తాళ్ళపాక పదసాహిత్యం/మూడవ సంపుటం/రేకు 203

వికీసోర్స్ నుండి


రేకు: 0203-01 సామంతం సం: 03-013 గురు వందన

పల్లవి:

పురుషుల నీ గతి బోధించి బోధించి
సురతసమాధియందుఁ జొక్కించే రదివో

చ. 1:

కొంకక సతుల నేటి గురువు లందరికి
కంకిగా మర్మాలు సోఁకఁగ హర్షించి
లంకెలను బంచాంగుళహస్త మస్తకమున
వుంకువఁ దమ యంగము వుపదేశించేరు

చ. 2:

మదనమంత్రములెల్ల మరి చెవిలోనఁ జెప్పి
మొదల నఖాంకురపుముద్రలు వెట్టి
పది మారులుఁ దమ్ములప్రసాదములు వెట్టి
వుదుట సంసారబ్రహ్మ ముపదేశించేరు

చ. 3:

బడలించి అనంగపర వస్తువును జూపి
కడపటి విరక్తిఁ గడు బోధించి
తడవి శ్రీవేంకటేశు దాసులఁ దప్పించి
వుడివోని జీవులకు నుపదేశించేరు


రేకు: 0203-02 గుజ్జరి సం: 03-014 అధ్యాత్మ

పల్లవి:

ఇంతేపో వారివారి హీనాధికము లెల్ల
పంతాన తామేపాటి భాగ్యమునా పాటే

చ. 1:

అందరిలో దేవుఁడుండు అందధికులు గొందరు
కొందరు హీనులై కుందుదురింతే
చెంది వీచే గాలొకటే చేనిపంటా నొకటే
పొంది గట్టి కొలుచుండి పాల్లు కడఁబడును

చ. 2:

పుట్టు గందరి కొకటే భూమిలో యేలికలును
వెట్టిబంట్లుఁ గొందరై వీఁగుదురింతే
చుట్టి వరిగురుమతో జొన్నగింజ సరిదూఁగు
తెట్టెలై మేలొకటికి తీలొకటి కాయ

చ. 3:

కోరి శ్రీవేంకటపతి కుక్షిలోనే లోకములు
ఆరయఁ గిందెడుమీఁదెడై వున్నవింతే
యీరీతి నితని దాసు లెక్కిరి పొడవులకు
తారి కిందికి దిగిరి దానవులై కొందరు


రేకు: 0203-03 లలిత సం: 03-015 అధ్యాత్మ

పల్లవి:

అన్నిటా నా పాలిటికి హరి యాతఁడే కలఁడు
యెన్నికగాఁదుదిపద మెక్కితిమి మేలు

చ. 1:

కొందరు జీవులు నన్నుఁ గోపగించినా మేలు
చెంది కొందరట్టె సంతసించినా మేలు
నిందించి కొందరు నన్ను నేఁడే రోసినా మేలు
పొందుగ కొందరు నన్నుఁ బొగడినా మేలు

చ. 2:

కోరి నన్నుఁ బెద్దసేసి కొందరు మొక్కినా మేలు
వేరే హీనుఁడని భావించినా మేలు
కూరిమిఁ గొందరు నన్నుఁ గూడుకుండినా మేలు
మేరతో విడిచి నన్ను మెచ్చకున్నా మేలు

చ. 2:

యిప్పటికిఁ గల పాటి యెంత పేదయినా మేలు
వుప్పతిల్లు సంపద నాకుండినా మేలు
యెప్పుడు శ్రీవేంకటేశు కే నిచ్చిన జన్మమిది
తప్పు లే దాతనితోడి తగులమే మేలు


రేకు: 0203-04 ధన్నాసి సం: 03-016 అధ్యాత్మ

పల్లవి:

ఊరకే నీ శరణని వుండుటే నా పనిఁ గాక
యీ రీతి నా వుపాయము లేడ కెక్కీనయ్యా

చ. 1:

ముందే అంతర్యామివై మొగి నాలో నుండఁగాను
చెంది నిన్ను లేనివానిఁ జేసుక నామనసులో
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా
ఇందుఁ గల్పితధ్యానము లెట్టు చేసేనయ్యా

చ. 2:

కన్నులఁ జూచినందెల్ల కమ్మి నీవై యుండఁగాను
అన్నిటాఁ బ్రత్యక్షమందు అభావన చేసుకొని
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు
పన్నిన ప్రయాసాలఁ బడనేటికయ్యా

చ. 3:

శ్రీవేంకటాద్రిమీఁద శ్రీపతివై కొలువుండి
ఆవటించి తలఁపులో నచ్చొత్తి నట్టుండఁగాను
దేవుఁ డెట్టివాఁడంటా తెగని చదువులందు
సోవలుగా నింకనేమి సోదించేనయ్యా


రేకు: 0203-05 రామక్రియ సం: 03-017 కృష్ణ

పల్లవి:

భూమిలోనఁ గొత్తలాయఁ బుత్రోత్సవ మిదివో
నేమపు కృష్ణజయంతి నేఁడే యమ్మా

చ. 1:

కావిరి బ్రహ్మాండము కడుపులో నున్నవాని
దేవకి గర్భమున నద్దిర మోచెను
దేవతలెల్ల వెదకి తెలిసి కాననివాని
యీవల వసుదేవుఁడు యెట్టు గనెనమ్మా

చ. 2:

పొడవుకుఁ బొడవైన పురుషోత్తముఁడు నేఁడు
అడరి తొట్టెల బాలుఁడాయనమ్మ
వుడగక యజ్ఞ భాగ మొగి నారగించేవాఁడు
కొడుకై తల్లి చన్ను గుడిచీనమ్మా

చ. 3:

పాలజలధి యల్లుండె(డై?) పాయకుండే యీతనికి
పాలవుట్ల పండుగ బాఁతే(తా?)యనటే
ఆలరి శ్రీవేంకటాద్రి నాటలాడనే మరిగి
పేలరియై కడు పెచ్చువెరిగీనమ్మా


రేకు: 0203-06 లలిత సం: 03-018 వేంకటగానం

పల్లవి:

అందాఁకా నమ్మలేక అనుమానపడు దేహి
అంది నీ సొమ్ము గనక అదియుఁ దీరుతువు

చ. 1:

నీదాసుఁడన నేటి నిజబుద్ధి గలిగితే
ఆ దెస నప్పుడే పుణ్యుఁడాయ నతఁడు
వేద(దు?)తో నొక్కొక్కవేళ వెలుతులు గలిగితే
నీదయవెట్టి వెనక నీవే తీరుతువు

చ. 2:

తొలుత నీ శరణము దొరకుటొకటే కాని
చెలఁగి యా జీవునికిఁ జేటు లేదు
కలఁగి నడుమంత్రాన గతిదప్ప నడచిన
నెలకొని వంకలొత్త నీవే నేరుతువు

చ. 3:

నీవల్లఁ గొరత లేదు నీ పేరు నొడిగితే
శ్రీవేంకటేశ యిటె చేరి కాతువు
భావించలేకుండఁగాను భారము నీ దంటేఁ జాలు
నీవారి రక్షించ నీవే దిక్కౌదువు