తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 283

వికీసోర్స్ నుండి

రేకు: 0283-01 దేసాళం సం: 03-476 అధ్యాత్మ


పల్లవి :

నేరుపు నతఁడే నేరమి నతఁడే
భారమెల్ల నాతఁడే పని లేదు మాకు


చ. 1:

దేవుఁడట యంతరాత్మ దేహమెంచి చూచితేను
పోవుల కర్మాలు సేయఁ బుట్టినదట
జీవుఁ డేఁటివాఁ డిందు శ్రీపతియానాజ్ఞఁ గాక
భావించఁ బాపపుణ్యాలు పనిలేదు మాకు


చ. 2:

హరి లోకాలేలునట అతని మాయకు లోనై
నరుల జీవనములు నడచీనట
వెరవులు మాకేల విష్ణుఁడే యింతాఁ గాక
పరచు విచారాలు పనిలేదు మాకు


చ. 3:

వేడుక నాలుకను శ్రీవేంకటేశు నామమట
పాడితో నాతనికి నే బంటనట
తోడునీడ యాతఁడే తోవ చూప నాతఁడే
పాడయిన కోరికలు పనిలేదు మాకు

రేకు: 0283-02 శంకరాభరణం సం: 03-477 నామ సంకీర్తన


పల్లవి :

మునుల తపము నదె మూలభూతి యదె
వనజాక్షుఁడే గతి వలసినను


చ. 1:

నరహరి నామము నాలుక నుండఁగ
పర మొకరి నడుగఁ బనియేల
చిరపుణ్యము నదె జీవరక్ష యదె
సరుగఁ గాచు నొకసారె నుడిగినా


చ. 2:

మనసులోననే మాధవుఁ డుండఁగ
వెనుకొని యొకచో వెదకఁగనేఁటికి
కొనకుఁగొన యదే కోరెడి దదియే
తనుఁ దా రక్షించుఁ దలఁచినను


చ. 3:

శ్రీవేంకటపతి చేరువ నుండఁగ
భావ కర్మముల భ్రమయఁగనేఁటికి
దేవుఁడు నతఁడే తెరువూ నదియే
కావలెనంటేఁ గావకపోఁడు

రేకు: 0283-03 వరాళి సం: 03-478 వైరాగ్య చింత


పల్లవి :

విత్తాకటి పెట్టితేను వేరొకటి మొలచునా
యెత్తిన శ్రీహరి నీవే యీడేర్చవయ్యా


చ. 1:

పాపపుణ్యదేహికి బంధములే సహజము
యేపునఁ గాదని తోయ నెట్టువచ్చును
పూపవంటి మనసుకు భోగములే సహజము
తేపగా విరతి యెందుఁ దెచ్చుకొనేమయ్యా


చ. 2:

మాయల జన్మమునకు మమతలే సహజము
యేయెడఁ జోరక మాననెట్టువచ్చును
కాయవంటి గుణానకు కర్మమే సహజము
చాయల నే మెటువలె శాంతిఁ బొందేమయ్యా


చ. 3:

తప్పని జ్ఞానమునకు దైవమే సహజము
యెప్పుడు స్వతంత్రుఁడుగా నెట్టువచ్చును
నెప్పున శ్రీవేంకటేశ నీ మహిమే ఇంతాను
చెప్పఁజూపఁ జోటులేదు చేరివుండేమయ్యా

రేకు: 0283-04 మాళవిగౌళ సం: 03-479 దశావతారములు


పల్లవి :

ధరలో నా జన్మమే తనువు నదియె
యిరవై నీ దాసుఁడైతే హీనుఁడైనా ఘనుఁడే


చ. 1:

అల రావణుని తమ్ముఁ డసురనరభోజనుఁ-
డలరి తొల్లెల్లా నీ వాఁడైన మీఁదను
కులజుఁడు పుణ్యుఁడు గుణనిధి యిందరునుఁ
దలఁప యోగ్యుఁడు నట దాస్యమహి మెట్టిదో


చ. 2:

జాతిబోయ పాతకుఁడు సత్యతపుఁడట తొల్లి
నీతి నరణియ నేటి నీ దాసుఁ జేరి
ఆతల బ్రహ్మఋషాయ నష్టాక్షర మంత్రాన
చేఁతల నీ దాసుల సేవాఫల మెట్టిదో


చ. 3:

నానాజంతువులందు నవభక్తి గలిగితే
హీనాధిక్యము లేక యేచి కాతువు
శ్రీనాథ కాచితివి శ్రీవేంకటేశ మమ్ము
నేనూ ధన్యుఁడనైతి నీమహిమ యెట్టిదో

రేకు: 0283-05 శంకరాభరణం సం: 03-480 విష్ణు కీర్తనం


పల్లవి :

తెలిసినవారికి దేవుఁ డితఁడే
వలవని దుష్టుల వాదము లేలా


చ. 1:

పురుషుల లోపలఁ బురుషోత్తముఁడు
నరులలోన నరనారాయణుఁడు
పరదైవములకుఁ బరమేశ్వరుఁడు
వరుస మూఢుల కెవ్వరో యితఁడు


చ. 2:

పలు బ్రహ్మలకును పరబ్రహ్మము
మలయు నీశులకు మహేశుఁ డితఁడు
ఇల నాత్మలలో నిటు పరమాత్ముఁడు
ఖలుల కెట్లుండునో కానము యితఁడు


చ. 3:

వేదంబులలో వేదాంతవేద్యుఁడు
సోదించ కరిఁ గాచుచో నాదిమూలము
యీదెస శ్రీవేంకటేశుఁ డిందరికి
గాదిలి మతులనుఁ గైకొనఁ డితఁడు

రేకు: 0283-06 లలిత సం: 03-481 శరణాగతి


పల్లవి :

సంసారికిఁ గల సహజమిది మతిఁ
గంసారి మనకుఁ గలఁ డటుగాన


చ. 1:

చేతులు చాఁచుచు సేయఁగఁ దొడఁగిన
ఘాతల నిన్నీఁ గర్మములే
వాతులు మోవఁగవలెనని వెదకిన
పూఁతల నిన్నియు భోగములే


చ. 1:

వొగి లంపటముల కోపిక గలిగిన
జగమింతాఁ బో సంపదలు
జగిఁ జిత్తములోఁ జింతించి చూచిన
సగుణంబింతా సంతోషములు


చ. 1:

యేచిన శ్రీవేంకటేశ్వరుఁ గొలిచిన
చూచినవెల్లా సులభములే
తాచి యీతనికె దాసులమయితిమి
కాచె నతఁడు మముఁ గడమలు లేవు