తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 227

వికీసోర్స్ నుండి


రేకు: 0227-01 దేసాళం సం: 03-150 కృష్ణ

పల్లవి:
పచ్చిదేరుచు నుట్ల పండుగాయను
గచ్చులకు గొల్లెతలు కాఁగిలించి పట్టగా

చ. 1:

పీతాంబరముమీఁద పెద్ద కిరీటముమీఁద
నేతిపాలచార లెల్ల నిండె నదివో
జాతి గొల్లెతల వుట్లు సారెఁ గోలలెత్తి కొట్టి
చేతులు చాఁచారగించి చిమ్మి రేఁగఁగాను

చ. 2:

సొరిది సొమ్ములమీఁద సోయగపు చెక్కులపై
పెరుగులు మీఁగడలు పేరుకొనెను
అరుదుగ వీధులను అందరి వుట్లు గొట్టి
దొరతనములతోడ దొమ్మి సేయఁగాను

చ. 3:

పూని శ్రీవేంకటేశుపై పొందెలమేలుమంగపై
తేనెలునుఁ జక్కెరలుఁ దెట్టెగట్టెను
నానావిధములను నడుమ నుట్లు గొట్టి
ఆనందాన నారగించి అలరుచుండఁగను


రేకు: 0227-02 ధన్నాసి సం: 03-151 నృసింహ

పల్లవి:

వీఁడె వీఁడె కూచున్నాఁడు వేడుకతో గద్దెమీఁద
వాఁడి ప్రతాపము తోడి వరదానసింహము

చ. 1:

అరయఁ బ్రహ్లాదుని ఆపదోద్ధారసింహము
గిరివై యిందిరకును క్రీడాసింహము
నిరతి సురల భయనివారణసింహము
సరి హిరణ్యకసిపు సంహారసింహము

చ. 2:

ఇట్టె విశ్వమునకు నేలికైన సింహము
గట్టిగ శరణాగతులఁ గాచే సింహము
దిట్టయై వేదాలలోని తెరవేఁటసింహము
నెట్టుకొనిన దురితనివారణసింహము

చ. 3:

అంచల మూఁడుమూర్తుల కాధారమైన సింహము
పంచల మునుల భాగ్యఫలసింహము
పొంచి శ్రీవేంకటాద్రికి భూషణమైన సింహము
చెంచుల అహోబలపు శ్రీనారసింహము


రేకు: 0227-03 లలిత సం: 03-152 అధ్యాత్మ

పల్లవి:

సర్వసులభుఁ డితఁడు సర్వేశ్వరుఁడు
గర్వముఁ బాసితేను కానవచ్చు నితని

చ. 1:

చింతలెల్లా నుడిగితే శ్రీపతి యందేవుండు
మంతనాన నుండితేను మరి నాతఁడే
పంతపు వుబ్బు మానితే పరమాత్ముఁడు దోడౌను
వింతలు దలఁచకుంటే విశ్వరూపమే

చ. 2:

వెడకర్మాలు దోసితే విష్ణుని సాన్నిధ్యమబ్బు
కడునాస లొల్లకుంటే కలఁడాతఁడు
వొడ లోముకొనకుంటే వుపేంద్రుఁడు రక్షించు
పొడిఁబడకుంటేనే పూర్ణభావ మలరు

చ. 3:

ఇతర మెరఁగకుంటే నిందిరానాథుఁడు మెచ్చు
సతిబారిఁ బడకుంటే జంటౌ నాతఁడు
హితవులు గోరకుంటే నెదుటఁ శ్రీపతి నిల్చు
జితేంద్రియవ్రతమందే శ్రీవేంకటేశుఁడు


రేకు: 0227-04 నాట సం: 03-153 నృసింహ

పల్లవి:

నానాటికిఁ బెరిగీని నరసింహము
ఆనుక వరములిచ్చీ నౌభళపుసింహము

చ. 1:

వేఁడి ప్రతాపముతోడ విభవాలు మెరయుచు
మూఁడుమూర్తు లొక్కటైన ముఖ్యసింహము
వాఁడివాఁడి కోరలతో వడి నసురఁ జక్కాడి
తీఁడేటి మీసాలతోడి దేవదేవసింహము

చ. 2:

సరుస శంఖచక్రాది సకలాయుధాలు వట్టి
పరబ్రహ్మమే తానైన పటుసింహము
వరుసఁ గొలువులు దేవతలెల్లాఁ జేయఁగాను
తిరమైన కృపతోడి దివ్యసింహము

చ. 3:

కేలి సింహాసనముపై కిరీటము ధరియించి
చాలు వేయిచేతుల కాంచనసింహము
పాలించి ప్రహ్లాదుని భక్తుల పాలిటి కిలు-
వేలుపై శ్రీసతితో శ్రీవేంకటాద్రి సింహము


రేకు: 0227-05 మాళవి సం: 03-154 నృసింహ

పల్లవి:

ఎందుఁ జూచినా నీవే ఇదివో నీ ప్రతాపము
నందకధరుఁడ నీకు నమో నారసింహా

చ. 1:

అచ్చలపు బ్రహ్మాండమది నీకుఁ బెద్దగుహ
చెచ్చెర నహోబలాద్రి సింహాసనము
అచ్చటఁ గనకదైత్యుఁ డాహారపుమెగము
విచ్చనవిడిఁ జెలఁగు విజయనారసింహా

చ. 2:

జలధు లేడును నీకు జలకపు మడుగులు
అలరి భూమెల్లా విహారదేశము
కెలన రేలుఁబగళ్లు కిందిమీఁది రెప్పలు
వెలయఁగ విహరించు విజయనారసింహా

చ. 3:

చక్కటి శ్రీమహాదేవి జంటైన ఆడుసింహము
నిక్కపు దేవతలెల్లా నీ పిల్లలు
యెక్కవై శ్రీవేంకటాద్రి నిన్నిటా భోగించేవు
వెక్కసమై మమ్మేలుకో విజయనారసింహా


రేకు: 0227-06 శ్రీరాగం సం: 03-155 రామ

పల్లవి:

శరణు వేఁడెద యజ్ఞసంభవ రామ
అరసి రక్షించు మమ్ము నయోధ్యారామా

చ. 1:

ధారుణిలో దశరథతనయ రామ
చేరిన యహల్యను రక్షించిన రామ
వారిధిబంధన కపివల్లభ రామ
తారకబ్రహ్మమైన సీతాపతి రామ

చ. 2:

ఆదిత్యకులాంబుధిమృగాంక రామ! హర-
కోదండ భంజనము చేకొనిన రామ
వేదశాస్త్రపురాణాదివినుత రామ
ఆదిగొన్నతాటకాసంహార రామా

చ. 3:

రావణుని భంజించిన రాఘవ రామ
వావిరి విభీషణవరద రామా
సేవ నలమేల్మంగతో శ్రీవేంకటేశుఁడవై
యీవల దాసులనెల్లా నేలినట్టి రామా