తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 211

వికీసోర్స్ నుండి


రేకు: 0211-01 దేసాళం సం: 03-061 శరణాగతి

పల్లవి:

తన సొమ్మీడేరించక తా మానీనా
పెనఁగుచు నే మూరకే బిగిసేముఁ గాక

చ. 1:

భూమితోఁ బ్రపంచ మెల్లఁ బుట్టించిన దేవుఁడు
ఆ మీఁది పారుపత్యాన కందుకోపఁడా
నామమాత్ర జీవులము నడుమంతరాల వచ్చి
నేము గర్తల మనుచు నిక్కేముఁ గాక

చ. 2:

యెనలేక యెదిరికి ఇనుమడిచేవారికి
తన తగర మడువఁ దడవయ్యీనా
గునిసి సంసారపు కొండనే మోచేనంటా
తినికేమిదియు వట్టి దీమసముఁ గాక

చ. 3:

చిత్తములో నున్నట్టి శ్రీవేంకటేశ్వరుఁడు
మత్తిల్లి ననుఁ గావక మానఁబొయ్యీనా
కొత్తగా నీతని నేఁడు కొలిచేమనుచు నేము
తత్తరపు స్వతంత్రానఁ దగిలేముఁ గాక


రేకు: 0211-02 ముఖారి సం: 03-062 వేంకటగానం

పల్లవి:

తాము స్వతంత్రులు గారు తమయంతను
ఆమీఁదటి గురి అది నీవు

చ. 1:

యెలమి స్వర్గమేలేటి ఇంద్రునికినైనాను
అలమి కోరేటి ఫలమది నీవు
బలిమిఁ గైలాసమేలే పతి రుద్రునికినైనా
నిలుకడైన పదము నీ పదము

చ. 2:

యెక్కుడు సత్యలోకము యేలే బ్రహ్మకునైనా
ఇక్కువఁ జేరేచోటు యెందును నీవు
వెక్కసపుఁ బుణ్యముల వేదములకైనాను
అక్కరతో ముఖ్యమైన అర్థమెల్లా నీవు

చ. 3:

నాఁడు నాఁడే ముక్తులైన నారదశుకాదులకు
నేఁడును విహరించే నెలవు నీవు
పోఁడిమి శ్రీవేంకటేశ పోలించ నెవ్వరూ లేరు
మూడులోకముల నీవే మూలము నీవే


రేకు: 0211-03 గౌళ సం: 03-063 గురు వందన, నృశింహ

పల్లవి:

చింతలు రేఁచకు మమ్ము చిత్తమా నీవు
పంతముతో మముఁగూడి బతుకుమీ నీవు

చ. 1:

తల్లి శ్రీమహాలక్ష్మి తండ్రి వాసుదేవుఁడు
ఇల్లు మాకు బ్రహ్మాండమింతా నిదె
బల్లిదపు హరిభక్తి పాఁడీఁబంటా నాకు
వొల్లము కర్మఫలము లొకటి నేము

చ. 2:

జ్ఞానమే మాకు ధనము సర్వవేదములు సొమ్ము
వూనిన వై రాగ్యమే వుంబళి మాకు
ఆనిన గురుసేవలు ఆఁడుబిడ్డలు నాకు
మేనితోనే తగులాయ మేలు మాకుఁ జేరెను

చ. 3:

యేలికె శ్రీవేంకటేశుఁడింటి దేవపూజ మాకు
పాలు గల బంధువులు ప్రపన్నులు
కీలు మాకు నీతని సంకీర్తన మోక్షమునకు
యేలా ఇంకా మాకు నేమిటితో గొడవ


రేకు: 0211-04 ఆహిరి సం: 03-064 అధ్యాత్మ

పల్లవి:

ఎక్కడ నున్నారో సురలెవ్వరు భూమికి దిక్కో
తొక్కులఁబడె జీవుఁడు దుండగీల చేతను

చ. 1:

ఆసలనియెడి వెఱ్ఱియంగడి వెంటాఁ దిప్పె
దోసిలొగ్గించె దైన్యము దొరలెదుట
యీసుల నాఁకటి(లి?) విషమేమైనాఁ దినిపించె
గాసిఁబడె జీవుఁడిదె కన్నవారి చేతను

చ. 2:

కడుఁ గోపపు భూతము కాయమెల్లా మఱపించె
వడి నజ్ఞానపు టేరు వరతఁగొట్టె
నడుమఁ బాపపుచొక్కు నరకపుగుంటఁ దోసె
గడుసాయ జీవుఁడిదె కన్నవారి చేతను

చ. 3:

భవము సంసారపు బందెలదొడ్డిఁ బెట్టించె
తగి(వి?)లింద్రియపు తాళ్లు దామెనఁ గట్టే
యివల శ్రీవేంకటేశుఁ డింతలో దిక్కయి కాచె
కవడు వాసె జీవుఁడు కన్నవారి చేతను


రేకు: 0211-05 సాళంగనాట సం: 03-065 అద్వైతము

పల్లవి:

ఏ దెస మోక్షము లేదు యెవ్వరికి ననేరు మీ-
వేదాంత శ్రవణము వెట్టికిఁ జేసేరా

చ. 1:

అంతా బ్రహ్మమైతే నాతుమా వొక్కటియైతే
చింతింప గురుఁడు లేఁడు శిష్యుడూ లేఁడు
బంతినే ముక్తుఁడూ లేఁడు బద్దుఁడూ లేఁడిట్లయితే
వంతుల సత్కర్మమెల్ల వఱతపాలాయఁబో

చ. 2:

యిహమెల్లాఁ గల్లనేరు యేఁటికిఁ బుట్టినవారు
సహజమే యిదనేరు చావనేఁటికి
మహి మీకు బోధించిన మహాత్ము శంకరాచార్యుఁ-
డహరహ మేమైయున్నా నాతనికేది గతి (?)

చ. 3:

కొందరికి సుఖమిది కొందరికి దుఃఖమిది
యిందుఁ జిక్కి బ్రహ్మమునకీ ఘోరమేలా
అందిన శ్రీవేంకటేశుఁ డంతరాత్ముఁ డొక్కఁడింతే
మందలించి కొలువరు మంటికా మీ జ్ఞానము


రేకు: 0211-06 పాడి. సం: 03-066 శరణాగతి

పల్లవి:

వాఁడివో వీఁడివో హరి వలసినవారికెల్లా
మూఁడు లోకముల మరి మొరఁగఁ జోటేది

చ. 1:

బహిరంతరాన హరి ప్రత్యక్షమై యుండఁగాను
సహజానఁ బ్రత్యక్ష విచారమేల
ఇహములోఁ గలవెల్లా యీతని లీలై యుండఁగా
విహరించే లీల వేరే వెదకనేలా

చ. 2:

మనికై యన్నిటానుండి మాటలాడుచుండఁగాను
వెనక హరి మాటలు వేరేవున్నవా
కనుచూపతఁ డంతటా కలగొనఁ జూడఁగాను
చనవిచ్చి కృపాదృష్టి చల్లుమననేలా

చ. 3:

నెలవై యాతఁ డిన్నిటా నిండుకొనియుండఁగాను
అలరి వేరే వచ్బీనననేలా
యెలమి శ్రీవేంకటేశు యిచ్చకొలఁదే యింతా
పలుమారు నిట్టట్టని భావించఁ దగునా