తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 210

వికీసోర్స్ నుండి


రేకు: 0210-01 భూపాళం సం: 03-055 శరణాగతి

పల్లవి:

నీ యాధీనములింతే నిఖిల ప్రపంచమును
మాయాకృతము నీవు మానుమంటే మానదా

చ. 1:

నీకు నరుహంబైన నిండిన యీ మనసు
కాకువిషయాల పాలుగా నరుహమా
చేకొని నీవు పెరరేఁచిన యీ చైతన్యము
పైకొని అకర్మముల పాలు సేయఁదగునా

చ. 2:

అంచల నీ వంతర్యామివైన యీ దేహము
పంచేంద్రియముల కొప్పన సేతురా
యెంచఁగ నీకుక్షిలోన నెత్తిన యీ జన్మము
కొంచెపు భోగములకు గురి సేయవలెనా

చ. 3:

శ్రీవేంకటేశ నీకుఁ జిక్కిన యీ దాస్యము
యీవల సంసారమున కియ్యవలెనా
దేవుఁడవు వీవేయని తెలిపితివిదే మాకు
జీవులము మమ్మునిఁక చిమ్మిరేఁచ నేఁటికి


రేకు: 0210-02 సాళంగనాట సం: 03-056 వైష్ణవ భక్తి

పల్లవి:

ఈమాట విని నిన్ను నిందుకే నవ్వితి నేను
నేమమెంత నేమెంత నీ కరుణ యెంత

చ. 1:

సకలకర్మము చేత సాధ్యముగాని నీవు
వొక ఇంచుకంత భక్తి కొగి లోనైతి
ప్రకటించి బహువేదపఠనఁ జిక్కని నీవు
మొకరివై తిరుమంత్రమునకుఁ జిక్కితివి

చ. 2:

కోటిదానములచేత కోరి లోనుగాని నీవు
పాటించి శరణంటేనే పట్టి లోనైతి
మేటి వుగ్రతపముల మెచ్చి కైకొనని నీవు
గాటపుదాసులై తేనే కైకొని మన్నించితి

చ. 3:

పెక్కుతీర్థములాడిన బేధించరాని నీవు
చొక్కి నీముద్రవారికి సులభుఁడవు
గక్కన దేవతలకుఁ గానరాని నీవు మాకు
నిక్కడ శ్రీవేంకటాద్రి నిరవైతివి


రేకు: 0210-03 లలిత సం: 03-057 శరణాగతి

పల్లవి:

వేఱొకచోట లేఁడు వీఁడివో హరి
వీఱిడియై చేరువనే వీఁడివో హరి

చ. 1:

మునుకొని వెదకితే ముక్కునూర్పు గాలికొన
వెనవెనకఁ దిరిగీ వీఁడివో హరి
పెనఁగి వెదకఁబోతే పెడచెవుల మంత్రమై
వినవచ్చీ మాటలలో వీఁడివో హరి

చ. 2:

సోదించి వెదకితేను చూపులకొనలనే
వీదుల నెందు చూచినా వీఁడివో హరి
అదిగొని వెదకితే నట్టే నాలికకొన
వేదమై నిలిచినాఁడు వీఁడివో హరి

చ. 3:

తెలిసి వెదకఁబోతే దేహపు టంతరాత్మయై
వెలుపలా లోపలాను వీఁడివో హరి
చెలఁగి శ్రీవేంకటాద్రిఁ జేకొని మమ్ము రక్షించ
వెలసె నిందరుఁ జూడ వీఁడివో హరి


రేకు: 0210-04 బౌళి సం: 03-058 అధ్యాత్మ

పల్లవి:

బోధింపరే యెరిఁగిన బుధులాల పెద్దలాల
శ్రీధరుని మాయలలోఁ జిక్కితిమి నేము

చ. 1:

దైవమును నొల్లము ధర్మమును నొల్లము
దావతి సంసారముతో తగులే కాని
భావపు భవబంధాల భయమూ నెరఁగము
వేవేలు విధులే కాని వేగిలేచి నేము

చ. 2:

ముందు విచారించము మొదల విచారించము
పొందేటి సతులతోడి భోగమేకాని
చెందిన మనసులోని చింతలను బాయము
మందపు మదమేకాని మాపుదాఁకా నేము

చ. 3:

పరమూఁ దడవము భక్తీఁ దడవము
అరిది ధనముమీఁది ఆసలే కాని
ఇరవై శ్రీవేంకటేశుఁ డేలుకొనెఁ దానే నన్ను
నిరతి నెరఁగనైతి నే నించుకంతాను


రేకు: 0210-05 శ్రీరాగం సం: 03-059 అంత్యప్రాస

పల్లవి:

మఱి యే పురుషార్థము మావంక లేదు మీకు
అఱువడము మా కెంత అత్తువో నీవు

చ. 1:

హరి నీవు నాకు నంతర్యామివైన ఫలము
తిరిగినందే మా వెంటఁ దిరిగెదవు
ఇరవుగ నీవు మాకు నేలికవైన ఫలము
గరిమె మా పాపమెల్లఁ గట్టుకొంటివి

చ. 2:

భువిలోన నీవు నన్నుఁ బుట్టించిన ఫలము
ఇవల రక్షించే తొడుసిదొకటాయ
తివిరి నన్ను నీకుక్షిఁ దెచ్చిడుకొన్నఫలము
జవళి నా నేరములు చక్కఁబెట్టఁబడెను

చ. 3:

గారవాన నన్ను వెనక వేసుకొన్న ఫలము
చేరి నన్ను బుణ్యునిఁగాఁ జేయవలసె
ఆరసి నాకుఁ బ్రత్యక్షమైన ఫలమున నన్ను
యీరీతి శ్రీవేంకటేశ ఇముడుకోఁబడెను


రేకు: 0210-06 ఆహిరి సం: 03-060 అధ్యాత్మ

పల్లవి:

ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
నే నిన్నుఁ దలఁచినది నిమిషమూ లేదు

చ. 1:

పాయమెల్ల సఁసారముపాలే పడితిఁ గాని
చేయార నీసేవ నేఁ జేసుట లేదు
కాయమెల్ల కాంతలకే కడుశేషమాయఁగాని
నీ యవసరములందు నే నొదుగలేదు

చ. 2:

చిత్తము ఆసల పాలే సేసి బదికితిఁ గాని
హత్తి నిన్ను ధ్యానము సేయఁగలేదు
సత్తెపు నా నాలుకెల్ల చవుల కమ్మితిఁ గాని
మత్తిలి నీ కీర్తనము మరపుటా లేదు

చ. 3:

పుట్టుగెల్లా నజ్ఞానముపొంతనే వుంటిఁ గాని
వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని
యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యీ
నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు