తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 284

వికీసోర్స్ నుండి

రేకు: 0284-01 శ్రీరాగం సం: 03-482 శరణాగతి


పల్లవి :

కొలిచినవారి పాలి కొల్లలివివో
యిల నిట్టి దైవమవు యిఁక వేరేకలరా


చ. 1:

యెట్టైన నభయహస్త మెత్తుక కాచుకున్నాఁడ-
వట్టె దాసులఁ గాచేనంటా నీవు
తొట్టిన పాపాలు పోఁదోలు నీ నామమంత్రాలు
జట్టిగా లోకాల వెదచల్లినాఁడవు


చ. 2:

తలఁచినవారికెల్లా ధనధాన్యా లిత్తునంటా
వొలసి శ్రీసతి మోచుకున్నాఁడవు
యిలఁ బావనులఁగా నిందరిఁ జేసేనంటా
నెలమిఁ బాదతీర్థ మేరు చేసినాఁడవు


చ. 3:

పుట్టించ జీవులను భువనము లోపల
గట్టిగ బ్రహ్మను నాభిఁ గన్నాఁడవు
అట్టుగఁ బాలుపడి చుట్టి రక్షకత్వానికే
యిట్టే శ్రీవేంకటాద్రి యెక్కినాఁడవు

రేకు: 0284-02 భైరవి సం: 03-483 మాయ


పల్లవి :

కాను స్వతంత్రుఁడననఁ గాదని తలఁగ లేను
నేను నీ కింకరుఁడ నీ రచనలే


చ. 1:

యెంతైనాఁ దీరదిదే యెందుచూచిన పనులు
అంతటాను నీమాయ అలయించగా
దొంతులగుఁ గర్మములు తోడనే తిరిగీని
సంతకూటపు బ్రతుకు సటలఁబెట్టీని


చ. 2:

మాన వింద్రియము లివి మతిలోనఁ బెరరేఁచు
నానాగము(తు?)లఁ బ్రకృతి నటియించఁగా
పూని పురాకృతములు పోనీక తిరిగీని
సానఁ బట్టిన వయసు సటలఁబెట్టీని


చ. 3:

తరువులనే పెట్టీని తతిలేని యాసలివి
నిరతంపు జన్మములు నిడుసాగఁగా
వరుస శ్రీవేంకటేశ్వర నీవు నన్నేలి
కరుణించఁగా భక్తి ఘనత మీరీని

రేకు: 0284-03 భూపాళం 03-484 ధనుర్మాసం


పల్లవి :

ఏమి నిద్దిరించేవు యెందాఁకాను
కామించి బ్రహ్మాదులెల్లఁ గాచుకున్నా రిదివో


చ. 1:

పులుఁగాలుఁ బచ్చళ్ళు బోనము పెట్టినదిదే
వెలయు ధనుర్మాస వేళయు నిదే
బలసి సంకీర్తనపరులు పాడేరిదే
జలజాక్షుఁడ లేచి జలక మాడవయ్యా


చ. 2:

తోడనే గంధాక్షతలు ధూపదీపా లివిగో
కూడిన విప్రుల వేద ఘోషణ లివే
వాడుదేరఁ బూజించవలెఁ గమ్మఁబువ్వులివె
వీడెమిదె కొలువుకు విచ్చేయవయ్యా


చ. 3:

చదివేరు వైష్ణవులు సారెఁ దిరువాము డిదె
కదిసి శ్రీసతి ముందే కాచుకున్నది.
అదనాయ శ్రీవేంకటాధిప మా చరపిదే
యెదుట నిన్నటిమాపే యియ్యకొంటివయ్యా

రేకు: 0284-04 శుద్ధవసంతం సం: 03-485 కృష్ణ


పల్లవి :

చేరి యశోదకు శిశు వితఁడు
ధారుణి బ్రహ్మకు దండ్రియు నితఁడు


చ. 1:

సొలసి చూచినను సూర్యచంద్రులను
లలి వెదచల్లెడు లక్ష్మణుఁడు
నిలిచిన నిలువున నిఖిలదేవతల
కలిగించు సురలగనివో యితఁడు


చ. 2:

మాటలాడినను మరి యజాండములు
కోటులు వొడమేటి గుణ రాశి
నీటగు నూర్పుల నిఖిలవేదములు
చాటువ నూ రేటి సముద్ర మితఁడు


చ. 3:

ముంగిటఁ బొలసిన మోహన మాత్మలఁ
బొంగించే ఘనపురుషుఁడు
సంగతి మా వంటి శరణాగతులకు
నంగము శ్రీవేంకటాధిపుఁ డితఁడు

రేకు: 0284-05 సాళంగం సం: 03-486 వైష్ణవ భక్తి


పల్లవి :

జీవన్ముక్తులము శ్రీపతి దాసులము
భావించవో మమ్మును ప్రపంచపు మాయా


చ. 1:

యివల దానధర్మము లేమిఁ జేయుట లేదు
తవిలిన పాతకాలు దైవమే వహించుకొనె
భువిలోన నా కిఁక బుట్టఁబని లేదు లేదు.
భవరోగవైద్యుఁడు శ్రీపతి గలఁడు గాన


చ. 2:

యెలమి స్వర్గాది లోకాలేమీఁ గోరుట లేదు
కల వైకుంఠము హరి కాలమునాఁడే యిచ్చె
తొలుత నాకుఁ జావుల తోడి సడ్డ వద్దు వద్దు
బలువైన యచ్యుతుని బంట్లము గాన


చ. 3:

పూపసుఖమూ నొల్లము పొంచి దుఃఖమూ నొల్లము
చేపట్టి బ్రహ్మానందము శ్రీవేంకటేశుఁ డిచ్చెను
దూపయు నాఁకటికిఁగా తోదోపు మా కిఁక వద్దు
కాఁపమృతమథనుఁడు గలఁ డిట్టే కాన

రేకు: 0284-06 పాడి సం: 03-487 శరణాగతి


పల్లవి :

కాపులము నేము కర్తవు నీవు
దాపుదండై మము నిట్టే దయఁజూడవయ్యా


చ. 1:

నెట్టన నైదుగురికి నేము డాగుపెట్టేము
చుట్టి చుట్టి వీడుఁ బట్టుచూపి వున్నది.
అట్టె కర్మములకు సరిగోరు వెట్టేము
నట్టుకొట్టి(ట్టే?) జీవులకు నరకములేలయ్యా


చ. 2:

మించిన యాసలకిదే మేరలెల్లాఁ బెట్టేము
పొంచి మమతలలోఁ గాఁపుర మున్నారం(ము?)
పంచేంద్రియములకే పైరులు సేసితిమి
అంచెలఁ బ్రాణులకిఁక నానాజ్ఞలేలయ్యా


చ. 3:

కూరిమి విషయముల కొట్నాలు దంచేము
చేరి నీవు చెప్పినట్టే సేసేము
యీరీతి శ్రీవేంకటేశ యిటు నీకే దాసులము
ఆరూఢిగా మన్నించితివంతే చాలు నౌనయ్యా