తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 204

వికీసోర్స్ నుండి


రేకు: 0204-01 లలిత సం: 03-019 శరణాగతి

పల్లవి:

కడు నజ్ఞానపు కరవుకాలమిదె
వెడలదొబ్బి మా వెరపు దీర్చవే

చ. 1:

పాపపు పసురము బందెలు మేయఁగ
పోపుల పుణ్యము పొలివోయ
శ్రీపతి నీకే చేయి చాఁచెదము
యేపున మమ్మిఁక నీడేర్చవే

చ. 2:

యిలఁ గలియుగమను యెండలు గాయఁగ
చెలఁగి ధర్మమను చెరు వింకె
పొలసి మీ కృపాంబుధి చేరితి మిదె
తెలిసి నాదాహము తీర్చవే

చ. 3:

వడిగొని మనసిజవాయువు విసరఁగ
పొడవగు నెఱుకలు పుట మెగసె
బడి శ్రీవేంకటపతి నీ శరణము
విడువక చొచ్చితి వెసఁ గావఁగదే


రేకు: 0204-02 గుజ్జరి సం: 03-020 శరణాగతి

పల్లవి:

భావించి నేరనైతి పశుబుద్ధి నైతిని
యీవల నా యపచార మిది గావవయ్యా

చ. 1:

హరి నీవు ప్రపంచమందుఁ బుట్టించితి మమ్ము
పరము నే సాధించేది బలుద్రోహమవుఁ గాదో
సిరుల నేలేటివాఁడు చెప్పినట్టు సేయక
విరసాలు బంట్లకు వేరే సేయఁ దగునా

చ. 2:

పంచేంద్రియములు నాపైఁ బంపువెట్టితివి నీవు
యెంచి వాని నే దండించేదిది నేరమౌఁ గాదో
పెంచేటి తల్లిదండ్రులు ప్రియమై వడ్డించఁగాను
కంచము కాలఁ దన్న సంగతి యాబిడ్డలకు

చ. 3:

మిక్కిలి సంసారము మెడఁగట్టితివి నాకు
అక్కర నే వేసారేది అపరాధమవుఁ గాదో
దిక్కుల శ్రీవేంకటాద్రి దేవుఁడ నీవియ్యఁగాను
యెక్కడో జీవుఁడ నేను యెదురాడఁ దగునా


రేకు: 0204-03 రామక్రియ సం: 03-021 కళ్యాణ కీర్తనలు

పల్లవి:

గరుడధ్వజం బెక్కె కమలాక్షు పెండ్లికి
పరుష లదివో వచ్చెఁ బైపై సేవించను

చ. 1:

పాడిరి సోబాన నదే భారతియు గిరిజయు
ఆడిరి రంభాదులై న అచ్చరలెల్ల
కూడిరి దేవతలెల్ల గుంపులై శ్రీవేంకటాద్రి
వేడుకలు మీరఁగ శ్రీవిభుని పెండ్లికిని

చ. 2:

కురిసెఁ బువ్వులవాన కుప్పలై యెందు చూచిన
మొరసె దేవదుందుభి మోఁతలెల్లను
బెరసె సంపదలెల్ల పెంటలై శ్రీవేంకటాద్రి
తిరమై మించిన దేవదేవుని పెండ్లికిని

చ. 3:

వేసిరి కానుకలెల్ల వేవేలు కొప్పెరల
పోసిరదే తలఁబ్రాలు పుణ్యసతులు
ఆసల శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁ దాను
సేసలు వెట్టినయట్టి సింగారపు పెండ్లికి


రేకు: 0204-04 గుండక్రియ సం: 0౩-౦22 అధ్యాత్మ

పల్లవి:

ఇతర చింత లిఁక నేమిటికి
అతఁడే గతియై అరసేటివాఁడు

చ. 1:

కర్మమూలమే కాయము నిజ-
ధర్మమూలమే తన యాత్మ
అర్మిలి రెంటికి హరియొకఁడే
మర్మ మీతడే మనిపేటివాఁడు

చ. 2:

బహుభోగమయము ప్రపంచము
నిహితజ్ఞానము నిజముక్తి
ఇహపరములకును యీశ్వరుఁడే
సహజపుఁ గర్తై జరపేటివాఁడు

చ. 3:

అతిదుఃఖకరము లాసలు
సతత సుఖకరము సమవిరతి
గతి యలమేల్మంగతో శ్రీవేంకట
పతి యొకఁడిన్నిటఁ బాలించువాఁడు


రేకు: 0204-05 శంకరాభరణం సం: 03-023 వైష్ణవభక్తి

పల్లవి:


అచ్చుత మిమ్ముఁ దలఁచే యంతపని వలెనా
యిచ్చల మీవారే మాకు నిహపరా లియ్యఁగా

చ. 1:

మిమ్ము నెఱిఁగిన యట్టి మీ దాసుల నెఱిఁగే
సమ్మతివిజ్ఞానమే చాలదా నాకు
వుమ్మడి మీ సేవ సేసుకుండేటి వైష్ణవుల
సమ్ముఖాన సేవించుటే చాలదా నాకు

చ. 2:

నిరతి నీకు మొ క్కే నీడింగరీలకు
సరవితో మొక్కుటే చాలదా నాకు
పరగ నిన్నుబూజించే ప్రపన్నులఁ బూజించే
సరిలేని భాగ్యము చాలదా నాకు

చ. 3:

అంది నీకు భక్తులైన యల మహానుభావుల
చందపువారిపై భక్తి చాలదా నాకు
కందువ శ్రీవేంకటేశ కడు నీ బంటుబంటుకు
సందడిబంట నవుటే చాలదా నాకు


రేకు: 0204-06 బౌళి సం: 03-024 నామ సంకీర్తన

పల్లవి:

నవనీత చోర నమో నమో
నవమహిమార్ణవ నమో నమో

చ. 1:

హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ
నరసింహ వామన నమో నమో
మురహర పద్మనాభ ముకుంద గోవింద
నరనారాయణరూప నమో నమో

చ. 2:

నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ
నగధర నందగోప నమో నమో
త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక-
నగరాధినాయక నమో నమో

చ. 3:

వై కుంఠరుక్మిణీవల్లభ చక్రధర
నాకేశవందిత నమో నమో
శ్రీకర గుణనిధి శ్రీవేంకటేశ్వర
నాకజనన(???)నుత నమో నమో