నా జీవిత యాత్ర-4/ప్రకాశం బారేజ్

వికీసోర్స్ నుండి

20

ప్రకాశం బారేజ్

మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలోనే, విజయవాడ దగ్గర - కృష్ణా ఆనకట్ట కుడిఒడ్డుకు కొంచెం దగ్గరగా కొంత భాగం అకస్మాత్తుగా జారిపోయింది. అప్పటికే ఆ అనకట్ట కట్టి వంద ఏండ్లకుపైగా అయింది. దాని క్రింద 11 లక్షల ఎకరాల వరిపంట ఉంది.

భారత దేశంలోని ప్రాజెక్టులలో ఇది ఒక పెద్ద ప్రాజెక్టు.

ఆనకట్టకు దెబ్బతగిలినదని సగము రాత్రివేళ తెలిసి, అక్కడ ముఖ్య ఇంజనీరుగా ఉన్న వేపా కృష్ణమూర్తిగారు, మరి కొందరు సిబ్బందితో - ఇసుకతో నింపిన బస్తాలతోను, నావలతోను, గండిపడినచోట అడ్డువేయడానికి యత్నించారు. ఆ యత్నంలోనే ఆయన, మరి ఇద్దరు చిన్న ఉద్యోగులు, కొందరు కళాసీలు - నదీవేగానికి ఆగలేక ప్రాణాలర్పించి, ఆంధ్రుల నందరినీ కన్నీటముంచిన దుస్సంఘటన సంభవించింది.

పాత అనకట్ట పనికిరాదనీ, క్రొత్త బారేజ్ (ఇప్పుడు ఉన్నదే) నిర్మాణం కావాలని, ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు ఇచ్చిన సలహాపైని బారేజ్ నిర్మాణానికి రాతకోతలు జరిగాయి. కాని, పనికి శాంక్షను రాలేదు.

ఆంధ్రులకున్న తొందర, చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి లేక పోయింది. అటువంటి దుస్థ్సితిలో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.

ఉత్తరాలతో, తంతివార్తలతో పనికాకపోవడం చేత, నేను ప్రకాశంగారి నడిగి డిల్లీ వెళ్ళాను. అక్కడ నెహ్రూగారిని సందర్శించగా, నన్ను ఆయన ప్లానింగ్ కమీషన్ వైస్ ప్రెసిడెంటు అయిన వి.టి. కృష్ణమాచారిగారిని చూడమన్నారు. ఆ కృష్ణమాచారిగారంటే నెహ్రూగారికి చాలా విశ్వాసము. ఆయన బ్రిటిషు గవర్నమెంటుకాలంలో బిరుదులు సంపాదించిన వ్యక్తి. 1937 లో కాంగ్రెసువారు గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తా రనేవి తథ్యమయినపుడు, బ్రిటిషు గవర్నమెంటులోని పెద్ద ఉద్యోగులతో తాను కాంగ్రెసువారి క్రింద పనిచేయలేనని చెప్పి, కొంచెం ముందుగానే ఒక స్వదేశ సంస్థానానికి దివానుగా వెళ్ళిపోయారు. అక్కడినుంచి యుద్ధకాలంలో మెట్టుపై మెట్టుగా ఎక్కి, యుద్ధానంతరం బ్రిటిష్‌వారికి అనువైన యుద్ధానంతర పునర్మిరర్మాన కార్యక్రమం (Post-war Re-contruction scheme), పెద్ద ఉద్యోగముల పునర్వ్యవస్థీకరణ (Services reform) గురించి నివేదికలు వ్రాయడం, మొదలయిన పనులు చేయడంలో, భాగం వహించి భారతదేశ స్వాతంత్ర్య ప్రాప్తినాటికి ప్రభుత్వదృష్టిలో ఉన్నతుడుగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్లానింగ్ కమీష న్‌కు అధ్యక్షులయిన నెహ్రూగారు కృష్ణమాచారిగారిని దాని ఉపాధ్యక్షులుగా నియమించారు.

కృష్ణమాచారిగారికి ఆంధ్రదేశానికి కొంత పూర్వపరిచయముంది. ఆయన విశాఖపట్నం జిల్లాలో విజయనగరం జమీందారీకి, డిప్యూటి కలెక్టరు హోదాలో ఉండగానే ట్రస్టీదివానుగా పనిచేశారు. కాబట్టి, విజయవాడ ఆనకట్ట మనదేశంలో వరిపంట కెంత ముఖ్యమైనదో తెలియనివారు కారు. అక్కడ జరిగిన దుస్సంఘటన సంగతీ తెలియనివారూ కారు. ప్రతిక్షణం జాగరణలో ప్రజలూ, ప్రభుత్వమూ ఆనకట్ట ఇంకేమి ప్రమాదానికి గురిఅవుతుందో అని గుండెలు చేత పట్టుకొని ఉన్న విషయమూ ఎరుగనివారు కారు.

ఇన్నీ తెలిసిన ఆయన - నేను వెళ్ళగానే కూచోబెట్టి, కాఫీ యిచ్చి, నేను చెప్పిన మాటలన్నీ యోగీంద్రునిలాగా తూష్ణీభావంతో విని, "వీటన్నిటికీ డబ్బు ఎక్కడ ఉంది?" అని ప్రశ్నించారు.

నేను మరికొంతసేపు వాదించిన పిదప, "కరువు ప్రాంతాలకు కేటాయించిన మొత్తంతో ఆ బారేజ్‌కు అవసరమైన ఖర్చు పెట్టుకోండి. నేను అభ్యంతరం పెట్టను," అన్నారు.

ఇంతకు మేము అడిగింది అప్పు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉండిఉండగా, పని చురుకుగా జరిగితే, ఉమ్మడి రాష్ట్రపు డబ్బే దీనికి ఖర్చు అయిఉండును.

మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నాటికి, కృష్ణా అనకట్ట - దానిపై పెట్టిన ఖర్చులు, వడ్డీలు అన్నీ పోగా 12 కోట్ల రూపాయల రాబడికి చేకూర్చిన స్కీము.

రాష్ట్ర విభజన అప్పుడు, దీనికైన 2 కోట్ల, 20 లక్షల రూపాయలు ఆంధ్రరాష్ట్రం తీర్చుకోవలసిన అప్పుల పట్టీలో చేర్చారు. కానీ - ఖర్చులు, వడ్డీలు పోను వచ్చిన రాబడిని మనకు జమ చేయలేదు.

కృష్ణమాచారిగారు చెప్పిన విషయం ప్రకాశంగారికి చెప్పగానే ఆయన - దేశావసరములదృష్ట్యా, అసలు అనకట్ట పరిస్థితి దృష్ట్యా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయడానికి వీలులేదనీ, కేంద్రప్రభుత్వం వారు అప్పు ఇవ్వకపోతే, రాష్ట్రానికి గల ఇతర ఖర్చులైనా మానుకొని, పని వెంటనే ప్రారంభించవలసిందనీ ఇరిగేషన్ శాఖ చూస్తున్న సంజీవరెడ్డిగారితో చెప్పి, బారేజ్‌కు పునాదిరాయి వేయడానికి తేదీ, లగ్నము నిశ్చయించమని ఆదేశం ఇచ్చేశారు.

"డబ్బు విషయం తూగగలవా?" అని ఆర్థికమంత్రినైన నన్నడిగినప్పుడు, "దీనికి ఖర్చు మూడు కోట్లు. పని పూర్తి కావడానికి 2 1/2 ఏండ్లు అవుతుంది. డబ్బు విషయమై ఇబ్బంది ఉండదు," అన్నాను నేను.

ఈ విధంగా, అంత పెద్ద మేజర్ ప్రాజెక్టుకు కావలసిన అత్యవసరమైన విషయాలలో కూడా, కేంద్రప్రభుత్వంవారు - తాము వద్దన్నా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం విషయంలో తూష్ణీంభావాన్ని ప్రకటిస్తూ వచ్చారు.

అయినప్పటికీ, మన అదృష్టంకొద్దీ కేంద్రంలో దేశ్‌ముఖ్‌గారు ఆర్థికమంత్రి అయిఉండడంవల్లా, ఆయనకు ఆంధ్రరాష్ట్రంపై ఆదరబుద్ధి ఉండడంవల్లా, ఆర్థికంగా మనము ఇబ్బందులలో పడకుండా సర్దుకొని వచ్చేవారు.

నందికొండ ప్రాజెక్టు విషయమై మరొక విషయం కూడా - ఎన్ని అవస్థలు పడవలసివచ్చిందో సూచించడానికి వ్రాస్తున్నాను.

తిరిగీ కృష్ణమాచారిగారిని చూడక తప్పింది కాదు. ఈ పర్యాయం నందికొండ ప్రాజెక్టు (తరువాత ఇదే నాగార్జున సాగర్) విషయమై వెళ్ళాను. ఆయనను ఇంటిదగ్గర చూడవలసివచ్చింది. ఈ విషయం ఎత్తగానే, "అయ్యా విశ్వనాథముగారూ! మీ ఆంధ్రులకు నేనంటే నమ్మకం లేదు" అని వాతావరణమంతా కలుషితం చేయబోయారాయన.

నేను, "నమ్మకం, అపనమ్మకంతో - ఏమైనా, వ్యక్తిగతమైన వ్యవహారాలకు రాలేదు గదా!" అని చెప్పి, నందికొండ ప్రాజెక్టు శాంక్షను ఆలస్యం చేయవద్దని చెప్పాను. అయితే, ఆయన నా కేమి అర్థం కాదన్న ఉద్దేశంతో, "రిజర్వాయరు డామ్ 425 అడుగుల ఎత్తువరకే నిర్మించడానికి నువ్వు ఒప్పుకుంటే, వెంటనే ఈ స్కీము శాంక్షన్ చేస్తా"నన్నారు.

అందుకు నేను ఒప్పుకోనన్న ఉద్దేశంతో ఆయన అలా అన్నారు. నేను వెంటనే, "సరే, ఒప్పుకొంటున్నాను లెండి" అన్నాను.

అందుకు కారణ ముంది. 425 అడుగులు కట్టకట్టితే, కాలువలలోకి ఒక నీటిచుక్క అయినా మళ్ళించలేము. కట్ట అ ఎత్తున ఆపినట్టయితే ఆ స్కీము ఉట్టి దండగపని అవుతుంది. 425 అడుగులకు ఒప్పుకున్న తర్వాత, అంతవరకు చేసిన ఆ ఖర్చు పనికి రావడంకోసం మరొక 100 అడుగుల ఎత్తు కట్టకుండా ఏ ప్రభుత్వమూ పని ఆపదు గదా అనే ఉద్దేశంతో నేను సరేనన్నాను.

ఆయన అంతవరకు ఒప్పుకుంటే, మిగిలిన పని నెహ్రూగారితో చెప్పి సర్దుబాటు చేసుకోగలనని నా మనసులో ఉన్న విశ్వాసాన్ని గ్రహించక, కృష్ణమాచారిగారు, "నువ్వు ఒప్పుకుంటే, బొంబాయి గవర్నమెంటువారు ఒప్పుకోరు - నన్నేం చేయమంటావు?" అన్నారు.

ఆయన చెప్పిన మొదటి మాట ఎంత పేచీ మాటో - రెండవదీ అంతే పేచీ మాట.

నేను నెహ్రూగారి దగ్గరికి వెళ్ళి, స్కీము డిజైన్లు చూపించి, ఉన్న పరిస్థితి బోధపరిచాను.

ఆయన కది నచ్చినట్లే తోచింది. కానీ ఆయన వెంటనే "ఇది నాకు నచ్చితే ఏమి ప్రయోజనము? కృష్ణమాచారిగారు ఒప్పుకోవాలి గదా!" అన్నారు.

సరిలే! ఇది ఢిల్లీ ప్రభుత్వం పద్ధతి అనుకొని, ప్లానింగ్ కమీషన్ సభ్యులూ, ఆర్థికమంత్రీ అయిన దేశ్‌ముఖ్‌గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన వెంటనే, కృష్ణమాచారిగారు పెట్టిన అభ్యంతరం డబ్బుతోకానీ, సాంకేతికమైన విషయంతోకాని సంబంధంలేని మరొక విషయమని సూక్ష్మం గ్రహించి, ప్లానింగ్ కమీషనులో మరొక సభ్యులైన యోగి గారిని చూడమని నాతో చెప్పి, ఆయనకు టెలిఫోన్ చేశారు. వారు ప్లానింగ్ కమీషన్‌లో ఈ విషయం సరిచేస్తామని, కృష్ణమాచారిగారి అడ్డు ఉండదనీ చెప్పినమీదట నేను కర్నూలు తిరిగి వచ్చేశాను.

మరికొన్ని రోజులకు ప్లానింగ్ కమీషన్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో కృష్ణమాచారిగారినుంచి ముఖ్యమంత్రి ప్రకాశంగారికి ఒక ఉత్తరం వచ్చింది. అందులోని సారాంశ మిది: "కృష్ణానదిపై, ఏ మేజరు ప్రాజెక్టు కావాలో మీ రిదివరకు ప్లానింగ్ కమీషనుకు తెలియజేయలేదు. కాబట్టి, మీ కేదైన స్కీము ఉంటే, తొందరగా తెలియజేయ వలసింది."

ఈ ఉత్తర మెంత అసందర్భమైనదో వేరే చెప్పనక్కరలేదు. కానీ, అది వచ్చేసరికి ఆంధ్రప్రభుత్వ పరిస్థితులు విషమస్థితిలోకి వచ్చేశాయి. పైన చెప్పిన వివరాలతో ఆయనకు జవాబు వ్రాశాము.

అంతట్లో ఆంధ్రప్రభుత్వం పతనమయింది.

తరువాత, పత్రికలలో - ప్రకాశంగారి (ఆంధ్ర) ప్రభుత్వం నందికొండ ప్రాజెక్టుపై ఇదమిత్థమని నిర్ణయం చేయలేదనీ, గవర్నరు త్రివేదిగారు తమకున్న పలుకుబడితో ప్లానింగ్ కమీషనువారిని కలుసుకొని స్కీము శాంక్షను చేసి తెచ్చికొన్నట్లుగానూ వార్త పడింది.

గవర్నరు ప్రభుత్వం ముగిసిన తర్వాత, సంజీవ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉండగా, నెహ్రూగారు స్వయంగా వచ్చి - ఆ ప్రాంతంలోనే నాగార్జునుడనే ప్రపంచ విఖ్యాత బౌద్ద విద్వాంసుడూ, రసాయన శాస్త్రవేత్తా తపస్సు చేసిన పవిత్ర పర్వతం ఉండడంవల్ల ఆయన పేరిట, మొదట అనుకొన్న 525 అడుగుల ఎత్తుతో, శాంక్షను అయిన జలాశయానికి పునాదులు వేశారు.

ఆంధ్ర హైకోర్టు వ్యవహారం [1]

మన సంవిధానం ప్రకారంగా - ఏ రాష్ట్రమైనా హైకోర్టు ఏర్పాటు చేసుకోకుండా ఉంటే, ఆ ప్రక్క - రాష్ట్రం హైకోర్టుకు క్షేత్రాధి కారం (జ్యూరిస్డిక్షన్) అప్పజెప్పే ఏర్పాటు చేసుకోవచ్చునని ఉంది. ఆ కారణంచేతనే, ఆంధ్రరాష్ట్ర మేర్పడినప్పుడు, వేరే హైకోర్టు ఏర్పాటు చేసుకోకుండా, మద్రాసు హైకోర్టుకే మన రాష్ట్రంపై క్షేత్రాధికారం ఇవ్వడం జరిగింది.

ఇటువంటి పరిస్థితులలో, హైకోర్టు జడ్జీలను నియమించే సమయంలో, క్షేత్రాధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వపు ఉద్దేశాలను గూడా గమనించవలసిందని, "వాంఛూ" అనే చీఫ్ జస్టిసుగారు వ్రాసిన నివేదిక కాపీ చెన్నరాష్ట్ర ప్రభుత్వందగ్గర ఉంది.

కాని, ఆంధ్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండానే మద్రాసు హైకోర్టుకు జడ్జీలను నియమించడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్ర మేర్పడిన మూడు నెలలలోగానే జరిగింది.

నేను, ప్రకాశంగారితో చెప్పి, ఈ విషయంలో చెన్నరాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీని కలుసుకొని మాట్లాడడానికి వెళ్ళాను. ఆయన చాలా ఆప్యాయంగా మాట్లాడారు.

కాని, తమ హైకోర్టు జడ్జీల నియామకంలో బాధ్యత - పరాయి ప్రభుత్వంతో పంచుకోవడం ఎల్లా? అని ప్రశ్నించి, అటుపై జరిగే జడ్జీల నియామకంలో కూడా ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదన్నట్టు మాట్లాడారు.

దానిపై, నేను ఢిల్లీ వెళ్ళి, కేంద్ర హోమ్ మంత్రి కట్జూ గారిని చూశాను. ఆయనతో నాకు చాలా కాలంగా పరిచయముంది. 1928 లో లక్నోలో అఖిల పక్ష సమావేశంలో నెహ్రూగారి రిపోర్టును చర్చిస్తున్నపుడు, ఆయన - నేను నెహ్రూగారి బలపరచినప్పటినుంచి మా యిద్దరికీ బాగా పరిచయముండేది.

ఆయనను నే నిలా అడిగాను: "మద్రాసు హైకోర్టు జడ్జీలను నియమించినపుడు, ఆంధ్ర ప్రభుత్వాన్ని సలహా అడగాలని మీ కెందుకు తోచలేదు?"

"నిజమే. అడగవలసిందే కానీ, నాకు తోచలేదు" అని, ఆ సమయంలో దగ్గరగా ఉన్న హోమ్‌శాఖ కార్యదర్శి ఎ.వి. పాయ్‌గారిని చూసి, "ఏమి పాయ్‌గారూ! మీకూ ఈ విషయం తోచలేదా?" అని ప్రశ్నించారాయన.

పాయ్‌గారు తమకూ తోచలేదన్నారు.

దానిపైన, కొంత ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నాము. అందులో, ఆంధ్రరాష్ట్రం వేరే హైకోర్టు పెట్టుకోవడం ఉత్తమమని తేలింది.

కర్నూలుకు తిరిగి వచ్చిన తర్వాత ప్రకాశంగారి కీ విషయమంతా చెప్పాను. ఇంతేకాక, చెన్నపట్నంలో వృత్తి నడుపుకొంటున్న తెలుగు న్యాయవాదులకు కూడా పరిస్థితులన్నీ వివరంగా బోధపరచి, మన హైకోర్టు మనకు వేరే ఉండడమే శ్రేయస్కరమని నచ్చజెప్పాను.

అందుచేత, ఆంధ్రరాష్ట్రం ఏర్పడేటప్పుడు అనంగీకారము సూచించినవారు, మనకు ప్రత్యేకంగా ఉన్నత న్యాయస్థాన స్థాపనకు సుముఖత చూపించారు. దీనివల్ల దాదాపు 200 మందికి పైగా ఆంధ్ర న్యాయవాదులు శాశ్వతంగా చెన్నపట్నంలో ఇళ్ళు, వాకిళ్ళు, తక్కిన సంబంధాలు అన్నీ వదులుకుని పోవలసి వస్తుంది.

అయినా వారూ, నేను కూడా విశాలాంధ్ర వచ్చేవరకు తాత్కాలికంగా హైకోర్టు విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందను కున్నాము.

ప్రకాశంగారు ఈ విషయమై శాసన సభలో ప్రతిపాదించారు. 22-6-1954 న ఆంధ్రా హైకోర్టు స్థాపించాలనీ, దానికి విశాఖపట్నం కేంద్రమనీ తీర్మానం ప్రతిపాదించారు.

విశాఖపట్నం విషయంలో - నా సంబంధంగా ఏది వచ్చినా, కాదనడానికి విశాఖపట్నం జిల్లానుంచి వచ్చిన ఒకరిద్దరు శాసన సభ్యులుండేవారు. వారి సాయంతో నడింపల్లి నరసింహారావుగారు విశాఖ పట్నం అనే మాటముందు తాత్కాలికంగా అన్నమాట సవరణ చేశారు. నా మనసులో ఉన్నది కూడా అంతేకాబట్టి, వెంటనే లేచి ఆ సవరణ ఒప్పుకున్నాను.

తిరిగి 1-3-54 న, విశాఖపట్నం అనే మాటకు బదులు గుంటూరు అన్నమాట చేర్చవలసిందని సవరణ ప్రతిపాదించారు. విశాఖపట్నం జిల్లానుంచి వచ్చిన వారే ఒకరిద్దరు గుంటూరు అన్న సవరణకు కూడా ఒప్పుకున్నారు. వోటింగులో గుంటూరుకు అనుకూలంగా 67 వోట్లు, ప్రతికూలంగా 66 వోట్లు రావడంచేత, గుంటూరు అనే మాటతో తీర్మానం పాసయింది.

మళ్ళీ నరసింహారావుగారు, తాత్కాలికం అన్నమాట తీసివేయాలని సవరణ చేయడానికి ప్రయత్నించి విఫలు లై నారు.

తీర్మానం పాసు కాగానే నేను ప్రతిపాదించిన విశాఖపట్నం పేరు వీగిపోవడంచేత, నేను రాజీనామా ఇస్తానా అని ఒక రిద్దరు ప్రతి పక్షులు ప్రశ్నించారు.

నేను ఈ తీర్మానంలో ప్రధానమైన అంశం ఆంధ్ర రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడమనీ, అది సభవారు అంగీకరించారనీ, కేంద్రం అన్నది తాత్కాలికం గనుక అప్రధానమనీ చెప్పి, నేను రాజీనామా యివ్వక పోవడమేగాకుండా, గుంటూరులో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన 8 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నదని వెంటనే వెల్లడించాను.

అయితే - ప్రకాశంగారూ, నేనూ అనుకోనటువంటి కొన్ని భేదాభిప్రాయాలు మంత్రి మండలిలో కొందరినీ, సచివాలయంలో కొందరినీ బాధించినవి.

ఆ రోజునుంచి, మిగిలిన విభజన కార్యక్రమం నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం వా రొక ప్రత్యేక ఉద్యోగిని, ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అటువంటి ప్రత్యేకోద్యోగి ఆ హైకోర్టు స్థాపించిన తరువాత ప్రధాన న్యాయమూర్తిగా నియుక్తుడయే అవకాశ మున్నది.

ఆంధ్రా హైకోర్టుకు వచ్చే తెలుగు జడ్జీలలో అందరికన్నా సీనియరయిన వారిపైన సచివాలయంలో ఎవరి మూలంగానో ఏ తత్వాన్ని అనుసరించో ఒక ప్రతికూలత పుట్టింది. అది నేను కానీ, ప్రకాశంగారుకానీ గ్రహించలేక పోయాము.

హైకోర్టు ప్రత్యేకంగా స్థాపించాలన్న తీర్మానం కాబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా ఒప్పుకొన్నది కావడంచేత సచివా లయంలో కాగితాలు కదలడంలో జాప్యమవుతుందని గ్రహించలేక పోయాము. ఆ కారణంచేత - నేను గానీ, ప్రకాశంగారు కానీ కాగితాలు తొందరగా కదులుతున్నాయో లేదో కనుక్కోవడం తటస్థించలేదు.

ఇతర కారణాలవల్ల కూడా, ప్రభుత్వ వర్గాలలో వ్యక్తుల ఉద్యోగాల విషయమై మనస్పర్థలు పెరగడమెలా అలవాటో ఆ విధంగానే ఆంధ్ర ప్రభుత్వంలో ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారల మధ్య వైమనస్యం పెరగడం జరిగింది.

ఇంతట్లో వేసవికాలం వచ్చింది. శాసన సభ సమావేశం వాల్తేరులో ఏర్పాటు చేశాము.

ఆ శాసన సభలో చర్చించిన ముఖ్యమైన శాసనము - శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ శాసనము.

దీనిపై దాదాపు 19 రోజులపాటు చర్చలు జరిగిన తర్వాత సభవారు ఆమోదముద్ర వేశారు.

ఇదికాక, మిగిలిన సేల్సుటాక్స్ (అమ్మకం పన్ను) బిల్లుల సవరణలు, ధర్మాదాయ మత సంస్థల సవరణ బిల్లు, వాచక పుస్తకాలను జాతీయం చేయడం మొదలైన వాటితో మంత్రి మండలి కాలం సరిపోయేది.

ఒక పర్యాయం, నేను ఈ హైకోర్టు విషయమై ప్రకాశంగారితో గట్టిగా చెప్పడం తటస్థించింది:

"తీర్మానం ఆమోదించి అప్పటికే మూడు నెలలపైగా అయింది. మనము వెంటనే కేంద్ర ప్రభుత్వానికి వ్రాయకపోయినట్టయితే - ప్రత్యేక ఉద్యోగి నియామకం; రికార్డులు, లైబ్రరీ మొదలైన వాటిని విభజించే కార్యక్రమం ఆరంభం కాకుంటే, జూలై మొదటి వారంలో హైకోర్టు స్థాపించడం కష్టము. అది జరగక పోయినట్టయితే, ఇంత ప్రయత్నంచేసిన మనను చూసి నలుగురు నవ్వుతారు."

ప్రకాశంగారు ముఖ్య కార్యదర్శిని పిలిచి, ఒక రాత్రి కాబినెట్ మీటింగ్ ఏర్పరచారు. ఆ సమయంలో, ఇదివరకు రెండు, మూడు పర్యాయాలు జరిగినట్టే అందరు మంత్రులూ నిశ్శబ్దంగా కూచున్నారు. నేను, ఆలస్యమయితే లాభంలేదని, అందులో ఎవరో ఒక మంత్రిని పేరుపెట్టి పిలిచి, ఇలా అన్నాను:

"ఫలానా తేదీనాడు మనం హైకోర్టు ప్రారంభించక తప్పదు. గుంటూరులో కావలసిన ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. మనం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించవలసిందని, కేంద్ర హోమ్‌శాఖామంత్రి కట్జూగారికి వ్రాయాలి. ఆలస్యంచేస్తే, మనము వేసవి సెలవుల అనంతరం అనుకున్న తేదీకి కోర్టు ప్రారంభించకపోతే బాగుండదు."

మళ్ళీ అందరూ నిశ్శబ్దంగా ఊరుకున్నారు.

అందులో ఒకరు మెల్లిగా, "ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరు కాగలరు?" అని ఏదో ఇబ్బంది ఉన్న భావంతో ప్రశ్నించారు.

నేను, "న్యాయమూర్తి కె. సుబ్బారావు" అన్నాను.

ప్రకాశంగారు, "అవును. అనుమానం ఏమిటి?" అన్నారు.

మంత్రులలో ఒకరు, "అయితే ఇబ్బంది ఏమిలేదు" అని వారి మనసులో బాధ వదిలిపోయినట్టుగా ప్రక్కనున్న మంత్రి మిత్రులతో అన్నారు.

వెంటనే చీకటి అంతా వెలుగై ప్రకాశించింది.

ముఖ్య కార్యదర్శిని తీర్మానం వ్రాయమని, విషయం చెప్పాను. సుబ్బారావుగారిని స్పెషల్ ఆఫీసర్‌గా వేయమనీ, 5-7-1954 న హైకోర్టు ప్రారంభమవుతుందనీ అందులో వ్రాయించాము.

దీని తర్వాత జరుగవలసిన కార్యక్రమం, ఆంధ్ర సచివాలయానికి సంబంధించినంత మట్టుకు చురుకుగానే జరిగింది.

చెన్నపట్నంలో, 1953 సెప్టంబరులో - సచివాలయ విభజన సందర్భంగా జరిగిన చరిత్ర తిరిగీ హైకోర్టు విభజన సందర్భంలో జరగ నారంభించింది.

చెన్నపట్నం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజమన్నారు గారు, మనం చెప్పుకున్న సుబ్బారావుగారికి బావమరదులే. అయినా, ఇక్కడకూడా ఉద్యోగుల కేటాయింపులో ఊగులాటలు, గ్రంథాలయ విభజనల్లో, పుస్తకాలు ఒకరి చేతిలోనుంచి మరొకరు లాగుకోవడాలు కూడా జరగవలసి వచ్చిందట.

ఏదోవిధంగా విభజన కార్యక్రమం చురుకుగానే నడిచింది. మనము కోరినట్లు కేంద్రప్రభుత్వం సుబ్బారావుగారిని స్పెషల్ ఆఫీసరుగా నియమించింది. నేను అంతకుముందుగానే గుంటూరుకు పోయి, అక్కడి కలెక్టరు ఆఫీసు వేరే భవనంలోకి తరలించి, కలెక్టరు ఆఫీసులో కావలసిన మార్పులు, చేర్పులు చేయడానికి బిల్డింగ్స్ చీఫ్ ఇంజనీరును నియమించడం జరిగింది. భవనంలో చేసే ఏర్పాటులు, కట్టడములు, ఏయే గదులు ఏయే పనులకోసం కేటాయించవలసింది మొదలైన విషయాలలో స్పెషల్ ఆఫీసరుగారి ఆదేశాల ప్రకారం నడుచుకోవలసిందని చీఫ్ ఇంజనీరుగారిని ప్రభుత్వం ఆదేశించింది.

ఇది ఇలా ఉంటుండగా, తెరవెనక మరొక ముచ్చట జరిగింది. అప్పటికి అమలులో ఉన్న కేంద్రప్రభుత్వ హోమ్‌శాఖ ఆదేశాన్ని అనుసరించి - ఆంధ్రప్రభుత్వం సుబ్బారావుగారిని ప్రధాన న్యాయమూర్తిగా నియుక్తం చేయవలసిందనీ, మరో ఇద్దరి జడ్జీల పేర్లతో సహా, గవర్నరు సలహాతోబాటు కేంద్రప్రభుత్వానికి పంపింది.

ఇక్కడనుంచి, ఈ వ్యవహారంగురించి నేను వ్రాయబోయేది - హైకోర్టు సంస్థాపన తర్వాత, రాష్ట్రపతి రాజన్‌బాబుగారిని కలుసుకొన్నప్పుడు, వారు చెప్పిన విషయాలను బట్టి వ్రాస్తున్నాను.

సుప్రీంకోర్టు ముఖ్య న్యాయాధిపతికి వేరే భావాలు ఉండడంచేత కాబోలు, ఆయన రాష్ట్రపతికి ఈ విషయమై సిఫారసు చేయలేదు. అదివరలో అటువంటి ఆలస్యాలు జరుగలేదు.

హోం మంత్రి కట్జూగారిని కనుక్కుందామంటే, ఆయన ఢిల్లీ వదిలి, ఒరిస్సాలో పర్యటించడానికి వెళ్ళారు. ఆయన అక్కడినుంచి అటే 5-7-54 న గుంటూరుకు వచ్చేటట్టు తీర్మానింపబడడంచేత ఆయనను కనుక్కునే అవకాశమే లేకపోయింది.

సుప్రీంకోర్టు రిజిస్ట్రారును అడిగితే, ముఖ్య న్యాయమూర్తి దీనికి సంబంధించిన కాగితాలు తమదగ్గరే ఉంచుకొని, ఏదో చల్లటి స్థలానికి వెళ్ళిపోయారని - తమకు తెలిసిన భోగట్టా చెప్పారు.

ఆ చల్లటి స్థలంనుంచి ఆయన సిఫారసు పంపిస్తారో, పంపించరో అన్న అనుమానం కలిగి, రాష్ట్రపతిగారు ఆ ఫైలుమీద తమ ఆజ్ఞ వ్రాశారు. దాని సారాంశ మిది:

ఆంధ్రా హైకోర్టు ప్రారంభ దినం 5-7-1954. అందుకు నేటికి నాలుగు రోజులే వ్యవధి ఉంది. సుప్రీంకోర్టు ముఖ్య న్యాయమూర్తి సిఫారసు ఇంకా అందలేదు. అయినా, ఆంధ్ర ముఖ్యమంత్రి, గవర్నరు ఇద్దరూ ప్రస్తుతం స్పెషల్ ఆఫీసరుగా పనిచేస్తున్న మద్రాసు హైకోర్టు జడ్జి కోకా సుబ్బారావుగారి పేరే సూచించారు. అందుచేత, కోకా సుబ్బారావుగారిని 1954 జూలై 5 నుంచి, ఆ రోజున ప్రారంభమవుతున్న ఆంధ్రరాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ముఖ్య న్యాయమూర్తిగాను, తక్కిన ఇద్దరిని జడ్జీలుగాను నియమించడమైనది."

దీనిని, మామూలు పద్ధతిగా - రాష్ట్రపతి జారీచేసే ఆదేశాల ఇతర లాంఛనాలతో, కావలసిన ఇతర ఉద్యోగులు సంతకాలతో జారీచేసిన ఆదేశాన్ని 4-7-54 నాటికే గుంటూరులో ఆంధ్రప్రభుత్వానికి స్వయంగా ఇవ్వడానికి ఒక ప్రత్యేక ఉద్యోగిని పంపించారు.

గుంటూరులో, ఈ ఆదేశం అందగానే అంతదాకా ప్రభుత్వానికున్న ఆందోళన నివారణ మయింది.

ఇక్కడినుంచి ఆ తర్వాత గుంటూరులో జరిగిన విషయాలు వివరిస్తాను.

మర్నాడు ఉదయం, 3, 4 వందల న్యాయవాదుల సమక్షంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభామందిరంలో, ప్రకాశంగారు - ప్రారంభోపన్యాసం చేయడానికి కట్జూగారిని ఉచితమైన వాక్యాలతో ఆహ్వానించారు.

కట్జూగారి ప్రారంభోపన్యాసము, మిగిలిన సంప్రదాయానుసారమైన ఉపన్యాసాలు జరిగిన ఉత్తరక్షణంలో, ముఖ్య న్యాయమూర్తి కోకా సుబ్బారావుగారు తమ న్యాయస్థానంలోకి చురుకుగా నడిచి వెళ్ళి పోయారు.

మేము భవనం వదలి తిరిగిపోతూన్న సమయంలో, కారులో, కట్జూగారు నాతో అన్నారు: "ఏమి విశ్వనాథము! మీ ప్రధాన న్యాయమూర్తి మాటవరసకైనా ఓ మారు కోర్టు భవనంలోకి రావలసిందని నన్నుగాని, నిన్నుగానీ, చివరికి మనందరికీ పెద్ద అయిన ప్రకాశంగారినిగాని పిలవలే దేమయ్యా?"

ఆయన అది అడగడానికి ముందు నా మనసులో నేనూ అదే అనుకున్నాను.

'న్యాయమూర్తుల పంథాలు ఇలా ఉంటాయి కాబోలు' అని మాలో మేము అనుకున్నాము. కోర్టు భవనాలలోకి వెళ్ళకుండానే మా బసలకు వెళ్ళిపోయాము. చిరకాల వాంఛితమైన ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రధాన న్యాయస్థానము, ఆ రోజు స్థాపన జరిగిన సంతృప్తిలో మాకు మరేమీ కనిపించలేదు.

  1. ఈ అధ్యాయంలో కొటేషన్ మార్కులలో ఉంచిన మాటలు, అసలు మాట్లాడిన మాటలకు సారాంశము.