దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బందరు న్యాయవాదులు

వికీసోర్స్ నుండి

నన్ను శ్లాఘించిరి. కాని గౌరీనాధశాస్త్రిగారినిగూర్చి పరుషవాక్యములు పల్కినందుకు నామనస్సు మిక్కిలి వ్యధజెందెను. ఆయన పూర్వాచారపరాయణు లైనను నీతిధర్మముల పాటించు చుండిరి. వేదాంతగ్రంథపఠనమునందు సంప్రీతిగల పండితుడాయన. పండితులను పూజించుచుండెను. ఆయనయందు నాకును గౌరవ ముండెను. కాని ఆనాడు ఆసభలో ఆయన పాల్గొనవచ్చినందుకు ఆశ్చర్యమునొంది కొంచెము కఠినముగనే పలికినందుకు పరితపించి, నేను పరుషములు పలికినందుకు క్షమింపుడని ఆయన పేర జాబువ్రాసి పంపితిని. అందుకు వారు మీమాటలవలన తమమనస్సు ఆయాసము చెందలేదనియు తాము క్షమింపవలసిన నేరము నే నేమియు చేసియుండలేదనియు శాంతప్రియవచనముతో జవాబువ్రాసిరి.

బందరు న్యాయవాదులు

బందురులో న్యాయవాదులుగా నున్నవారిలో ప్రముఖులు అయిదారుగురుమాత్ర ముండిరి. కక్షిదారులు పలువురు వారియొద్దకే పోవుచుండిరి. తక్కినవా రందరము జూనియర్లమే. మేము అనగా హనుమంతరావును, నేనును జూనియరులుగా పనిచేయుచుంటిమిగనుక ఒకరిక్రింద నున్నట్లే లెక్క, మాకు వచ్చెడికేసులనుబట్టి మేము బొత్తిగా హీనముగాను లేము. ప్రాముఖ్యముగాను ఉండలేదు. మాకు వచ్చెడికేసులు తక్కువయైనను జాగ్రత్తగా చేయువారమేయని పేరుమాత్రము పొందితిమి. మొత్తమున సివిల్ వ్యాజ్యముల అపీళ్ళలో ప్రముఖులు పురాణము వెంకటప్పయ్యగారు, అన్నవరపు పుండరీకాక్షుడుగారు, వావిలాల శివావధానులుగారు. వీరు మువ్వురు పైన వ్రాసినక్రమముననే పేరుపొంది యుండిరి. ఇందు అన్నవరపు పుండరీకాక్షుడుగారు కొన్నిసంవత్సరములు బాపట్ల మునసబు కోర్టులో నుండి, పిమ్మట ఫస్టుగ్రేడు ప్లీడరీపరీక్ష నిచ్చి జిల్లాకోర్టులో న్యాయవాదిగా జేరిరి. ఈయన ఎక్కువ పట్టుదలతో పనిచేయుచుండెనుగాని వెంకటప్పయ్యగారికంటె తక్కువ శ్రేణిలోనే పరిగణింపబడుచుండెను. వీ రిరువురును చాలవరకు తమ వృత్తికార్యములందు శ్రద్ధజూపుటతప్ప సంఘవిషయములుగాని దేశవిషయములుగాని వారికి పట్టకుండెను. తక్కిన న్యాయవాదులలోనైనను పలువురు అట్టివారే. వావిలాల శివావధానులుగారు తమవృత్తియందే గాక, సంస్కృతజ్ఞానము కలవారగుటచేతను, దివ్యజ్ఞానసమాజసభ్యుడగుటచేతను మతవిషయములందు శ్రద్ధజూపుచుండిరి. జంధ్యాల గౌరీనాధశాస్త్రిగారు పండితసన్మానముచేయు పండితుడు, నైష్ఠికుడు. శ్రీ వెంకటరెడ్డినాయుడు, జె. డి. శామ్యుయల్ అనువా రిరువురు క్రిమినల్ కేసులలోనే ఎక్కువగా పనిచేయుచుండువారు. వారైనను స్వకార్యములుతప్ప ఇతరవిషయము లెవ్వియు పయిబెట్టుకొనక దూరముగ నుండువారే.

రెండవతరగతి న్యాయవాదులు వయసులో చిన్నవారును, కొంత ఉత్సాహము కలిగి దేశహితైకకార్యములందు అభిమానము గలిగియుండిరి. వేమూరి వెంకటసుబ్బారావను నొక సెకండుగ్రేడుప్లీడరు బందరులో పేరుబడ్డ కుటుంబములోని వాడు. ఈయన జిల్లాకాంగ్రెసుసంఘమునకు కొంతకాలము అధ్యక్షుడుగ నుండెను. కట్టమూడి చిదంబరరా వను మరియొక సెకండుగ్రేడుప్లీడరు కల్లకపట మెరుగని సత్స్వభావుడు, దయార్ద్రహృదయుడు; కాంగ్రెస్‌సంఘవిషయములందును, ఇతర సాంఘికవిషయములందును ఉత్సాహముతో పాల్గొనుచుండెను. న్యావాదులలోనేగాక ఉపాధ్యాయులును కొందరు కాంగ్రెస్ అభిమానులు సాంఘికసంస్కరణాభిలాషులు నుండిరి. బందరులో నోబిల్‌కళాశాలయను ఆంగ్లేయవిద్యాశాల యొకటి యుండెను. దానిలో శ్రీ వేంకటరత్నంనాయుడు ఎం. ఏ. గారు ప్రసిద్ధికెక్కిన ఉపాధ్యాయులు. వీరు మతమున బ్రాహ్మసమాజికులు. మిక్కిలి నీతిధర్మదీక్షారతులై తనయొంద్ద చదివెడి విద్యార్థులకు నట్టి నీతిమార్గము పట్టుపడునట్లుచేయవలెనని ప్రయత్నము చేయుచుండిరి. ఆరోజులలో భోగముమేళములు వివాహములు మొదలగు శుభసమయములందు రప్పించి సానులచేత అభినయముతో ఆటలాడించి పాటలుపాడించుట సామాన్యముగ జరుగుచుండెను. భోగముమేళము లేనిపెండ్లి పెండ్లియేగా దనుచుండిరి. దేవాలయములలోను దేవునిఊరేగింపులందును భోగముమేళములు తప్పక నడచుచుండెను. ఈ ఉత్సవములకు వచ్చువా రనేకులు భోగముమేళమునందలి ప్రీతిచేతనే వచ్చుచుండిరి. గొప్పవారును, కొద్దివారునుగూడ తమయింట కార్యములలో భోగముమేళము లేకపోయినయెడల గొప్పలోపముగ తలంచుచుండిరి. కాని వాటియందలి అవినీతి గ్రహింపజాలకుండిరి. కాని శ్రీ వేంకటరత్నమునాయుడుగారు తమ విద్యార్థులచే అట్టిమేళము లున్నచోటికి ఎప్పుడును పోమని దీక్షపట్టించిరి. ఈ దీక్ష మాతరగతిన్యాయవాదులలోను ఉపాధ్యాయులలోను అంగీకృతమై అనుష్టింపబడుచు వచ్చెను. మొత్తమున భోగముమేళములు కొలదికాలములో బందరులో మాత్రమేగాక తక్కినగ్రామములందును ఆగిపోయెను. ఈమధ్య భోగముకులమువారిలోనే ఒక నూతనాందోళన సాగి పడపువృత్తి నీచమని గ్రహించి ఆడపిల్లలకు సక్రమముగ వివాహములు చేయనారంభించుటతో నానాట వారిలో కన్యలుగా నుండువా రరిదియై, వివాహముచేసుకొను ఆచారము ప్రబలినందున భోగముమేళములు దేశములో తరిగిపోయెను. ఇంకొక ముఖ్యకారణము దీనికి తోడ్పడెను. దేవాలయములలో దేవదాసీలుగా నుండువారి కేర్పడిన ఈనాముభూములు నౌకరీ చేయవలసిన నిర్బంధము లేకుండగనే వారికి సంపూర్ణహక్కు కలుగజేయుచు నొకశాసనము చెన్నరాజ్యములోని శాసన సభలో అంగీకరింపబడి అమలుపెట్టబడినది. అందువలన భోగము సానులు పూర్వమువలె దేవాలయములో ఆటలకు పాటలకు బోవుట మాని, ఈనాముభూములను అనుభవింపజొచ్చిరి.

ఈ మహాయత్నమునకు అంకురము శ్రీ వేంకటరత్నంనాయుడుగారి ప్రబోధమేయని చెప్పవచ్చును. ఆయనకు పిన్నవయసునందే భార్యావియోగము కలిగెను. మరల వివాహము చేసుకొనక, బ్రహ్మచర్యమునేతాల్చి, మార్గదర్శకముగ లోకమున సంచరించెను. వీరు ఆంగ్లేయభాషలో ప్రవీణులు. గొప్పవక్తలు. ఎల్లప్పుడు స్వచ్ఛమగు తెల్లని దుస్తులనుధరించుచుండెడి వారు. వీరి ప్రభావముననే పిఠాపురముజమీందారుగారు అనాధ శరణాలయమును కాకినాడలో గట్టించిరి. అందు బాలబాలికలకు కులభేదములు లేకుండ భోజనాదివసతులు, విద్యావకాశములు గల్పించిరి. శ్రీ నాయుడుగారు చెన్నపట్టణమున కాంగ్రెస్‌మహాసభనుండి నార్టన్‌చర్య నాక్షేపించుచు తమ సహచరులతో లేచివచ్చినప్పటినుండి కాంగ్రెస్‌వ్యవహారములలో పాల్గొనుటలేదు. నాయుడుగారు హరిజనబాలికలను పెంచి పెండ్లిండ్లుచేసిన జగదేకకుటుంబకులు.

బందరులో ఉపాధ్యాయులుగా నున్నపుడు కోపల్లి హనుమంతరావుగారు, భోగరాజు పట్టాభిసీతారామయ్యగారు, ముట్నూరు కృష్ణరావుగారు వీరి శిష్యులుగా నుండిరి. వీరు మువ్వురు ఆంధ్రదేశమున ప్రఖ్యాతపురుష్యులై గావించిన మహత్కార్యములు ముందు వివరించబడును. నేను బందరులో న్యాయవాదిగా నున్నకాలములో వీరు విద్యార్థులలో గణ్యత కెక్కుచుండిరి. ఆరోజులలో బందరులో కళాశాలోపాధ్యాయులుగా నుండిన చెన్నాప్రగడ భానుమూర్తిగారు నాకు రాజమహేంద్రవరములో సహపాఠి. వీరుబుద్ధికుశలురు, నిరాడంబరులు, నీతిపరులు. తెలుగునందు కవిత్వము చెప్పుచుండెడివారు. కాంగ్రెస్‌కార్యములందు పాల్గొనువారికి ఉత్సాహము కల్గించుటకు రసవంతములైన పద్యములు వ్రాసి ప్రకటించుచుండిరి. వీరివలెనే కళాశాలలో ఉపాధ్యాయులుగానుండిన శ్రీ దుగ్గిరాల రామమూర్తిగారు గొప్ప సంఘసంస్కరణాభిమాని. బ్రాహ్మసమాజసభ్యులు. ఈసందర్భమున మరియొక ప్రధానపురుషునిగూర్చి చెప్పవలసియున్నది. వల్లూరి సూర్యనారాయణరావు అనువారు హైకోర్టుపట్టా పుచ్చుకొని బందరు జిల్లాకోర్టులో న్యాయవాదిగా ప్రవేశించిరి. వయస్సున కొంచెము పెద్దలైనను నాకు సమకాలికులే. వీరు కాంగ్రెస్‌వ్యవహారములందును, సంఘ సంస్కరణవిషయములలోను ఉత్సాహముతో పాల్గొనుచుండిరి.

కాంగ్రెస్‌కమిటీసభలు పట్టణములో అప్పుడపుడు జరుగుటయేగాక వార్షికసభలు వానితోపాటు సంఘసంస్కరణసభలు కూడ జరుగుచుండెను. వెల్లటూరు, ఉయ్యూరు, నూజవీడు, నరసరావుపేట, గుంటూరు, బెజవాడమొదలగుచోట్ల ఈసమావేశములు జరిగెను. నే నప్పుడు చాల వర్షములు జిల్లాకాంగ్రెస్‌సంఘకార్యదర్శిగ నుండుటచే ఈమహాసభలలో పాల్గునుట తప్పనిసరి యయ్యను. ఈ సభలలో తెలుగుభాషలో నుపన్యసించుట నాకు బాగుగ నభ్యాసమైనది. ఒక్కొకపుడు నేను చేసిన ఉపన్యాసములను పలువురు మెచ్చుకొనుచుండిరి. అప్పుడు సామాన్యముగ ఆంగ్లేయవిద్య నేర్చినవా రొకచో చేరినపుడు ఆంగ్లేయభాషలో సంభాషించుటయు, మహాసభలలో ఆంగ్లేయభాషలో నుపన్యసించుటయు గౌరవకారణముగ నుండెను. కాంగ్రెస్‌సభలలో తప్ప తక్కిన సభలలో నేనును ఆంగ్లేయములోనే మాట్లాడుచుంటిని. కోర్టులోను, పాఠశాలలోను ఆంగ్ల మెట్లును తప్పదు. క్లబ్బులలోగూడ సంభాషణల కాంగ్లమే పరిపాటియాయెను. ఆంధ్రదేశములో నప్పుడు స్త్రీపునర్వివాహసమస్య బలముగా చర్చింపబడుచుండెను. వితంతువులైన యువతులను తలిదండ్రుల సమ్మతిగాని పోషణకర్తల సమ్మతిగాని లేకుండ రహస్యముగ గొనివచ్చి, వివాహముసేయుట ఆక్షేపణార్హముగ నెంచుచుండిరి. పూర్వాచారాపరాయణత్వముచేతనో, సంఘ బహిస్కారభయముచేతనో తలిదండ్రులీ యుద్వాహము లంగీకరింపకపోవుటచే ఈ రహస్యమార్గము లవలంబించక తప్పినది దాదు. ఇట్లుండగా బందరుతాలూకాలో నొకగ్రామమునుండి పదిసంవత్సరముల బ్రాహ్మణవితంతుబాలికను ఆమె యన్న బందరు తీసికొనివచ్చి తగినవరుడు దొరకినచో వివాహము చేయుటకు పూనుకొనెను. నోబిల్‌కళాశాలలో బి. ఏ. లోనో ఎఫ్. ఏ లోనో చదువుకొను నొకవిద్యార్థి ఆపిల్లను వివాహమాడ సమ్మతించెను. అతడు మైనరు కాడుకాని బందరులో వారికి తోడ్పడువారు లేకపోయిరి. వివాహమునకు కొంత సొమ్ము కావలసియుండెను. ఇల్లు కావలసియుండెను. పురోహితుడును అవసరమే. బందరులోనే ఈయవకాశములు దొరకనపుడు మరియొకచో బొత్తుగనే దొరకవు. ఒకనాటి రాత్రి వేమూరి సుబ్బారావుగారు, చిదంబరరావుగారు మొదలగున్యాయవాదులము, కొంద రుపాధ్యాయులును ఒక మిత్రునియింట విందునకేగి, లోకాభిరామాయణము మాట్లాడుచుంటిమి. అప్పుడు ఈబాలవితంతువివాహమునుగూర్చి ముచ్చట బయలుదేరినది. ఆబాలిక దురవస్థ కందరును పరితపించుచుండిరి. నే నంతట "మనుమాత్రము ఈ సంఘస్థితికి బాధ్యులముకాదా, మనమేల భారము పైనవేసుకొని వివాహము జరిపించకూడ?" దని ప్రశ్నించితిని. వట్టిమాటలు చెప్పువారేగాని కార్యముఖమునకు వచ్చునప్పటికి నిలుచువా రుండరని సుబ్బారావుగారు నన్ను హెచ్చరించిరి. "మీ రీ యూరిలో పేరుప్రతిష్ఠలు పొందినవారు, మీరు చేబట్టినయెడల వివాహము సుకరముగ జరగు" నని నేను మొదటిబాధ్యత వారిమీదనే పెట్టితిని. "నిలువు నిలువు మనువారేగాని తోడు నిలుచుండువా రెవ్వరు నుండ" రని మరల ఇంచుక కోపముతో వా రనిరి. వెంటనే నేను "రేపటి ఉదయం 8 గంటలకు నలుబదిమందిని మీకు తోడుగ నిల్చు వారిని సమకూర్చెదను. మీరు వివాహము జరుపు భారము వహించెదరా" యని పందెమువేసినట్లు మాట్లాడితిని. "నీవు నలుబది మందిని అంగీకరింపచేసినయెడల నేను వెనుదీయ" నని ఆయన వాగ్దానముచేసెను. కాని నే నంతమందిని సమకూర్చలే నను ధృడవిశ్వాసముతోడనే వా రట్లు చెప్పిరని తలచి, నామాటనిలుపుకొన నెంచి, అపుడే అచ్చట నున్న మిత్రులతో సంప్రదించి, వారి ఆమోదమును పొందితిని. మరునా డుదయముననే బయలుదేరి ఈ వివాహము జరుపుటకై సుబ్బారావుగారితో నిలిచి నిర్వహింతు మని నలుబదిమందిచే సంతకములు చేయించి, తొమ్మిదవ గంట కొట్టుచుండగనే సుబ్బారావుగారి కా కాగితము నందిచ్చితిని. వారు "ఇదియంతయు గాదు; నాఆప్తబంధువుల దస్కతులు కావలె"నని ఇంచుక కోపముతో వాక్రుచ్చిరి. "ఆప్తబంధువు లెవ్వ"రని ప్రశ్నించితిని. వడ్లమన్నాటి నరసింహరావు, కట్టమూడి చిదంబరరావు గార్ల పేర్లు చెప్పిరి. "ఇవిగో వారిసంతకములుగూడ ఇం దున్న"వని కాగితము చూపితిని. వా రంతట మంచిదని అంగీకరించి, మరునాడు కాబోలును, సంతకములు చేసినవారి నందరిని భోజనమునకు బిలచి, వివాహమునకు వలయు సొమ్ము, ఇల్లు, పురోహితుడు మొదలగువిషయములు నిర్ణయించిరి. సుబ్బారావుగారు దక్షిణవల్లూరుసంస్థానమువారికి దివాన్‌జీగా నుండుటవలన వల్లూరివారి దివాణము వారిస్వాధీనములోనే యుండెను. అందు వివాహము నడుపుటకును, అవనిగడ్డనుండి పురోహితుని పిలిపించుటకును, తక్కినఏర్పాటులు చేయుటకును సుబ్బారావుగారే యొప్పుకొనిరి. వివాహము శాస్త్రప్రకారము మంత్రములతో జరిగెను. సంతకములు చేసినవా రందరు హాజరైరి. నేనును కొంతమంది మిత్రులు భార్యలతోగూడ హాజరైతిమి. ఆడువాండ్రందరు పెండ్లికూతురు మధ్య నిడుకొని ఛాయాపటము తీయించుకొనిరి. ఇంతచేసితిమిగాని ఆవధూవరులతో భోజనముచేయ సాహసింపలేకపోతిమి. ఏనుగుపై అంబారీలో వధూవరుల గూర్చుండబెట్టి మేళతాళములతో ఊరేగింపు జరిపితిమి.

ఇంత బాహాటముగ నిర్లక్ష్యముగ వివాహముచేసినందుకు బ్రాహ్మణసంఘము మమ్ము సంఘబహిష్కృతు లని తీర్మానించెను. మేమును దానిని లక్ష్యపెట్టక తగిన పురోహితునివలన మాయిండ్లలో కార్యములు నడుపుకొనుచు ఒకరితోనొకరము సఖ్యముగ నుండి కొంకక జంకక వర్తించితిమి. ఆరునెలలో మెలమెల్లగ బహిష్కారము సడలిపోయెను.

1900 సంవత్సరముననో లేక మరుసటిఏడో మిత్రులము ముచ్చటించుచుండగా తెలుగున వార్తాపత్రికలు మనజిల్లాలో లేకుండుట శోచనీయమని తలచి, ఒకపత్రిక ప్రకటించుటకు ప్రయత్నములు జరుపుట యుక్తముగదా యనుకొంటిమి. దానికి తగిన ప్రయత్నము లెవ్వరును పైన బెట్టుకొనరైరి. అంతట నేనును న్యాయవాదులలో నొకరగు దాసు నారాయణరావుగారును తుదకు ఒక తెలుగువారపత్రిక ప్రకటించవలెనని నిశ్చయించుకొంటిమి. నేను ముందు కావలసిన సొమ్ము విహితుల వలన వసూలుపరచియు, కొంత స్వంతమున పెట్టుకొనియి మా యిరువురిపేరను కృష్ణాపత్రిక యను పత్రికను ప్రచురించసాగితిమి. నారాయణరావుగారు తెలుగులో నాకంటె ఎక్కువ ప్రవేశము కలవారు, సరసమైన కవిత్వముచెప్పుటకు సమర్థులు. మొదటి రోజులలోనున్నశ్రద్ధ వారికి క్రమముగా సన్నగిల్లెను. మొదటి నుండియు వ్యాసములు, వార్తలు సమకూర్చి, పత్రిక వారము నాటికి అచ్చుబడి, వెలువడు భారమంతయు నేనే పూనితిని. పత్రికాకార్యాలయమున అవటపల్లి నారాయణరా వనునొకరు గుమాస్తాగా నేర్పడిరి. ఆయన ఉత్సాహశీలి గావున సంపాదకత్వనిర్వహణమున తోడ్పడుచుండెను. పత్రికపై నభిమానము నానాట హెచ్చుచుండెనుగాని తగినంత ధనసహాయములేక సహకారములేక విశేషవ్యాప్తి కలిగింపలేకపోయితిమి. ఇంతలో నారాయణరావుగారు అకాలమరణముపొందుట సంభవించెను. పత్రికాప్రకటన మానక సాగించుచునేవచ్చితిమి. ఆయూరిలో నొక్కటే ముద్రణాయంత్రము కలదు. అందు పనులు చురుకుగ జరగక పత్రిక సకాలములో చందాదారుల కందింపలేకపోతిమి. ప్రభుత్వోద్యోగులచర్యలు తీవ్రముగ విమర్శించినందుకును, సంఘమందలి దురాచారములను ఖండించినందుకును పురజనులు మమ్ము తీవ్రవాదులని యెంచుచుండిరి. ఎన్ని లోపము లున్నను పత్రికాప్రకటనమాత్రము జరుపుచునేయుంటిమి.

ఈ సంవత్సరములలో నాకుటుంబమున కొన్ని యవాంతరములు నడచినవి. బందరుకు కాపురమునకు వచ్చునప్పటికి నాకు నాలుగేండ్ల కుమార్తె యొకతె యుండెను. పిమ్మట నిరువురు మగపిల్లలు గలిగిరి. అందొకనికి నాస్నేహితుడు చంద్రశేఖరుని పేరిడితిని. ఆ చిన్నవాడు రెండుసంవత్సరములు పెరిగి ప్లీహవ్యాధివలన చనిపోయెను. పిమ్మట కొలదిదినములకే నాభార్య ఇంకొక మగశిశువును ప్రసవించెను. స్ఫురద్రూపియగు పిల్లవానిని చూచుకొని, తల్లి పూర్వదు:ఖమును కొంత మరచిపోయెను. ఈ చిన్నవాడు మూడేండ్లలోపల మాటలన్నియు నేర్చి ఆమోదముగొల్పు సంభాషణలు చేయుచుండెను. చూచిన ప్రతివస్తువునుగూర్చి ప్రశ్నించి, తెలుసుకొనుచుండెను. రాత్రివేళల ఆకసమువంక జూచి, నక్షత్రముల వివరము లడుగసాగెను. కాని వీడును అయిదేండ్లు వచ్చునప్పటికి వ్యాధిగ్రస్తుడై 1902 లో మృతుడయ్యెను. రెండుమూడు నిమిషములలో జీవములు విడువబోవుచు ఎదుటనున్న తల్లికి రెండుచేతులు మోడ్చి నమస్కరించెను. పిమ్మట తలప్రక్కనున్న నావైపునకు ప్రయత్నపూర్వకముగ తిరిగి నమస్కరించెను. ఎన్నియో ఆశలు గొల్పిన ఈపిల్లవాడు పోవుటచే తల్లి మరింత దు:ఖసముద్రమున మునిగిపోయెను. నాకును హృదయవేదన అతిశయముగ నుండెను.


_____________