తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 228

వికీసోర్స్ నుండి


రేకు: 0228-01 సామంతం సం: 03-156 వైరాగ్య చింత

పల్లవి:

ముందరఁ గలదని మోసపోతి నిదె
యిందునే తుదిపద మెక్కితినా

చ. 1:

కాయము మోచితి ఘడన గడించితి
చేయారబుణ్యము సేసితినా
పాయము గైకొంటి పలు రుచులెరిఁగితి
రోయదగిన విల రోసితినా

చ. 2:

నిదుర మేల్కనితి నిక్కల గంటిని
హృదయపు విజ్ఞాన మెఱిఁగితినా
చదువులు చదివితి జపములు సేసితి
మది చంచలములు మానితినా

చ. 3:

అందరిఁ గొలిచితి నన్నియుఁ జూచితి
నెందునైన మేలెఱిఁగితినా
కందువ శ్రీవేంకటపతి నీవే
చెంది కాచితివి చెదరితినా


రేకు: 0228-02 శంకరాభరణం సం: 03-157 రామ

పల్లవి:

సీతారమణ వో శ్రీరామచంద్ర దా-
దాత లక్ష్మణుఁడదే తగు రామచంద్ర

చ. 1:

చెలువపు సింగారాల శ్రీరామచంద్ర నీ-
సెలవుల నవ్వుగారీ శ్రీరామచంద్ర
చెలఁగీ చెక్కులఁ గళ శ్రీరామచంద్ర
మొలచె మోహనము నీ మోమున రామచంద్ర

చ. 2:

చిక్కని మురిపెముల శ్రీరామచంద్ర
చిక్కులేదు పెద్దకొప్పు శ్రీరామచంద్ర
చిక్కె నీచే మదనుఁడు శ్రీరామచంద్ర
చొక్కపు నున్నని మేనిసొంపు రామచంద్ర

చ. 3:

చేవదేరిన సిగ్గుల శ్రీరామచంద్ర
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీరామచంద్ర
యీవల దాసరిపల్లె నిరవుకొని మీ-
సేవకుల మమ్మునేలే శ్రీరామచంద్ర


రేకు: 0228-03 దేవగాంధారి సం: 03-158 వైరాగ్య చింత

పల్లవి:

ఎందునైనా మీరఁబోతే నెవ్వరికి జవిగాదు
యిందరిలోఁ దన కొలఁ దెంచుకొనవలెను

చ. 1:

మంచితనమే వలె మాటలాడే యప్పుడెల్లా
కొంచికొంచి యుండవలె కోపపువేళ
వంచన యెప్పుడూ వలె వరుస ఘనులఁ గంటే
చంచలము మానవలె సతతము దేహికి

చ. 2:

భ్రమయకుండఁగ వలె పడఁతులఁ గంటేను
తమకించకుండవలె తన్నుఁ దిట్టితే
సుముఖుఁడై యుండవలె చూచినవారికి నెల్ల
అమరి యుండఁగవలె నన్నిటాను దేహికి

చ. 3:

కైవశమై యుండవలె ఘనపుణ్యములకెల్ల
దైవము నమ్మఁగవలె తనువెత్తితే
యీవల శ్రీవేంకటేశుఁడితనికే శరణని
భావించి బ్రతుకవలె పనివడి దేహికి


రేకు: 0228-04 మలహరి సం: 03-159 శరణాగతి

పల్లవి:

సర్వేశ్వరా నీకు శరణుచొచ్చితి మిదే
వుర్విలోన నేమెంచే వుపమ లేమున్నవి

చ. 1:

వెలయ నేమిటికైనా వెరవకుండేనంటే
యెలమి ధైర్యము నీవియ్యక లేదు
బలిమి చూపెద నేపట్టుననైనా నంటే
చెలఁగి నీవే లోని చేతనాత్మకుఁడవు

చ. 2:

జగములోపల నేనెచ్చరికై వుండేనంటే
అగపడి బుద్ది నీవియ్యక లేదు
పగటు సంసారము భ్రమ విడిచేనంటే
మగటిమిగల నీవు మాయానాథుఁడవు

చ. 3:

కేవల మీ పుట్టుగును గెలిచి వుండేనంటే
ఆవేళ నీవు ముక్తియ్యక లేదు
శ్రీవేంకటేశ్వర నీకు చేకానుకిచ్చేనంటే
లావుసంపదల నీవు లక్ష్మీనాథుఁడవు


రేకు: 0228-05 భైరవి సం: 03-160 శరణాగతి

పల్లవి:

ఆతఁడే యిన్నియు నిచ్చు నడిగినవల్లాను
చేతిలోనే వుండఁగాను చింతించరు హరిని

చ. 1:

వలెనంటే సంపదలు వట్టి యలమటఁబెట్టు
అలసి వోపనంటేను అండనే వుండు
తలఁచి యిందరు నీతరితీపులఁ జిక్కి
తలఁచ రెందును బరతత్త్వమైన హరిని

చ. 2:

ఆసపడితే నింతులు అన్నిటాను బిగుతురు
వాసితో నుంటేనే తామే వత్తు రొద్దికి
పోసరించి యిందరు నీ పొందుల భ్రమలఁ బడి
పాసి వున్నారదే తమ పతియైన హరిని

చ. 3:

గట్టిగా రాతిరెల్లాను కలయైయుండు జగము
పట్టపగలైతే తమ పాల నుండును
బట్టబయలు పందిలి పెట్టేరుగాని చే-
పట్టరు శ్రీవేంకటాద్రిపైనున్న హరిని


రేకు: 0228-06 సాళంగనాట సం: 03-161 కృష్ణ

పల్లవి:

పైకొని చూడరో వుట్ల పండుగ నేఁడు
ఆకడ గొల్లెతలకు నానందము నేఁడు

చ. 1:

ఆదికాలమునఁ గృష్ణు డవతరించినయట్టి-
ఆదట శ్రావణ బహుళాష్టమాయను
దాదాత రోహిణినక్షత్రము గూడె నడురేయి
సాదించ లోకులకెల్లా జయంతియాయను

చ. 2:

వసుదేవునిని దేవకిని మన్నించి కృష్ణుఁ-
డెసఁగి రేపల్లెకు నేతెంచుటాయను
కొసరి యశోదా నందగోపులకుఁ బుత్రోత్సవ-
మసమున నిచ్చి మించె నన్నిటా మేలాయను

చ. 3:

తొట్టిన రాకాసులతోడఁ గూడ భువిమీఁద
నట్టె కంసుని మదము హతమాయను
రట్టడి శ్రీవేంకటేశుఁ డిట్టె వీధుల నెల్ల
జట్టిగా మెరసే యట్టి సంభ్రమములాయను