దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమబీజములు

వికీసోర్స్ నుండి

నుండియే ఆంధ్రజాతీయకళాశాలకు దుర్దశ ప్రారంభమైనది. సాలునకు పదివేలరూప్యముల ఆదాయము వచ్చు భూవసతి దానికిగలదు. గాంధిమహాత్మునకు కళాశాలయందును అందు పనిచేయు పట్టాభి సీతారామయ్య, హనుమంతరావు, కృష్ణరావులయందును గల అభిమానముచేత కాంగ్రెసుచే పదునారు వేలరూపాయల నొక్కసారిగ విరాళమిప్పించిరి. ద్రవ్యానుకూలమెంత యున్నను ప్రజలలో నిజమైన జాతీయవిద్యాభిమానము లేమిచే కళాశాలోద్దేశములు నెరవేరవాయెను. నేడు స్వరాజ్యము స్వాతంత్ర్యము లభించినవి గాన ఈకళాశాలలో జాతీయవిద్యతోపాటు స్వతంత్రముగ జీవితముజరుపుటకు తోడ్పడగల చేతిపనులను నేర్పు ఏర్పాటులు జరుపుటకు ప్రభుత్వము శ్రద్ధ వహింపదగును.

అనాదిసిద్ధమైన వంగజాతి ఐక్యమునకు భంగముగావించి దాని ప్రాధాన్యమును గౌరవమును నశింపజేయుటకు కర్జను ప్రభువు చేసిన ఈ దుష్ప్రయత్నము ఆయన యనంతరమున హార్డింజి హయాములో ప్రభుత్వము విడనాడవలసివచ్చెను. పూర్తికాబడిన విభజన మరల మార్చబడదని ప్రతిజ్ఞాపూర్వకముగ ఇండియాకార్యదర్శి వచించిన వాక్యము మరల దిగమ్రింగవలసివచ్చెను.

ఆంధ్రోద్యమబీజములు

గవర్నరుజనరల్ హార్డింజి "ఒక్కభాషయు, ఒక్క మతమును, ఒక్క సంస్కృతియు గల జనులు ఏకముగ నొక్కరాష్ట్రమున నొక్కపరిపాలనలో నుండుటయే ధర్మమనియు, అట్టి ఐక్యము జాతియొక్క సర్వతోముఖాభివృద్ధికి దోహదము కల్పించుననియు ప్రకటనగావించిరి. బంగాళాదేశ విభజన మార్చి, హిందీభాషాప్రచారముగల ప్రాంతమును బీహారురాష్ట్రములో జేర్చి, బంగాళాప్రజలకు ప్రత్యేక బంగాళారాష్ట్రనిర్మాణము గావించిరి. మరల దేశమున శాంతి సమకూడెను. స్వదేశోద్యమము మెల్లమెల్లగ వెనుకడుగు వేయసాగెను. కాని హార్డింజిమొదలగువారు ప్రచురణచేసిన భాషాప్రయుక్త రాష్ట్రసిద్ధాంత వచములు దేశమున వ్యాపించెను. ముఖ్యముగ ఆంధ్రదేశమున అందున గుంటూరులోని ఆంగ్లేయ విద్యాధికులగు యువకులహృదయముల నాకర్షించెను. ఈ చెన్న రాజధానిలో ఆంధ్ర - కర్ణాటక - తమిళ - కేరళభాషలు నాలుగు ప్రచారములోనుండినను ఇట్టి ప్రత్యేకప్రాంతముల నన్నిటి నొక్క రాష్ట్రమున గూర్చి ఒక్క పరిపాలనచట్రమునందు చేర్చుటచేత పరిపాలనాసౌష్ఠవము లోపించి, మిక్కిలి అసౌకర్యముగ నుండుటచేత, ఆయాప్రాంతములందు వసించు ప్రజల అభ్యుదయమునకు పలువిధముల ఆటంకము కలుగుచున్నది. కావున ఈ వివిధభాషా ప్రాంతములను వివిధరాష్ట్రములుగ నిర్మాణముచేయుట అవసరమను విషయము మాటిమాటికి వారు చర్చింపసాగిరి.

ఇంతకు బూర్వమే నేను బందరునుంచి గుంటూరు చేరితిని. పిదపగూడ కృష్ణాజిల్లాకాంగ్రెసు సంఘముక్రిందనే గుంటూరు జిల్లాకాంగ్రెసువ్యవహారములు నడుచుచుండెను. జిల్లామహాసభ యొకటి నరసరావుపేటలో నడిచినది. అప్పుడు నేనే అధ్యక్షు డుగా వ్యవహరించితిని. శాసనసభాసభ్యులుగా నుండిన మోచర్ల రామచంద్రరావుపంతులుగారుకూడ హాజరైరి. బీదలకు ఉచితముగ విద్యనేర్పుటయేగాక మధ్యాహ్నమునందు భోజనమునకు వసత ఏర్పరుచుటకు ప్రభుత్వమువారు, విద్యాశాలాధికారులు గ్రాంటులిచ్చుట అవసరమని నా యుపన్యాసమున వచించితిని. రామచంద్రరావుగారు అది బాగుగనేయున్నది గాని సాధ్యము కాదని నిరసించిరి. ఈసభ జరిగినపిమ్మటనే స్వదేశోద్యమము ప్రారంభమై ప్రచారము తీవ్రముగ సాగి ప్రభుత్వమువారికి వేడిపుట్టించుకాలముననే తెనాలిలో కాంగ్రెసుసంఘయాజమాన్యమున మహాసభ యొకటి సమావేశమయ్యెను. ఈసభలో పాల్గొన్నవారికి ప్రభుత్వమువలన అపకారము కలుగునేమో యను సందేహము ప్రజలలో వ్యాపించెను. ఆసభకు నేను అధ్యక్షత వహించుటకై బండి ఎక్కబోవుచుండగా మాతంరిగారు "నిన్ను జనులు కోరుటయు నీవు అంగీకరించి సభలో అధ్యక్షతవహించుటకు బోవుటయు గౌరవముగ నున్నది గాన నాకు ఆనందముగనే యున్నది గాని నీవు మాత్రము సర్కారువారి వలన ఉపద్రవము రాకుండ తగుజాగ్రత్తతో ప్రవర్తించవలసిన"దని మెల్లగ హెచ్చరికచేసిరి. వారి హృదయమున గల సందేహమును గ్రహించితిని గాని అందువిషయమై భయ మేమియు నాకు గలుగలేదు.

తెనాలిలో ఈసభ 1907 లో జరిగినదని జ్ఞాపకము. ఈ సభకు పలువురు హాజరైరి. పోలీసువారు కొందరు సభ నిమిత్తము వేయబడిన పందిరవెలుపల తిరుగాడుచుండిరి. పోలీసులు లోనికి రాకూడదని తెలియపరచితిని. దానిపైనొక సబినస్పెక్టరు కొంత గడబిడ చేయసాగించెను. కొందరు మిత్రులు శాంతవచనములుచెప్పిభద్రముచేసిరి. సభకుచెన్నపట్టణమునుంచి హైకోర్టువకీలు శ్రీపురాణమునాగభూషణముగారుకూడవిచ్చేసిరి. గుంటూరునుండి న్యాపతి హనుమంతరావుగారును హైస్కూలులో ఉపాధ్యాయులుగా నున్న జగన్నాధరావుగారును గూడ హాజరైరి. అప్పటికింకను గ్రాంటుబడులలో ఉపాధ్యాయులు రాజకీయములలో పాల్గొనగూడదను నిషేధము పుట్టలేదు. సభలో విదేశవస్తుబహిష్కారమును స్వదేశవస్తుప్రోత్సాహమును చేయవలయునని తీవ్రచర్చ జరిగినది. కొంత కలకలము బుట్టెను. తీరుమానమునకు అనుకూలురను ప్రతికూలురను లెక్కపెట్టవలసివచ్చెను. పంక్తులవరుసను తిరిగి నేనే స్వయముగ లెక్కపెట్టగా అనుకూలురసంఖ్య మిక్కిలి హెచ్చుగ తేలినందున కరతాళధ్వానములు మిన్నుముట్టెను. సభ మరికొన్ని తీర్మానములుచేయుటతో ముగుసెను. పోలీసువారితో తొందరలేకుండ జరిగిపోయినందున కందరును సంతసించిరి.

కాంగ్రెసు సభాకార్యములు కృష్ణా గుంటూరు జిల్లాలు చేరిన విశాలదేశఖండమున సంతుష్ఠిగ జరుపుటకు అవకాశము లేకుండెను. ప్రతిసంవత్సరము వార్షికమహాసభ ఒక్క జిల్లాలో జరుగుట కవకాశములేక రెండేండ్లకొకసారి జరుపవలసివచ్చెను. ఇందువలన ప్రజలలో కాంగ్రెసువ్యవహారములనుగూర్చిన ఉత్సాహము శ్రద్ధావిశేషములు తగ్గిపోవుచుండెను. స్థానికములైన ఇబ్బందులనుగూర్చిన విచారణకు అవకాశము కొఱతబడసాగెను. కావున గుంటూరు ప్రత్యేకజిల్లాగా విభజనకాబడినది. కాబట్టి కృష్ణాజిల్లాకాంగ్రెసుసంఘమునుండి విడిపోయి, గుంటూరుజిల్లాలోని కాంగ్రెసువాదులు గుంటూరుజిల్లాసంఘము ప్రత్యేకముగ నేర్పరచవలెనని ఉద్యుక్తులగుచుండిరి.

సొంతవ్యవహారములు

ఒకనాడు పాతగుంటూరు వెళ్లునప్పటికి నాతమ్ములిరువురును బిగ్గరగ అరచుచు తగవాడుచుండుటయేగాక ఒకరినొకరు కొట్టుకొనబోవుచుండిరి. నే నప్పు డిరువురను విడిపించి అట్లు బజారున బడుట అవమాన మని చెప్పి శాంతింపజేసితిని. కాని వారిరువురమధ్య సరిపడక మధ్యమధ్య తగవులాడుచునేయుండిరి. వారి భార్యలమధ్య మనస్పర్ధ లేర్పడెను. మా తండ్రిగారికి వీరిర్వురు నొకచోట కాపురముచేయజాల రని తోచెను. కుటుంబపు టాస్తిని పంపకముచేసి వేరింటికాపురములు పెట్టుటకు నిర్ధారణచేసుకొనిరి. "నీ వేమనియెద" వని నన్ను ప్రశ్నించిరి. నేను వారితో నేకీభవించితిని. భాగములు పరిష్కరించుటకు నా భార్యమేనమామగారైన మద్దులూరి సీతారామయ్యగారిని పిలిపించవలసినదని వారు సెలవిచ్చిరి. నా తమ్ముని భార్య నా భార్యకు పెదతల్లికుమార్తెయే గాన సీతారామయ్యగారు నాచినతమ్మునకు అనుకూలురే. పెదతమ్ముడు సూర్యనారాయణ చిన్నవానికంటె కొంతపరిజ్ఞానము కలవాడు కాన సీతారామయ్యగారి మధ్యవర్తిత్వము నంగీకరించెను. కుటుంబపు టాస్తిలో నాకు భాగము పంచనక్కరలేదు, తమ్ము లిరువురకే సమముగా పంచివేయవలసినదని మాతండ్రిగారితో చెప్పితిని. వా రందుకు