం చాలా ప్రశంసనీయ మైన విషయము. వారికి ప్రత్యేకంగా మన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను."

ప్రతిపక్షులు పట్టుదల కలవారు. వెంటనే, కృతజ్ఞతా తీర్మానానికి - గుంటూరు, విజయవాడల మధ్య తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయనందుకు తమ విచారాన్ని వెలిబుచ్చుతూ ఒక సవరణ ప్రతిపాదించారు. ఈ సవరణ న్యాయంగా చర్చకు తేవడానికి వీలులేదు. అది ప్రభుత్వం చేసిన ఏర్పాటు కాదు. ఆంధ్ర శాసన సభ్యులందరు బహుమతంతో చేసిన నిర్ణయము.

అయితే నేమి? స్పీకరుగారు సందిగ్ధమైన మనస్తత్వంగల మనిషి కావడంచేత, ఆ సవరణను చర్చించడానికి అనుమతించారు.

చర్చ ప్రారంభ దశలో, సభ్యుల మనసులలో విషయం తేటగా ఉండడానికని, ప్రకాశంగారు లేచి మాట్లాడారు. దాని సారాంశమిది:

"కర్నూలు పట్నం శాశ్వత రాజధాని కాదు. ఇది తాత్కాలికమయినదని చెన్నపట్నంలో ఆంధ్ర శాసన సభ్యులు కలిసి చేసిన తీర్మానంలో ప్రత్యేకంగా వ్రాసిఉన్నది. అందుచేత, మనమంతా సావకాశంగా ఆలోచించుకొని 'శాశ్వతమైన' రాజదానిని యిటుపైని ఏర్పాటు చేసుకోవాలని దాని అర్థము. ఇది నిస్సందేహమయిన పరిస్థితి. ఇంతేగాక, త్వరలోనే భారత దేశంలోగల రాష్ట్రాలను భాషారాష్ట్రాలుగా పునర్విభజన చేస్తామని భారతప్రధాని మాట యివ్వడమేగాకుండా, దానికి సంబంధించి ఉన్నతాధికారమున్న పరిశీలనా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ప్రకటన చేశారు. త్వరలో విశాలాంధ్ర ఏర్పడగలనన్న విశ్వాసము నాకున్నది. అప్పుడు హైదరాబాదు మనకు శాశ్వత రాజధాని కాగలదు. అది జరగడానికి రెండు మూడేండ్లకన్నా ఎక్కువ కాలము పట్టదు. ఈలోపున బాగా వెనకబడ్డ కర్నూలు కొంచెం బాగుపడడానికి చేసిన యీ ప్రయత్నాన్ని మీరంతా ఎందుకు అడ్డుతారు? ఇదికూడా మన ఆంధ్రప్రాంతమే కదా? కనుక, కోపతాపములు లేకుండా చర్చ సాగనివ్వండి." అయితే, చర్చ మామూలు విధాన్నే ప్రతిపక్షంవారు అనుకున్న అప్రస్తుత పద్ధతిలోనే సాగింది. అయినప్పటికీ 28-11-1953 నాడు ఆ తీర్మానము బహుమతముగా ఆమోదమయింది.

కానీ, ఒకటిమాత్రం స్పష్టంగా తేలింది. అదేమిటంటే - ప్రభుత్వం సాఫీగా నడవడానికీ, శాశ్వత సత్కార్యక్రమంలో ముందంజ వేయడానికీ మనశ్శాంతిలేని ప్రభుత్వాధిపతిగా ప్రకాశంగారు నడుచుకోవలసి వచ్చింది. అంతకుముందు రెండు నెలలక్రింద జ్యోతిష్కులు చెప్పిన బాధలు ప్రారంభమయినాయి. అయితే, ప్రభుత్వ పక్షాన ఉన్న 67, 68 మందీ సభ్యులూ చివర విశ్వాస రాహిత్య తీర్మానం వచ్చేవరకు ప్రభుత్వపక్షాన్ని బలపరుస్తూనే వచ్చారు.

30-11-1953 న ప్రతిపక్షులు తిరిగి ఈ రాజధాని ప్రశ్న లేవదీశారు. ఈ రోజున స్పీకరు వెంకట్రామయ్యగారు పరస్పరమూ ప్రతికూలములయిన రెండు, మూడు రూలింగు లివ్వడం తటస్థించింది.

దాంతో, ఉపముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారికి చీకాకు వేసి, "అధ్యక్షస్థానం ఎడల నాకేమీ అగౌరవములేదుగానీ, పరస్పర ప్రతికూలమైన రూలింగుల బాధ పడలేను" అని చెప్పి పైకి వెళ్ళిపోయారు.

వెంకట్రామయ్యగారు ఆ విధంగా ఒక నిర్ణయానికి రాలేని మనిషి అని ఆయనను అధ్యక్ష పదవికి ప్రతిపాదించినపుడు తెలుసుకోలేక పోయాము. అసలే ప్రభుత్వం పెద్ద మెజారిటీ లేని స్థితిలో ఉంది. దానికితోడు అసందిగ్ధమైన నిర్ణయాలతో తీర్పు చెప్పలేని సభాధ్యక్షుడు కూడా ఉన్నట్టయితే, ఆ ప్రభుత్వం దుస్థితి యిక వేరే చెప్పాలా?

ఆ రోజూ సభ వాయిదా వేసిన తర్వాత, ప్రకాశంగారు సభలోంచి మెల్లిగా బయటకు వస్తున్నారు. ఆయన వస్తూన్న వరండా అట్టే వెడల్పులేదు. అంతట్లో 'స్పీకరుగారు వస్తున్నారు, స్పీకరుగారు వస్తున్నారు" అని డఫేదారు అంటున్న మాటలు ప్రకాశంగారు విన్నారు. ప్రకాశంగారిని చూసి, స్పీకరు కొంచెం వెనక్కు తగ్గి మెల్లిగా అడుగులు వేశాడు.

ప్రకాశంగారు వెనక్కు చూడకుండానే, నవ్వుతూ, "ఏమయ్యా వెంకట్రామయ్యా! మా ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోతే, నీ రూలింగుల వల్లనే పడిపోతుందిలే!" అన్నారు.

దీనిపై స్పీకరుగారు, ఆ మాటలు విన్న అంతమందీ గొల్లున నవ్వారు.

కాని, నిజానికి మరి పదకొండు నెలల తర్వాత, ప్రకాశం ప్రభుత్వంపై వచ్చిన విశ్వాసరాహిత్య తీర్మానంపైన జరిగిన చర్చలు, ఆ రోజున స్పీకరు ఇచ్చిన పరస్పర విరుద్ధమయిన రూలింగులు చదివినట్టయితే, ప్రకాశంగారన్నట్లు పైన పేర్కొన్న మాటలు భవిష్యత్సూచకములైన మాటలని తెలియగలదు.

ప్రకాశంగారు ఒక్కొక్కప్పుడు డొంకతిరుగుడుగా మాట్లాడేటట్టు కనిపించేవారు. కాని, అది ఆయన బుద్ధిపూర్వకంగానే మాట్లాడే విధానము. ప్రభుత్వమేమి చేసినా అభ్యంతరము చెప్పే ప్రతిపక్షం ఎదురుగా కూచున్నప్పుడు, వారి మనసు తిరగడానికి అటువంటి విధాన మవలంబించేవారు.

ఆ సమయంలో నిల్చుని మాట్లాడవలసిన ముఖ్య మంత్రి మనస్థితీ, ముందుగానే మనసులో ఒక తీర్పు నిర్ణయించుకొన్న హైకోర్టు జడ్జీముందు వాదించే న్యాయవాది మనస్థితీ, పద్ధతీ ఒకే విధంగా ఉంటాయి.

విషయానికి సంబంధించకుండా, విషయానికీ మరీ దూరంగా పోకుండా - సర్వజనాంగీకారమైన కొన్ని మాటలతో ప్రారంభించి, మెల్లిగా ప్రతిపక్షుల ముఖ వైఖరిలో కొంచెం మార్పు కలిగిన తర్వాత అసలు విషయంలోకి దిగాలి.

అటువంటి సమయాలలోనే ప్రకాశంగారు కొంచెం డొంక తిరుగుడుగా మాట్లాడేవారు.

కర్నూలు శాసన సభలో ఉన్న ప్రతిపక్షులు ఏకంగా మాట్లాడేవారు చాలామంది ఉండేవారు. కాని వారు కార్య నిబంధనలతో అట్టే సంబంధం పెట్టుకొనేవారు కారు. వారు గట్టిగా మాట్లాడితే, స్పీకరు వెంటనే మెత్తబడుతూండేవారు. అందుచేత అడ్డు, ఆపులేని వారి విజృం భణ శాసన సభా సంప్రదాయ బద్దులమైన మా వంటివారికి కొంత కష్టంగానే ఉండేది.

1954 లో స్థానిక సంస్థల శాసనాలను సవరించడానికిగాను, ప్రభుత్వ పక్షాన స్థానిక సంస్థల మంత్రి అయిన తిమ్మారెడ్డిగారు [1] ప్రతిపాదించారు.

అయితే, అదే సమయంలో, ఈ స్థానిక సంస్థల బిల్లు వెంటనే ప్రవేశపెట్టలేదని ప్రతిపక్షంవారు అభిశంసన పూర్వకంగా ప్రతిపాదన ఒకటి చేశారు.

తిమ్మారెడ్డిగారు బిల్లుకు నోటీసు ఇచ్చి ఉండడంచేత, వారి ప్రతిపాదనకు తావులేదు. ఆ విధంగానే పాపం, స్పీకరుగారు రూలింగుకూడా ఇచ్చారు.

అయితే నేమి? ప్రతిపక్షులకు సంఖ్యాబలం హెచ్చుగా ఉంది కదా! శాసన సభలో జ్ఞానమంతా సంఖ్యాబలంతో పరిసమాప్తి చెందుతుంది. అందుచేత, ప్రతిపక్షంవారు బాగా జోరుగా మాట్లాడుతూంటే, ప్రకాశంగా రీ విధంగా అన్నారు:

"అధ్యక్షా! నిన్న సభ వాయిదా వేస్తూ, సభ్యులంతా అలిసి పోయారని మీ రన్నారు. కాని, ఇక్కడ కూర్చున్న మాలో ఎవ్వరూ అలిసిపోలేదు. అలిసిపోము. మనమంతా ఒక మహాకార్య నిర్మాణం మధ్య ఉన్నాము. మనము ఎంత సృజనాత్మకమైన కార్యము చేస్తున్నామో అందరూ గ్రహించినట్టు కనిపిం చదు. ప్రతిపక్షంవారు, 'అభిశంసన' 'అభిశంసన' అని పదిమార్లు అంటున్నారు. ఎవరు, దేనికి అభిశంసన తెస్తున్నారు? నేను ఇంతసేపూ మౌనంగా కూచున్నాను. ఎవరైనా నిర్మాణాత్మకంగా మాట్లాడుతారేమోనని శ్రద్దగా వింటున్నాను. చర్చలు క్రమబద్దమైన ఒక త్రోవలోకి వస్తాయేమో అని ఆశిస్తున్నాను.... ...

"ఎండబాధ, వానబాధ మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టజాలవు. కాని, ఏదైనా పార్ల మెంటరీ సంప్రదాయ మార్గంలోకి మనమంతా రాగలమేమోనని చూస్తున్నాను.

"మేము బిల్లు ప్రవేశపెట్టడమే వారుచేసే 'అభిశంసన'కు రుజువు అని వారంటే, ఇటుపైని ఇక్కడ మీరు, నేను కూచునేది ఎలాగు? పనిచేయకుండా మనము వెళ్ళిపోలేము గదా! అందుచేత, మన చర్చలు అసలు చర్చనీయాంశంలోకి వెళ్ళేలాగు చేయండీ."

మరికొంత చర్చ సాగిన తర్వాత - అయినదానికి కానిదానికి ప్రతిపక్షులు వాదిస్తున్న సమయంలో, ఆయన మరో మారు లేచి ఇలా అన్నారు:

"మాటలు చెప్పడంలో ప్రతిపక్షులు మహా ఘటికులు. ఆ కీర్తి వారిదేనని నేను ఒప్పుకుంటాను. అధ్యక్షుడు కుర్చీలో కూచున్నారనే విషయం కూడా, మన ప్రతిపక్షుల దృష్టిలో ఉండదు గదా! శాసన సభలో కానివ్వండి, శాసన సభ వెలుపల కానివ్వండి, వారి మాటే చివరిమాట కావాలంటారు. వారు చెప్పేదే, జ్ఞానానికి అవధి అంటారు.

"ఓ మారు రాజగోపాలాచారిగారు ఎప్పుడో చెప్పిన మాటలు చదివి వినిపిస్తారు. ఓ మారు తిమ్మారెడ్డిగారు చెప్పిన మాట లేవో తీసి చదివి వినిపిస్తారు. అలాగే, అంతులేకుండా, వారు చెప్పిందీ, వీరు చెప్పిందీ చదివి వినిపిస్తూంటారు. స్వంతంగా చెప్పవలసిన విషయం లేకపోబట్టే, వారి మాటలూ వీరి మాటలూ చదివి సభలో కాలక్షేపం చేస్తారు." ప్రకాశంగారి ఈ మాటలను బట్టి పాఠకులకు నాటి కర్నూలు ప్రభుత్వ మే స్థితిలో ఉందో తెలుస్తుంది.

అయినప్పటికీ, ఉన్న 13 నెలలలోనూ, ఐదారేండ్లు ఉంటేగానీ ఏ ప్రభుత్వమూ చేయలేని పనులు చేయగలిగారు.

మధ్యకాలంలో సంజీవరెడ్డిగారికీ, వారికీ మధ్య మనస్పర్థలు పెరిగినా ప్రభుత్వపు చురుకుదనం మందగించలేదు.

తమ ప్రభుత్వ కాలంలో - 13, 14 నీటిపారుదల ప్రాజెక్టులు స్థాపించారు; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని సంస్థాపించారు; ఆంధ్ర హైకోర్టు (ఉన్నత న్యాయస్థానము) నెలకొల్పారు; తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులు శాసన రూపంలో చేశారు.

ఖైదీలందరికీ విముక్తి

ఆంధ్ర ప్రభుత్వం ఏర్పాటయిన కొద్ది కాలంలోనే, కమ్యూనిస్టు పార్టీ సభ్యులనుంచి - తమ పార్టీకి చెందిన ఖైదీలను, డెటిన్యూలను విడుదల చేయవలసిందని అర్జీలు శరపరంపరగా రాసాగాయి. అందుచేత, ఆ విషయం కాబినెట్‌లో చర్చించవలసిన అగత్యం కలిగింది.

ఉద్యోగులు _ ఈ అర్జీలను పరిశీలించి, రాజకీయ కారణాలవల్ల జైలులో ఉన్న కమ్యూనిస్టుపార్టీ ఖైదీలను, డెటిన్యూలను రెండు శాఖలక్రింద విభజించారు. ఒక శాఖలో అపాయకారులని కొందరినీ, రెండవ దానిలో అంత అపాయకారులు కారన్న వారినీ పేర్కొన్నారు. అయితే అనపాయకారు లని వారు సూచించిన కొందరిపై హత్యా నేరాలు ఆరోపింపబడి ఉండెను.

వారు వచ్చిన జిల్లాలలో నుంచే మంత్రివర్గంలో ఒక మంత్రి కూడా ఉండేవరు. ఆయన - వారు చాలా అపాయకారులు గనుక, వారిని వదలడానికి వీలులేదని వాదించారు.

మరొక మంత్రి, "హత్యచేసిన వారినే అనపాయకారులుగా ఉద్యోగులు భావించగా, మిగిలిన వారిని ఖైదులో ఎందుకు ఉంచాలి?" అని వాదించారు.

మరొకరు, "సాధారణ హత్యలకన్నా రాజకీయ హత్యలు సంఘ విద్రోహకరమైనవి గనుక, వారిని అసలే విడిచి పెట్టకూడదు" అన్నారు. ఇంకొకరు, "హత్యానేరానికి గాక, ఇతర నేరాలకు ఖైదులో ఉంచబడినవారి సంఖ్య తక్కువగా ఉంది" అన్నారు.

అందుకు మరొక మంత్రి "హత్య చేసినవారు 'రాజకీయ వాదులు' కాబట్టి వదిలి పెడతామంటే, రాజకీయవాదులు కాకుండా హత్యచేసినవారు చేసిన పాపమేమిటి?" అని ప్రశ్నించారు.

ఇంతేకాక, హత్యచేసిన రాజకీయవాదులను ఖైదునుంచి విడుదల చేస్తే చిల్లర మల్లర నేరాలకు శిక్షింపబడిన వారంతా విడుదలకాక శిక్ష ననుభవిస్తూనే ఉండవలసి వస్తుంది.

అందుచేత, ఇంకొక మంత్రి అపుడు అందరినీ వదలిపెట్ట వలసి వస్తుందే అని తన మాటగా అన్నారు.

అంతవరకు మాట్లాడకుండా ఉన్న ప్రకాశంగారు, కన్నులు తెరిచి, అందరివైపు చూసి-

"అందరినీ వదిలేస్తే తప్పేమిటి?" అన్నారు.

చర్చ ఫలితంగా వచ్చిన సిద్ధాంత వాక్యం తర్క సమ్మతమైనదే; కానీ, వాదించిన వారి కందరికీ అది అత్యాశ్చర్యకరంగా తోచింది. వారి వాదాలు సవరించుకో నారంభించారు.

ప్రకాశంగారు, "బాగా ఆలోచించండి, సభ వాయిదా వేద్దాము" అని, సభ వాయిదా వేసేశారు.

అప్పటికే మూడుగంటలు కూచున్నాము.

మరునాడు, తిరిగీ కాబినెట్ సమావేశ మయ్యేసరికి ఏడుగురు మంత్రులలో ఐదుగురు ప్రకాశంగారితో ఏకీభవించారు.

కాని, ప్రకాశంగారు అటువంటి తీర్మానానికి బహుమతము (మెజారిటీ) చాలదనీ, సర్వ సభ్య అంగీకారము (యునానిమిటీ) కావాలనీ అన్నారు.

మంత్రులు, ముఖ్య కార్యదర్శి ముందు వెనుకలు కొంతసేపు గదిలో, కొంతసేపు వెలుపల ఆలోచిస్తూ దాదాపు రెండుగంటలు కాలయాపనం చేయగా, ప్రకాశంగారు తిరిగి సమావేశం మర్నాటికి వాయిదా వేశారు. మర్నాడు కలుసుకొనేసరికి, ఏడుగురు మంత్రులు ఏకీభావంలోకి వచ్చారు.

ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కూడా - సంతృప్తి, అసంతృప్తుల మద్య డోలాయమాన మానసుడై, ఆ ఖైదీలలో కేంద్ర ప్రభుత్వ ఖైదీలుగా ఉన్న కొందరిని కేంద్రం అనుమతిలేక విడిచిపెట్టే వీలులే దన్న అభ్యంతరం సూచించాడు.

ఆ మద్య కాలంలోనే, నేను ఒకమారు జంకుతూ, "తుదినిర్ణయం తీసుకొనేముందు ప్రధాన మంత్రితో మీరు ఒకమారు ఈ విషయాలు మాట్లాడితే బాగుంటుందేమో!" అన్నాను ప్రకాశంగారితో.

అందుకు ఆయన వెంటనే, "ఇది మన బాధ్యత. మరొకరి సలహా తీసుకొనే పరిస్థితి వస్తే, ముందుగా రాజీనామా యిచ్చేయడం మంచిది," అన్నారు.

ఆ మాటతో, నేను సంవిధాన సూక్ష్మతను గ్రహించి, నేను చెప్పిన మాటలు మరెవరూ వినకుండా నేనే ముందడుగు వేయడం మంచిదని ప్రధాన కార్యదర్శితో, "ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రభుత్వంవారు కారాగారావాసు లందరినీ విడుదల చేయడానికి నిశ్చయించారు - అని తీర్మానం వ్రాయండి" అన్నాను.

రాజకీయాలతో ప్రసక్తి లేకుండా అ విధంగా, దేశ చరిత్రలో ఎన్నడూ జరగని మోస్తరుగా, సర్వ కారాగృహవాసులకు విముక్తి కలిగించాము.

ఆ క్షణాన కోర్టులలో విచారింపబడుతున్న వారిని కూడా విముక్తులను చేయడం జరిగింది.

ఆ తరువాత 48 గంటలకు కారాగృహ శిక్ష పొందిన ఖైదీలెవ్వరూ ఆంధ్రరాష్ట్ర కారాగారాలలో లేరు.

అయితే, తల్చుకుంటే ఇప్పటికీ గుండె దడదడలాడే ఒక దుస్సంఘటన జరిగింది.

కాబినెట్‌లో మేము చేసిన తీర్మానం తంతి వార్తలద్వారా అన్ని జైళ్ళకు పంపిఉంటే ఆ దురంతం జరిగిఉండేది కాదు. మర్నాడు ఉదయమే ఉరిశిక్షకు పాత్రుడయిన ఒక ఖైదీ విశాఖపట్నం జైలులో ఉండెను. అక్కడి జైలరుకు ప్రభుత్వ తీర్మానం అందకపోవడంవల్ల, తన డ్యూటీ ప్రకారం అత డా శిక్షను అమలు పరిచాడు.

ఘోరము జరిగింది. కాని ఎవరమూ ఏమీ చేయలేకపోయాము.

ఈ సర్వకారగారవాసుల విముక్తి విషయం బయటపడేసరికి చాలామంది సంతోషించారు. కొందరు విభ్రాంతు లయారు.

భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు, నెహ్రూగారుకూడా ఇంత సాహసకార్యం చేయలేదని - స్వాతంత్ర్య వాదు లనేకులు ప్రకాశంగారిని ప్రశంసించారు.

వ్యక్తిగతంగా, ప్రకాశంగారికి వ్యతిరేకులు కొందరున్న విషయము అందరికీ తెలిసిందే.

ఇలా ఉండగా, నెల్లూరిలో బెజవాడ గోపాలరెడ్డిగారి మామగారి యింట్లో దొంగలుపడి, బంగారపు వస్తువులను దొంగలించారన్న వార్త పత్రికలలో పడింది.

వెంటనే ఈ దొంగలు, ప్రకాశంగారివల్ల విడువబడ్డవారేనని నిశ్చయించి, ప్రకాశంగారు చేసినంత తెలివితక్కువ పని ఎవరూ చేయరని ఆయన వ్యతిరేకులు వాదించారు.

గవర్నరు నన్ను పిలిచి, 'చూశావా ఈ వార్త' అని ముదర కించారు.

వెంటనే, మేము ప్రభుత్వపక్షాన దర్యాప్తు జరిపించగా, ఆ దొంగతనము చేసినవారు "ఫస్ట్ అఫెండర్స్," (అనగా అప్పుడే మొదటి నేరము చేసినవారు)గా తెలియవచ్చింది.

ఆ తర్వాత ఈ పై విధంగా విమిక్తి పొందిన వా రెవరూ తిరిగి నేరాలు చేశారన్న రిపోర్టులు ప్రభుత్వానికి రాలేదు. పత్రికలలోనూ అటువంటి వార్తలు పడలేదు.

అయితే, ఈ విషయానికి సంబంధించిన ఒక ముచ్చట చెప్తాను.

భాషారాష్ట్రాలు ఏర్పాటు చేసిన సందర్భంలో, ప్రకాశంగారు చేసినట్టు అన్నీ రాష్ట్రాలలోని ఖైదీలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు విడుదల చేయవలసిందన్న సూచన ఎవరో లోక్ సభలో తీసుకువచ్చారు.

కర్నూలు కాబినెట్‌లో ఈ విముక్తి విషయమై జరిగిన దీర్ఘ చర్చల విషయం నెహ్రూగారికి తెలిసిఉండదు. తెలుసుకొనేందుకు యత్నించి కూడా ఉండరాయన. ఆయన తత్వ మటువంటిది.

లోక్ సభలో ఆయన ఇలా అన్నారు: "ప్రకాశంగారు అకస్మాత్తుగా రాత్రికిరాత్రే ఒక ఆలోచన తెచ్చుకొని అలాంటి పనిచేశారు. అలాంటిది మనమంతా ఎలా చేస్తాము"

నీటిపారుదల ప్రాజెక్టులు.

ప్రత్యేకాంధ్రరాష్ట్రం కావాలని కోరినపుడు చాలామంది మనసులలో సువ్యక్తమయిన ఒక కారణముండేది అది - ఆంధ్రప్రాంతాలలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయమై ఉమ్మడి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోలేదని.

ఉదాహరణకు, అప్పటికి నాలుగు సంవత్సరాల ముందునుంచీ ప్రభుత్వపు కాగితాలలో ఆలోచనలో ఉన్నట్టు కనిపించిన 'వంశధార ప్రాజెక్టు' కాగితాలలోనే ఉండిపోయింది.

ఇంతేకాక, 1930 ప్రాంతాలలో చక్కగా పరిశీలించి, అన్ని విధములయిన వివరాలతో నివేదిక తయారై ఉన్నప్పటికీ కృష్ణానదిపై పులిచింతలవద్ద రిజర్వాయరు నిర్మాణం ప్రాజెక్టు ఆగిపోయింది.

అది అయిన కొంతకాలానికి, శాసన సభలో ఎవరో దాన్ని గురించి ప్రశ్నించగా, అపుడు అధికారంలో ఉన్న పి.సి రామస్వామి అయ్యరుగారు చెప్పిన జవాబు ఇది: "నేను పదవి స్వీకరించేనాటికి నా చేతికి రెందు ప్రాజెక్టుల రిపోర్టులు వచ్చాయి. ఒకటి మెట్టూరు ప్రాజెక్టు (తంజావూరు జిల్లా). రెండు పులిచింతల ప్రాజెక్టు (కృష్ణా జిల్లా). ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవాలి. రెండింటిని తీసుకోడానికి ప్రభుత్వం దగ్గర ధనము లేదు. కనుక రెండు స్కీములలో ఏదో ఒకటి తీసుకోవలసి ఉండగా, మెట్టూరు ప్రాజెక్టు తీసుకొంటిని," ఆంధ్రప్రాంతంలో గల నీటిపారుదల ప్రాజెక్టులపై ఉమ్మడి ప్రభుత్వం దృష్టి ఆ విధంగా చులకనగా ఉండేది.

ఆంధ్రప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లాలలో గల శాసన సభ్యులనే గాక, ఇతర మిత్రులను కూడా పిలిచి 17 మధ్య తరగతి ప్రాజెక్టులు (మరీ హెచ్చుగా ఖర్చు కానివి) శాంక్షను చేయడము, [వీటిలో నాగావళి, వేగవతి, స్వర్ణముఖి (శ్రీకాకుళం జిల్లా), స్వర్ణముఖి (కాళహస్తి దగ్గర), గంభీరము గెడ్డ, పాలేరు, నగిలేరు, పెన్నారు, ఏలేరు నదులపై కట్టవలసినవి ఉన్నాయి.] అప్పటి లెక్కలలో 6 1/2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదనంగా లక్షా యాభై వేల ఎకరాల భూమి సాగులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు జరిగాయి.

ఇదికాక, పులిచింతల ప్రాజెక్టు వదులుకొని, హైదరాబాదు ప్రభుత్వంతో కలిసి, పులిచింతలకు ఎగువగా నందికొండవద్ద మొత్తంపైన 30 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చే స్కీము, జాయంటు నివేదిక తయారుచేసి, ఆంధ్రప్రభుత్వం తరపున నేను, సంజీవరెడ్డిగారు, హైదరాబాదు ప్రభుత్వం తరపున డాక్టర్ మేల్కోటే (మంత్రి) ముగ్గురమూ స్వయంగా వెళ్ళి, కేంద్ర నీటిపారుదల మంత్రి అయిన నందాగారికి అందజేశాము.

ఈ స్కీము విషయమై వేరే తిరిగి వ్రాస్తాను.

  1. ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఏర్పాటయినదని వెనుక వ్రాశాను. తర్వాత - తిమ్మారెడ్డిగారు, సంజీవయ్యగారు, కోటిరెడ్డిగారు, పట్టాభిరామారావు గారలను త్వరలోనే మంత్రి మండలిలోకి తీసుకొని దాన్ని విస్తృత పరచడమైంది. మొదట నిరాకరించినా, తర్వాత చేరడానికి అంగీకరించి, గౌతులచ్చన్న గారు కూడా మంత్రి అయ్యారు. అయితే, మరికొంత కాలానికే ఏదో భేదాభిప్రాయం కలిగి ఆయన రాజీనామా యిచ్చి వెళ్ళిపోయారు.
    మిగిలిన వాళ్ళము ప్రభుత్వ పతనంవరకు కలిసి ఉంటిమి.