తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 258

వికీసోర్స్ నుండి

రేకు: 0258-01 సామంతం సం: 03-331 వైరాగ్య చింత


పల్లవి :

ఇంకనైన హరిఁ జేరు యింతే చాలు
సంకెలెల్లాఁ బెడఁబాపి చక్కఁజేసీ నతఁడే


చ. 1:

యెఱఁగక పుట్టితివి యిన్నియోనులందుఁ దొల్లి
తఱినాఁటి కాయఁబోయ దానికేమి
నెఱి నఱకములో నాని తివియుఁ గొన్నాళ్ళు
తఱవాయి దెలుసుకో దానికేమి


చ. 2:

 పాపపుణ్యములుసేసి పరులఁగొలిచి తొల్లి
తాపములఁ బొందితివి దానికేమి
వూపసంసారము నమ్మి పుంగుఁడై యిన్నాళ్ళదాఁకా
దాపులేక బ్రతికితి దానికేమి


చ. 3:

జగములో వారిఁ జూచి సారెసారె నాసలనే
దగదొట్టె నీకుఁ దొల్లి దానికేమి
జిగి శ్రీవేంకటపతి చిత్తములో నున్నవాఁడు
తగవెంచుకో జీవుఁడ దానికేమి

రేకు: 0258-02 ముఖారి సం: 03-332 నామ సంకీర్తన


పల్లవి :

గోవిందాది నామోచ్చారణ కొల్లలు దొరకెను మనకిపుడు
ఆవల నీవల నోరఁ గుమ్మలుగ నాడుద మీతనిఁ బాడుదము


చ. 1:

సత్యము సత్యము సకలసురలలో
నిత్యుఁడు శ్రీహరి నిర్మలుఁడు
ప్రత్యక్షమిదే ప్రాణుల లోపల
అత్యంతము శరణనరో యితని


చ. 2:

చాటెడి చాటెడి సకలవేదములు
పాటించిన హరి పరమమని
కూటఁస్థుఁ డితఁడు గోపవధూపతి
కోటికి యీతనిఁ గొలువరో జనులు


చ. 3:

నిలుచున్నాఁ డిదె నేఁడును నెదుటను
కలిగిన శ్రీవేంకటవిభుఁడు
వలసినవారికి వరదుఁ డీతఁడు
కలఁడు గలఁ డితనిఁ గని మనరో

రేకు: 0258-03 దేసాక్షి సం: 03-333 మనసా


పల్లవి :

ఒక్కఁ డెవ్వఁడో పుర్వికి దైవము
యెక్కువ నాతని నెరఁగవో మనసా


చ. 1:

వొట్టిన జీవుల కొక బ్రహ్మ గలఁడు
పట్టిన విప్రులు బ్రహ్మలమందురు
నట్టనడుమవారే నవబ్రహ్మలు
జట్టిగ బ్రహ్మల సంతాయ జగము


చ. 2:

కైలాసంబునఁ గలఁ డొక రుద్రుఁడు
తాలిమి నేకాదశరుద్రులు మరి
కాలరుద్రుఁడును కడపట నదివో
చాలిన రుద్రుల సంతాయ జగము


చ. 3:

అవతారంబున నలరిన విష్ణువు
అవలవిష్ణుమయమనియెడి విష్ణువు
భువి శ్రీవేంకటమున నున్నాఁ డిదె
జవళి వరంబుల సంతాయ జగము

రేకు: 0258-04 దేవగాంధారి సం: 03-334 వైరాగ్య చింత


పల్లవి :

ఇంకనైనా రోయరాదా యీపాటీవార మింతే
మంకుఁదనమేల మామాట వినరాదా


చ. 1:

తోలుబొంత గట్టుకొన్నదొర నింతే నన్ను నీవు
కూళసంసారమా యేల కొసరేవు
యీలకొన్న యెముకల ఇంటిలో కాఁపుర మింతే
యేల మాయ వెంటఁబెట్టే వేమి గద్దు నీకును


చ. 2:

పంచభూతపు చుట్టాల బదుకులోవాఁడ నింతే
యెంచ కింద్రియయాచకు లేల వచ్చేరు
కంచపు గాలావటించే కలిమిలోవార మింతే
చంచలపుటాసలు చేయి చాఁచనేఁటికి


చ. 3:

 నెత్తురుజలదుర్గాన నిలిచినవాఁడ నింతే
జొత్తుఁబాపములు యేల చోటడిగేరు
హత్తిన శ్రీవేంకటేశుఁడాత్మలోన నున్నవాఁడు
మత్తపుటజ్ఞానమా మమ్మేమి చూచేవు

రేకు: 0258-05 మలహరి సం: 03-335 విష్ణు కీర్తనం


పల్లవి :

తమ యెఱుక తమకుఁ దగినంతే
నెమకిన మాకును నీకృప యింతే


చ. 1:

పొఁగ నీ నాభినిఁ బుట్టిన బ్రహ్మలు
యెసఁగిన నీ పూర్వ మెఱిఁగేరా
వెస నీ ముఖమున వెడలిన వేదము
దెల నీమహిమ తెలియఁగఁగలదా


చ. 2:

నగుచు నీమాయల నడచే జగములు
సొగసి నీ మూరితి చూపెడినా
తగ నినుఁ గానఁగ తపించు మునులును
పొగరుల మము నిఁక బోధించేరా


చ. 3:

అంతేసివారల కటువలె నుండఁగ
వింతజీవులకు వివేక మెట్లొకో
యింతట శ్రీవేంకటేశ నీవే మము
చెంతఁజేరి దయసేయఁగదే

రేకు: 0258-06 శంకరాభరణం సం: 03-336 వైరాగ్య చింత


పల్లవి :

ఎన్నఁడు దెలిసే మెచ్చరికెపుడో
ఇన్నియుఁ గన్నవె యెఱిఁగీ నెఱఁగ


చ. 1:

నిన్నటియాఁకలి నేఁడూ నున్నది
కన్నదినంబే కడచనెను
పన్ని నిదుర మాపటికి నున్నదదె
యెన్నఁగ రాతిరి యెందో పోయ


చ. 1:

కాయపు సుఖములు గంపల నున్నవి
పాయమే కైవాలి పండెనదే
యీయెడ సంసార మింటనే వున్నది.
చేయును నోరును చెనటై నిలిచె


చ. 1:

విడువని జన్మములు వెంటనే వచ్చీ
తడవేటి మోక్షము దవ్వాయ
యెడపక శ్రీవేంకటేశ నీ మఱఁగు
బడిఁ జొచ్చితి నా భారము నీది