దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము

వికీసోర్స్ నుండి

కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము.

బందరులో న్యాయవాదవృత్తి ప్ర్రారంభించిన రెండు మూడుసంవత్సరములకు పిమ్మట అక్కడ అప్పటికే స్థాపించబడి వ్యవహరించుచున్న కృష్ణాజిల్లాకాంగ్రెసుసంఘములో సభ్యుడనుగా జేరితిని. ఇప్పటి గుంటూరుజిల్లాలో వంగోలు తాలూకాతప్ప తక్కినదంతయు కృష్ణాజిల్లాలోనిదే. కాంగ్రెస్‌కార్యమునందు మిక్కిలి శ్రద్ధాపేక్షలు గల సెనగపల్లి రామస్వామిగుప్త యను నొక వైశ్యయువకుడు గుంటూరు వాస్తవ్యుడు, నాకంటె పెద్ద వయస్సుకలవాడు, గుంటూరు మిషన్ కాలేజీలో గుమస్తాగా ఉన్నను దర్పముగలవ్యక్తిగా ప్రవర్తించుచుండెను. ఈతడు కృష్ణాజిల్లాకాంగ్రెస్‌మహాసభ గుంటూరులో నడిపించుటకు గొప్పప్రయత్నము చేసి సొమ్ము వసూలుపరచి, మహాసభాసమావేశము గావించెను. వావిలాల శివావధానులుగారు అధ్యక్షత వహించిరి. నే నప్పుడు బి. ఎల్. చదువుచున్న విద్యార్థినగుటచేత ఆసభకు గుంటూరులో నుండియు హాజరు కాలేదు. సభ జయప్రదముగ నడచినది. అదియే ప్రప్రధమమున కృష్ణాజిల్లాలో జరిగిన జిల్లాకాంగ్రెస్‌మహాసభ. అప్పటికి దక్షిణదేశమున నెక్కడను జిల్లామహాసభలు జరిగినట్లు గానుపించదు. ఈసభాసమావేశమునకు పిమ్మటనే బందరులో జిల్లాకాంగ్రెసుసభ స్థాపితమైనదని తలచెదను. ఆకాలములో కాంగ్రెసువిషయములలో సెనగపల్లి రామస్వామిగుప్తవంటి ఉత్సాహపురుషులు మరియొకరు లేరనియే చెప్పవచ్చును. ఆయన నిర్భయముగ ఆవేశపూరితుడై ఉపన్యసించుచుండెను. కాని ఆయన గుంటూరులో నుండువా డగుటచేత బందరులో నున్న జిల్లాసంఘముతో ఆయనకు సంబంధము లేదయ్యెను. నేను త్వరలోనే జిల్లాసంఘమునకు కార్యదర్శిగా నెన్నుకొనబడితిని. 1896 సంవత్సరమున కాబోలును కృష్ణ వరదలవలన అవనిగడ్డతాలూకా గ్రామములు నీళ్ళలో మునిగిపోయి ప్రజలు కృష్ణానదిపొడుగున కట్టలమీదను చెట్లమీదను, దిబ్బలమీద నెక్కి ప్రాణములు రక్షించుకొనిరి, పశువులు మొదలగు ఆస్తి చాలవరకు వరదలో కొట్టుకొనిపోయెను. ప్రజలు తినుటకు తిండిలేక పసిపిల్లలతోను, ముసలివారితోను, రోగులతోను పడరానిపాట్లు పడిరి. అప్పుడు నేను బందరులో చందాల నిమిత్తము తిగినను రు 130 ల కంటె ఎక్కువ వసూలు చేయలేకపోతిని. బస్తీవాసులకు కష్టపడుప్రజలపై సానుభూతి మృగ్యముగ నుండెను. అట్టి వసూలునిమిత్తము ఎవరైన సర్కారుఉద్యోగి పూనినయెడ గొప్పగా ద్రవ్యసహాయము చేసియుందురు. అంతియే కాని సామాన్యు లెంత యత్నించినను బస్తీ వాసుల హృదయములు చలింపవని తేలినది.

ఆ వచ్చినసొమ్ముతో బియ్యము, ఉప్పు, మిరపకాయ, చింతపండు కొని పడవమీద వేసుకొని, నాగుమాస్తాను తోడు దీసికొని, బందరువరకు వరదనీరు నిలచియుండుటవలన ఆనీటిమీదనే పడవ సాగించుకొనిపోయి కొందరికి ఆవస్తువులను పంచిపెట్టి ఏదో కొలదిసహాయము చేయగలిగితిని. నిజమైన సంతుష్టి లేకపోయెను. స్వయముగ శరీరకష్టము చేయగలిగితినేగాని ద్రవ్యము వెచ్చించు అవకాశము లేకపోయెను. ఆసంవత్సరమే మద్రాసుగవర్నరు వచ్చినపుడు కాంగ్రెసుకమిటీతరపున సన్మాన పత్రము సమర్పించుచు రు 130 లు చందా వసూలుచేసి వరదబాధ పడినవారికి బియ్యముమొదలగునవి కాంగ్రెసుకమిటీతరపున పంచిపెట్టబడినదని వ్రాయగా గవర్నరుగారు కాంగ్రెసువారు నూటముప్పదిరూపాయలు ఖర్చుపెట్టిరా అని హేళనచేసిరి.

మరికొంతకాలమునకు బాబూ బిపినచంద్రపాలు అను బంగాళాదేశస్థుడు, కాంగ్రెసునాయకుడు గొప్పవక్త బందరుకు వచ్చెను. ఆయన బ్రాహ్మసమాజముతరపున ఉపన్యాసము లిచ్చుపనిమీద వచ్చినను కాంగ్రెసునాయకుడగుటచే ఆయనను సన్మానించుటకు కాంగ్రెసుకమిటీ తీర్మానించెను. నేను కార్యదర్శిని. వారిని తీసుకొనివచ్చి బస ఏర్పాటు గావించితిని. ఆయన హిందూహైస్కూలులో నని జ్ఞాపకము - లేకటౌనుహాలులోనో - ప్రస్థానత్రయమునుగూర్చి మహత్తరమగు నుపన్యాసము నొసంగెను.

మరునాడు మా న్యాయవాదులును తక్కిన పురప్రముఖులు పౌరులనిమిత్తము ఏర్పడిన క్లబ్బులో వారికి విందు నేర్పాటుచేసితిమి. గోపాలరత్నంగా రనున్యాయవాది, వైశ్యులు క్లబ్బులో సభ్యులుగా నుండిరి. వారియింటిలో చక్కెరపొంగలి తయారుచేయించి ఆవిందులో వినియోగించిరి. అప్పటి నామనస్థితినిబట్టి వైఇశ్యులు చేసిన ఫలహారమును పుచ్చుకొనుట ఇష్టము లేకుండెను, కాన నేను తినలేదు. నేను తినలేదని తక్కినవారికి తెలియదు. ఇందుకు ఆయూరిలోని బ్రాహ్మణసభవారు ఆవిందులో పాల్గొన్నవారి నందరిని బహిష్కారముచేయవలె నను ఉద్దేశ్యముతో నెవ్వరో స్వాములవారు ఆసమయముననే వచ్చిఉన్నందున - వారిసభకు మమ్ముల నందరిని హాజరుకావలసినదిగా నొటీసులిచ్చిరి. మేము చాలమందిమి నిర్భయముగనే హాజరయితిమి. ఆ బ్రాహ్మణసభాపతులలో నెవ్వరో లేచి, మేము వైశ్యులయింటి ఫలహారమును భుజించితిమికాబట్టి మమ్ము బ్రాహ్మణసంఘమునుండి బహిష్కరించవలసినదని చెప్పుచు, "మీరు ఫలహారమును భుజించిరా, లేదా" యని ప్రశ్నవేయగా మమ్ము నాప్రశ్నవేయుటకు వీ రెవ్వరికిని అధికారము లేదనియు, బ్రాహ్మణసభలో సభ్యులుగా నున్నవారు చేసిన, ఇప్పటికిని చేయుచున్న ధుష్కార్యములు అనగా భ్రూణహత్యలు చేసిన వారియొద్ద, వ్యభిచారులై కులముచెడిపోయిన వితంతువుల యొద్దను రహస్యముగ డబ్బు తీసికొని వారితప్పులను కప్పిపుచ్చుచు స్వాములవారికి వారిచే దక్షిణ లిప్పించి బహిష్కారమునుండి తొలగించుటయు మొదలగు పాపకార్యము లెన్నియో చేసినవారుగనుక వారిని ముందు విచారణచేసి తగినశిక్ష విధించిన పిమ్మట మామీద ఆరోపించబడిన నేరములను విచారించవలసినదని నేనే లేచి ఘంటాపధముగ వాదించునప్పటికి ఔనౌ నని మా మిత్రు లందరు కేకవేసిరి. సభకువచ్చిన పెద్దలు అక్కడనుండి మెల్లమెల్లగ లేచిపోయిరి. వారు వెడలిపోయినపిమ్మట మేమును మాయిండ్లకు చేరితిమి. అట్లు నేను తీవ్రముగా మాట్లాడుటలో ఆసభకు వచ్చిన జంధ్యాల గౌరీనాధశాస్త్రిగారిని గూడ అట్టి దుర్మార్గులను వెనుకవేసుకొని ఏముఖముతో ఇక్కడికి వచ్చితిరని కొంచెము పరుషముగనే మాట్లాడితిని. వారును ఏమియు మారుపలుకక సభనుండి లేచిపోయిరి. నామిత్రులు నన్ను శ్లాఘించిరి. కాని గౌరీనాధశాస్త్రిగారినిగూర్చి పరుషవాక్యములు పల్కినందుకు నామనస్సు మిక్కిలి వ్యధజెందెను. ఆయన పూర్వాచారపరాయణు లైనను నీతిధర్మముల పాటించు చుండిరి. వేదాంతగ్రంథపఠనమునందు సంప్రీతిగల పండితుడాయన. పండితులను పూజించుచుండెను. ఆయనయందు నాకును గౌరవ ముండెను. కాని ఆనాడు ఆసభలో ఆయన పాల్గొనవచ్చినందుకు ఆశ్చర్యమునొంది కొంచెము కఠినముగనే పలికినందుకు పరితపించి, నేను పరుషములు పలికినందుకు క్షమింపుడని ఆయన పేర జాబువ్రాసి పంపితిని. అందుకు వారు మీమాటలవలన తమమనస్సు ఆయాసము చెందలేదనియు తాము క్షమింపవలసిన నేరము నే నేమియు చేసియుండలేదనియు శాంతప్రియవచనముతో జవాబువ్రాసిరి.

బందరు న్యాయవాదులు

బందురులో న్యాయవాదులుగా నున్నవారిలో ప్రముఖులు అయిదారుగురుమాత్ర ముండిరి. కక్షిదారులు పలువురు వారియొద్దకే పోవుచుండిరి. తక్కినవా రందరము జూనియర్లమే. మేము అనగా హనుమంతరావును, నేనును జూనియరులుగా పనిచేయుచుంటిమిగనుక ఒకరిక్రింద నున్నట్లే లెక్క, మాకు వచ్చెడికేసులనుబట్టి మేము బొత్తిగా హీనముగాను లేము. ప్రాముఖ్యముగాను ఉండలేదు. మాకు వచ్చెడికేసులు తక్కువయైనను జాగ్రత్తగా చేయువారమేయని పేరుమాత్రము పొందితిమి. మొత్తమున సివిల్ వ్యాజ్యముల అపీళ్ళలో ప్రముఖులు